ముంబై, నవంబర్ 7 : దేశంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ టీ రవి శంకర్ తెలిపారు. ఈ ఏడాది జూలై నుంచే డిజిటల్ ఫ్రాడ్స్ సంఘటనలు పెరగడం మొదలైందన్న ఆయన.. అంతకుముందు వరకు తగ్గాయని చెప్పారు. శుక్రవారం ఎస్బీఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రవి శంకర్.. గత 4 నెలలుగా ఈ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయన్న దానిపై ఆర్బీఐ దృష్టి పెట్టిందని, అందుకున్న కారణాలను పరిశీలిస్తున్నామన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25) 23,953 డిజిటల్ మోసాలు నమోదవగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24) 36,000కుపైగా జరిగాయి. ప్రధానంగా కార్డు, ఇంటర్నెట్ ఆధారిత పేమెంట్లలో మోసాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇక సంఖ్యాపరంగా ప్రైవేట్ రంగ బ్యాంకు కస్టమర్లే (60 శాతం) ఎక్కువగా మోసపోతుండగా, విలువపరంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఖాతాదారులు (71 శాతం) అధికంగా నష్టపోతున్నారు. మరోవైపు ఇదే కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. బ్యాంక్ బోర్డుల కోసం నిర్ణయాలు తీసుకునే పని ఆర్బీఐది కాదన్నారు. గత నెలలో విస్తృతంగా సంస్కరణలను ప్రకటించిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. కాగా, బ్యాంకింగ్ నిబంధనల సరళతరం అనేది ఒకింత సాహసమనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.