మైక్రోస్కోప్‌ల పెట్టి సూసినప్పుడు అవుపడె చాలా సున్నితమైన అంశాలను మాక్రో లెవెల్లో సూపెట్టిన కథలె ఈ రొమాంటిక్ డాగ్ కథలు. దేశరాజు కథకుడిగా అందరికీ సుపరిచితమే! ఏ కథల పోటీలో సూసిన తన పేరు ఏదో ఒక బహుమతి పొందిన కథ పక్కనే అవుపడ్తుంటది. ఈ మధ్యనే తన నుంచి వచ్చిన ఈ కథల పుస్తకం టైటిల్ చాలావరకు కన్ఫ్యూజన్లో… ఆలోచనలో పడేసింది. ఎన్ని మంచి కథలున్నప్పటికీ ఒక పాఠకున్ని ప్రాథమికంగా ఆకట్టుకొని సదివేలా చేసేది టైటిలే. దేశరాజు ఈ విషయంలో పాఠకులను చాలా బాగా ఆకట్టుకున్నారనిపించింది.
నేను కూడా అలా ఆకర్షితుడినై రొమాంటిక్ డాగ్ బుక్‌ని కొనుక్కొ న్న. ఇందులో మొత్తం 12 కథలున్నాయి. కుక్కలు ఒక్కోసారి కంట్రోల్ తప్పి ఆగమాగం ఉరుకంగా చాలాసార్లే సూసినం గానీ, ఇక్కడ డాగ్ అనే ఆ కుక్క రద్దీగా ఉన్న ఒక నగరంలో తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఆగమాగం చేస్తే మనుషుల తెలివితక్కువ తనంతో ఎన్ని లొల్లులవుతయో… మూర్ఖంగా ఎన్ని మత కలహాలు పుడుతయో ఊహించని ఒక మైక్రో సబ్జెక్టుతో సమాజంలోని మనుషుల వైఖరులను చక్కగా సెప్పిండ్రు. మరో కథ సాఫ్ట్ టార్గెట్‌ను సదువుతున్నంత సేపు నేనొక టీచర్గానైతే అందులోనే జీవించాననిపించింది. ఎందుకంటే కొవిడ్ తర్వాత విద్యార్థుల చేతుల్లోకి ఆన్లైన్ క్లాస్‌ల పేరుతో ఫోన్లు రావడంతో, సోషల్ మీడియాకు అతిగా ప్రభావితమయ్యారు.
ఒక విద్యార్థి క్లాస్‌లోకి ఫోన్ తీసుకొస్తే క్లాస్ రూం సిచ్యువేషన్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతదో, అలాగే టీచర్ ఎలా బాధితుడిగా మారుతరో అనే విషయంపై చాలా ఎఫెక్టివ్‌గా కథనం సాగింది.
అలాగే మరో కథ లోగుట్టులో ఒక మహిళ మనోభావాలను ఎట్లా గౌరవించుకోవాల్నో మంచి సలహా, సూచనలను పరోక్షంగా చెప్పిండ్రు. భర్త చనిపోయి మనుమలు మనుమరాండ్లు ఉన్న మహిళలు ప్రస్తుత సమాజంలో అందంగా… కాదు కాదు హుందాగా రెడీ అవ్వడం ఘోరమైన పాపంగ భావిస్తరు. సూటి పోటి మాటలతో వేధిస్తరు… అవసరమైతే వితండంగా వాదిస్తరు. కానీ, ఆమెకూ కొన్ని కోరికలుంటయని ఆమె మనసు వేదనను అర్థం చేసుకునే వారెంతమంది అవుపడ్తరు?! ఈ విషయం మీద సాగే కథనమే లోగుట్టు. స్త్రీలలో మార్పును ముక్కు మీద గుద్దినట్టు చెప్పేది అలంకరణే… అనే మాటతో స్త్రీల తరఫున ఆలోచించి అందరిని ఆలోచింపజేసేలా చెప్పిండ్రు.
మరో కథ కొత్త రెక్కలులో సిటీలో ఇండ్లళ్ల పనిచేసుకొని బతికేవారి బతుకులు, వారి పిల్లలు… యజమానులు వాళ్ల పట్ల సూపించే కపట ప్రేమలు, మోసాల గురించి సెప్పుతూ కనబడని బంధనం నుంచి బయటపడి కొత్త రెక్కలను తొడుక్కొని ఎట్ల ఎగరాలో ఒక దారిని వేసిండ్రు. ఇకపోతే ఇంకో కథ రేటింగ్. టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చినంక ఏ చిన్న బిజినెస్కైనాఆన్లైన్ అడ్వైర్టెజ్‌మెంట్ అనేది తప్పనిసరైపోయింది. అందులో భాగంగా కస్టమర్స్‌ను అట్రాక్ట్ చేసేది రేటింగే అన్నది తెల్సిందే. కానీ, ఈ రేటింగ్‌ను పెంచుకోడానికి ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలపర్స్‌గా పనిచేసే మహిళలు ఎంత కష్టపడాల్నో… చివరికి సక్సెస్ అయితే ఎన్ని అనుమానాలకు దారితీస్తదో అనే విషయంతో ప్రస్తుతం నడిచే సమాజాన్ని డైరెక్ట్‌గా సూపెట్టిండ్రు. ఇట్ల సెప్పుకుంటపోతే ఇందులోని ప్రతీ కథ దేనికదే ఒక్కో వంతు పెరుగుకుంట వైవిధ్యంగా ఉన్నవి. నేను కథలను సదువుకుంట ఆ కథల కాలంలోకి వెళ్లి నా మనసు జర్నీ చేస్తున్నంత సేపు నన్ను ఒళ్లో కూసుండబెట్టుకున్న హౌరా రైలు రయ్యిమని వనాలను, వాగులను, నదులను, బ్రిడ్జిలను దాటేస్తుంటె అవన్నీ కూడా నన్ను… నా చేతిలో ఉన్న రొమాంటిక్ డాగ్నే సూసినట్టు… పలకరించినట్టనిపించింది. నాతోబాటు జర్నీ చేసినాతో ముచ్చట బెట్టిన ఈ రొమాంటిక్ డాగ్‌కి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. అలాగే మంచి కథలను అందించినందుకు దేశరాజుకు హృదయపూర్వక అభినందనలు.
గట్టు రాధిక మోహన్