న్యూఢిల్లీ, నవంబర్ 7: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని పది బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఎంపిక చేసిన రుణాలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తించనున్నదని పేర్కొంది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎంసీఎల్ఆర్ 8.35 శాతం నుంచి 8.60 శాతం మధ్యలోకి దిగొచ్చాయి. దీంతో ఒక్కరోజు కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ని 10 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో వడ్డీరేటు 8.45 శాతం నుంచి 8.35 శాతానికి దిగిరాగా, నెల రుణాలపై వడ్డీ కూడా 8.40 శాతం నుంచి 8.35 శాతానికి దించింది బ్యాంక్.
అలాగే మూడు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు కోత విధించడంతో వడ్డీరేటు 8.45 శాతం నుంచి 8.40 శాతానికి దిగిరాగా, ఆరు నెలల రుణ రేటు 8.55 శాతం నుంచి 8.45 శాతానికి దించిన బ్యాంక్..ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటును 8.55 శాతం నుంచి 8.50 శాతానికి తగ్గించింది. రెండేండ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటును 8.60 శాతం నుంచి 8.55 శాతానికి, మూడేండ్ల రుణాలపై వడ్డీరేటును 8.65 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గించినట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
డిపాజిట్లను ఆకట్టుకోవడానికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణ ప్రజలకు 2.75 శాతం మొదలుకొని గరిష్ఠంగా 6.60 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నది. అలాగే సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీని చెల్లిస్తున్నది. ఈ వడ్డీరేటు రూ.3 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే వర్తించనున్నదని పేర్కొంది.