కవిత్వ వస్తువుకు కాలం చెల్లనంతవరకు కవి హృదయాలు ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి. కలం ఎప్పుడూ తనను తాను పదును పెట్టుకుంటూనే ఉంటుంది. సాహిత్యంలో మానవతావాదం అనేది ఉన్నప్పుడు ‘స్త్రీవాదం’ అనేది ఎందుకు ప్రత్యేకంగా వచ్చిందో తరచి చూడాలి! తన ఉనికి ఒక ప్రశ్నార్థకమయ్యే స్థితిని నిలదీయాల్సి వచ్చిన వర్గం ఏదైనా ఉన్నదా అంటే అదీ ఒక్క స్త్రీ జాతి మాత్రమే. అలా చెప్పాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు వాదాలు వినిపించక ఏం చేస్తారు? అందుకే స్త్రీ వాదం దశాబ్దాలుగా పిడికిళ్ళెత్తుతూనే ఉన్నది.
ఇందుకు ఓ పెద్ద ఉదాహరణ ఈ ‘అపరాజిత’. ఎట్లా పరాజితులు? ఎందుకు పరాజితులయ్యారు? ఎవరు పరాజితులను చేస్తున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ముప్పై ఏండ్ల కవిత్వంగా మనముందుకు వచ్చిందీ ‘అపరాజిత’! ఇందులో 93 మంది కవయిత్రులు కవితలై వైవిధ్యమైనరీతిలో చిత్రిక పట్టారు.
‘ఇల్లు చూచి ఇల్లాలిని చూడమన్నచోట విల్లంబులైన తనువులు…
అందరి ఔదార్యాలకు సంకేతాలయిన చోట…
నిశ్శబ్ద యుగాలుగా పారి… సొంత ఉనికి కోసం వెదుకులాట….’
అంటూ ‘బ్లో-అవుట్’ అవుతుంది ఓ కవయిత్రి. ఈ సామెత గౌరవ సూచకమైందా? అగౌరవ సూచకమైందా? ఇల్లూ- ఇల్లాలు కావాల్సింది ఎవరికి? ఈ ఆలోచన ఉంటే చాలు ‘అతడు’ ‘ఆమె’ ప్రామూ ఖ్యాన్ని అర్థం చేసుకోగలుగుతాడు.
‘మాతృత్వమనే మాట
నన్నెందుకో భయపెడుతుంది
మాతృమూర్తివనే కావ్యగానం
నన్నెంతో భ్రమ పెడుతుంది’
ఎంత గొప్ప ఎక్స్ప్రెషన్! తల్లి కావడమనేది తనెంతో పవిత్రంగా, ప్రేమగా, ఇష్టంగా అనుకునేమాట ఆడవాళ్లను ఇప్పుడెందుకు కలవర పెడ్తున్నది? పిల్లలు పుట్టకున్నా స్త్రీలనే చేతగానివారిగా చూస్తారు. అమ్మాయిలు పుట్టినా స్త్రీలనే దోషులుగా చిత్రీకరిస్తారు. పిల్లల పెంపకం గురించి స్త్రీలనే నిందిస్తారు. ఇదంతా ఎందుకు? ఈ అన్నిటికీ కారణం కేవలం తల్లి ఒక్కతేనా? ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారని ఇన్ని ఆలోచనలను ఈ కవయిత్రి రేకెత్తిస్తుంది.
’దేవకన్య’ అనే కవితలో పెళ్లయిన కొత్తలో మాట్లాడే మాటలకూ, రోజులు గడుస్తుంటే వచ్చే మాటలకూ మధ్య తేడాను, ‘ఎంత సున్నితత్త్వం నీలో పూవు అందంగా సిగ్గుపడింది!’
ఇలా మొదలైన కవితతో ఏమా అందాలు చూద్దామా అని తర్వాతి పాదాలను చదవడానికి ఉద్వుక్తులమవుతాం. కవయిత్రి ఏమంటుందో చూడండి.
క్రమంగా భర్త ఎలా చూస్తాడు, ఏం చూస్తాడు, ఎలా పిలుస్తాడనేది చెప్తూ ‘నీ ముఖం నాకు చూపించకు కంపరం’ అనీ అనగలుగుతాడు. ‘ఏయ్ ఒకసారి ఇటు నా దగ్గరికి రా’ అనే చూపులనూ, మాటలనూ శూలాలను చేస్తాడు. ఇలా సాగిన ఈ కవిత ముగింపు చదివితే తప్పకుండా కళ్లు చెమరుస్తాయి.
‘గుండె పగిలి ముక్కలైంది
శాపమోక్షమైన దేవకన్య నవ్వింది
శపించకుండానే వెళ్లిపోయింది’
ఇదీ కవిత్వం! చలించలేదూ హృదయం ! ఎన్ని వేలకొలది ముక్కలయ్యే గుండెల్ని చూస్తున్నాం!
తెల్లవారుజామున్నే నిద్రలేచి ఇంటి పనంతా చేసి, ఆఫీసుకు వెళ్లే ఆడవాళ్ల జీవితాన్ని అక్షరబద్ధం చేస్తూ వచ్చిన కవిత ‘ఉద్యోగిని ఉత్తరం’, కన్న తండ్రి ప్రశ్నకు బదులుగా..
‘కుళాయిల్లో సన్నగా మొదలైన నీటిధార ఆఫీసులో
నా డెస్క్ మీద ఫైళ్ల భారాన్ని జ్ఞప్తికి తెచ్చింది’
అంటూ నడుస్తున్న ఈ కవిత రోజువారీ పనులతో సతమతమయ్యే ఆమెతో పాటు ‘ఏంటెనా’ తెచ్చే కాలుష్యాన్నీ చెప్తుందీ. ‘పరుగెత్తే కాలం వెనుకపడిలేస్తూ ఈ ప్రయాణం’ అంటూ ‘ఏం రాయమంటావు నాన్నా నా కుశలం’? అన్న ప్రశ్నను సంధిస్తుంది. 168 కవితల్లో ఏవో కొన్ని పంక్తులు అపరాజిత అద్భుతత్వాన్ని ఏం చూపిస్తాయి? ఇందులోని అన్ని కవితలూ ఉదహరించదగినవే !
‘తడిసి మోపెడైన కథ’, ‘నాన్నల్ని కొనాలి కిలో ఎంత?’ అని గుట్టులను విప్పి చెప్పాల్సింది చెప్పి ‘మొగుడు సీసాతో ఉండగా నేను చాలా రిస్క్ తీసుకుంటాను’ అనేంతగా రాసిన కవిత్వమూ ఉంది! సంకుచితత్వాన్ని, కుసంస్కారాన్ని నిలదీసిన కవిత్వమూ ఉంది.
‘క్షతగాత్రులైన స్త్రీల శతకోటి చెరలకు
ఇక చరమగీతం పాడాలంటూ/ ఆర్తనాదాలు విముక్తి నినాదాలుగా పరిణమించాయి’
అంటూ ‘విచ్చుకున్న నేత్రాలు’ కవిత చెప్తుందో సందేశం! అనాదిగా ఆడవాళ్లను అణిచివేస్తున్నా పట్టించుకోక నడుస్తూనే ఉన్నారు. ‘చీకట్లోంచి వెలుతురులోకి’ అనే కవిత చూస్తే, ‘మనుగడ కోసం పోరాటం/ డార్విన్ పదేపదే గుర్తొస్తున్నాడ’ని మొదలై ‘లోపల ఒక ఆలోచన/ అగ్ని పర్వతాన్ని రగిల్చింది/ తెలవారితేగానీ తెలియలేదు/ లావాగా ప్రవహించినచోటల్లా/ పచ్చని జీవితం పర్చుకుంది’ అంటూ తన సహనంతో తన తెలివితో తనదైన శ్రమతత్వపు మనస్తత్వంతో ఆడవాళ్లు ఎంత ఉన్నతంగా ఉంటారో చెప్తుందీ కవయిత్రి.
‘పొద్దున్నే లేవగానే/ పొగలు కక్కే కాఫీ తాగుతూ/పేపరు చదవాలని నా చిరకాల వాంఛ./ రుచి లేని పచనంతో తన జీవితం వ్యర్థమైందని/శ్రీవారు గాయపరిచినపుడు నా మన సు.. అంటూ ‘వంటింటి సూర్యోదయాలు’ కవిత కవిత్వమంతా అందరి ఇండ్లల్లో నిత్యం జరిగే తంతు.
‘కండ్లు మూసినా తెరిచినా/ రెప్పకూ, రెటీనాకు మధ్య/ ఆడబతుకు వెలుగునీడల చారిత్రక ప్రవాహాలు ఎన్ని ప్రశ్నలు ఎన్ని సంక్షుభిత విషయాలు హృదయాలు ద్రవింపజేసే ‘మానవి’ కవిత గుండెల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది.
‘కండలుంటేనే గొప్పా?’ కవిత చూడండి.‘వాళ్లు సాహస వనితలు/ భయాన్ని కొమ్మలు కొమ్మలుగా నరికి/ మోపు కట్టి మోస్తూ/ చరిత్రకు భవిష్యత్తుకు మధ్య/ కొత్త వంతెన వేయగల సమర్థులని కొత్త ఒరవడినిచ్చే కవిత్వం చదువాలంటే చదువు రావాలిగా! ఇవన్నింటికీ ఈ అపరాజిత ఓ ప్రేరణ! ‘నిన్నటిదాకా/ పాదాలకు వెదురు బద్దలు కడితే.’ అని మొదలైన నెలపొడుపు కవితలో పంక్తులు చురకత్తులే!’ అవయవ మార్కెట్లకు/ నెత్తుటి రాతలకు/ ఆమే అక్రమ రవాణా.. కెమెరా శత్రువు/ కన్ను మనదే/ వేలు మనదే/ ఆమెకు గాయం పాతదే / కత్తులే కొత్త వి’ అని కొత్త ఉదయాన్ని కాంక్షిస్తుందీ కవయిత్రి.
‘స్త్రీత్వపు కొలమానంగానే మిగలనింక/ నేను అపరాజితను/కనిపించని సంకెళ్లను ఛేదించే కాళిని/ సస్యక్షేత్రాన్ని కాదు / యుద్ధ క్షేత్రాన్ని’ అంటూ గళమెత్తిన కవిత్వమున్నదీ ‘అపరాజిత’లో!
పోయెటిక్ విజన్‌తోనే కాదు ఒక ప్రత్యేకమైన లైఫ్ విజన్‌తో చదువాల్సిన కవిత్వం ఇదంతా! ఈ ‘అపరాజిత’ సంకలనానికి ముందుమాటగా ‘మౌనాన్ని బద్దలుకొట్టే అపరాజిత’ అంటూ ఈ సంకలన సంపాదకురాలు డాక్టర్ కే గీత అన్నట్టు స్త్రీవాదమెక్కడున్నది అనే మాటలకు దీటుగా నిలిచింది.‘అపజయమెరుగని అవిశ్రాంత గీతం’ అని శిలాలోలిత పీఠిక రాస్తే ‘స్త్రీవాద కవిత్వ అడుగు జాడలు’ అంటూ చివరలో అభిప్రాయ వీచిక కాత్యాయనీ విద్మహే రాశారు.
ఈ సంకలనంలో లబ్ధప్రతిష్ఠులైన కవయిత్రు లున్నారు, వర్ధమాన కవయిత్రులున్నారు. ఒక్కో కవయిత్రి ఒక్కో ఉద్యమరూపంగా, విప్లవ గీతంలా కనిపిస్తున్న ఈ ‘అపరాజిత’ సాహిత్యం లో స్త్రీవాద అస్తిత్వ కేతనాన్ని ఎగురవేసింది.
‘కంప్యూటర్ కాపురం’ అని ఒక కవయిత్రి రాస్తే, ‘యస్ నేను ఆడపిల్లని’ ఒకరు, ‘పులిని నమ్మగరాదు’ అని ఒకరు, ‘నాకు కొన్ని మగపదాలు కావాలి’ అని ఒక కవయిత్రి, ‘ఆ నేను – ఈ నేను’ అని ఒకరు రాశారు. ‘కుమ్మరి పురుగు’ అని, ‘రన్నింగ్ కామెంట్రీ’ అనీ ‘నేను నేను కాను’ అనీ, ‘ఆమె నొసటన ఉదయాలు’ అనీ, ‘వెయ్యిన్నొక్కరాత్రి’ అనీ, ‘దగ్ధగీతం’ అనీ ఇలాంటి శీర్షికలతో కవిత్వం అలరించడం కాదు ఆలోచనల్లో పడేస్తుంది. ‘నల్ల పౌర్ణిమ’, ‘అర్ర మందారాలు’, ‘త్రీనాట్స్’, ‘లోతైన గాయాలు’, ‘ఆమె నిషేధ స్థలాలు’ ఇలా కవితలన్నీ స్త్రీల మనోభావాలను అక్షరీకరించాయి.
డాక్టర్ కొండపల్లి
నీహారిణి