ఇది మిత్రుడు పసునూరి రవీందర్ రాసిన ‘మీది మీదే.. మాది మాదే..’ వ్యాసానికి సమాధానం కాదు. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న ఆంధ్రోళ్లలో ఒకడినైన నా ప్రశ్న మాత్రమే. తెలంగాణ కోసం కాసింత కవిత్వం, ఒకింత కన్నీరు కార్చాం కదా.. మరి మా గురించి ఏమిటన్నదే నా ప్రశ్న. ‘మీది మీదే… మాది మాదే…’ అని తెలంగాణ మిత్రులు తేల్చేశారు. ఎవరిది ఏదో… తమది ఏదో… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాహితీవేత్తలు తేల్చలేదు. అసలు గంట ఎవరు కట్టాలో కూడా వాళ్లు
నిర్ణయించుకున్నట్టుగా కనిపించడం లేదు.
తొలి, మలితరం తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పోరాటానికి మద్దతు పలికిన మాలాంటి వారు.. అంటే ఆంధ్రోళ్లన్న మాట. అలాంటి మా మాటేమిటన్నదే నా ఈ అనుమానం. ఎవరికి వారు హద్దులు గీసుకుంటున్న వేళ.. ఎదుటి వారి హద్దులు కూడా నిర్ణయిస్తున్న సమయాన.. మూడో జాతి మనుషుల్లా మిగిలిపోయిన మా మాటేమిటన్నదే నా వేదన. తెలంగాణకు మద్దతుగా నిలిచాం కాబట్టి మేం ఆంధ్రోళ్లకు శత్రువులుగా మిగిలామనుకోవాలా!?.. లేక తెలంగాణ వచ్చేసింది కాబట్టి వాళ్లని ఇక ఆంధ్రోళ్లుగానే చూడాలని తెలంగాణ మిత్రులు నిర్ధారించుకున్నారనుకోవాలా?.. అన్నదే నా సంశయం.
ప్రత్యేక తెలంగాణ కల సాకారమైంది. ఈ కల సాకారమవడంలో తెలంగాణ కవులు, రచయితలు, మేధావుల పాత్ర చాలా ఉన్నది. ఇందుకు విరుద్ధంగా సమైక్యవాదాన్ని వినిపించిన కవులు, రచయితలు, మేధావులు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఆరేడేండ్ల ముందు తెలుగు సాహిత్యం (మిత్రమా.. తెలుగు సాహిత్యమే.. మీరు ప్రస్తావించినట్టుగా తెలుగు భాష, తెలుగుదనం, సంస్కృతి, ఉమ్మడి వారసత్వం వంటి పేర్లు కాదు) కూడా రెండుగానే చీలిపోయింది. తెలంగాణను కాంక్షిస్తూ రాసేవారు తెలంగాణ వాదులుగా, విడిపోవడానికి వీల్లేదనే వారంతా సమైక్యవాదులుగా చీలిపోయిన దశ అది.
సరిగ్గా ఈ సమయంలోనే, తెలంగాణను కాంక్షించే ‘ఆంధ్రోళ్లు’ కొందరున్నారు. వీరు కూడా ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా కవిత్వం రాశారు, వ్యాసాలు రాశారు. అన్నట్టు సమైక్యవాదుల నుంచి తిట్లు, శాపనార్థాలు కూడా అనుభవించారు. మిలియన్ మార్చ్ సమయంలో ట్యాంక్‌బండ్ మీదున్న ఆంధ్ర సాహితీవేత్తల విగ్రహాలను కూల్చివేసిన సమయంలో మాకు ఎదురైన ప్రశ్నలు, అమ్ముడుపోయారనే మాటలు భరించలేక ఎంత ఇబ్బంది పడ్డామో మేం ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. ఆ సమయంలో కూడా అలాంటి ప్రశ్నలకు నా నుంచి వచ్చిన సమాధానం ఉద్యమ సమయంలో విసిరిన రాళ్లన్నీ ఒకే వైపు పడవు. వాటిలో కొన్ని రాళ్లు ఉద్యమకారులకూ తగులుతాయి. అంతమాత్రాన ఉద్యమాన్ని తప్పుబట్టలేం. ఉద్యమ కాంక్షను వీడలేం అని సన్నిహిత సమైక్యవాదులకు చెప్పాను.
తెలంగాణ ఉద్యమ సమయంలో మేం చూపించింది సానుభూతి కాదు, సహానుభూతి. అవును, కచ్చితంగా సహానుభూతే. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కానీ, రాయలసీమ నుంచి కానీ ఆనాడు వచ్చిన సాహిత్యం ఒక్కసారి పరిశీలిస్తే ఆ విషయం అర్థం చేసుకోగలం. ఇక, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాల నుంచి కూడా తెలంగాణ ఏర్పడాల్సిన ఆవశ్యకత గురించి సాహిత్యం వచ్చింది. అయితే, అది పరిమిత సంఖ్యలోనే కావచ్చు.
నా మటుకు నేను తెలంగాణను కాంక్షిస్తూ అనేక వ్యాసాలు రాశాను. కవిత్వం కూడా రాశాను. చాలాచోట్ల ప్రత్యేక తెలంగాణ రావాల్సిన, ఇవ్వాల్సిన అంశం గురించే కాదు, ప్రత్యేక తెలంగాణ ఏర్పడాల్సిన ఆవశ్యకత గురించి కూడా మాట్లాడాను. అంతెందుకు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా హైదరాబాద్‌తో సహా ఇతర తెలంగాణ జిల్లాల్లో బతుకుతున్నవారు (వీళ్లను సెటిలర్స్ అన్నారు. ఎందుకో నాకు ఆ మాట నచ్చదు) తెలంగాణ ఏలికల్లో ఇబ్బందులు పడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో విలేకరుల సమావేశంలో గుండెలు బాదుకుంటే.. అదంతా తప్పు… ఇక్కడున్న వారంతా చాలా బాగున్నారని, వారిని తెలంగాణ వాసులు చాలా బాగా చూసుకుంటున్నారంటూ నేను ఓ వ్యాసం రాశాను. ఆ వ్యాసం ప్రచురించింది కూడా నమస్తే తెలంగాణ దినప్రతికే. ఆ నా వ్యాసం తెలంగాణలో నన్ను ఎక్కువమంది అభిమానించేలా చేసింది. నన్ను తెలంగాణ సానుభూతిపరుడిగా కాకుండా తెలంగాణ వాడిగానే చూసింది.
నిజానికి, తెలంగాణ కోసం మలితరం ఉద్యమం ప్రారంభించడానికి ముందే ఈ ప్రత్యేక తెలంగాణను కాంక్షించే సమూహం ఉండేది. ఆ సమూహంలో ఆంధ్రోళ్లు కూడా కొందరున్నారు. అయితే, తెలంగాణ కల ఉద్యమరూపం తీసుకోలేదు కాబట్టి, ఆ కల కవిత్వంగానో, వ్యాసాలుగానో వచ్చిందే తప్ప ఓ పోరాట రూపానికి మద్దతుగా మాత్రం రాలేదు. వామపక్ష పార్టీల్లో ముఖ్యంగా, నాటి పీపుల్స్‌వార్,. నేటి మావోయిస్టు పార్టీ రాజకీయాల పట్ల కాసింత సానుభూతిగా ఉన్నవారంతా ప్రత్యేక తెలంగాణ వస్తే చూడాలనుందని కలగన్నవారే.
తొలితరం తెలంగాణ ఉద్యమకాలంలో కమ్యూనిస్టుల్లో చాలామంది ప్రాంతీయవాదాన్ని వ్యతిరేకించినా పీపుల్స్‌వార్ వ్యవస్థాపకులైన కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి మాత్రం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావాల్సిందేనని ఆకాంక్షించారు. కొండపల్లి సీతారామయ్య అయితే అప్పట్లో కొన్ని వ్యాసాలు రాయడమే కాదు, కమ్యూనిస్టు పార్టీల్లో చర్చ కూడా లేవదీశాడు. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి ఇద్దరూ ఉద్యోగం అయితే తెలంగాణలో చేశారేమో కానీ వాళ్లిద్దరు కూడా ఆంధ్రోళ్లే. ఇప్పుడు మిత్రుడు పసునూరి రవీందర్ ‘మీది మీదే.. మాది మాదే’ అంటున్నారు. ఈ సరికొత్త వాదంలో తెలంగాణ రావాలని కాంక్షించిన జన్మతహ ఆంధ్రోళ్లమైన మాలాంటి వాళ్లం ఎటువైపు ఉంటామన్నదే నా ఈ ప్రశ్న.
తెలంగాణను కాంక్షించింది ఒక్క సైద్ధాంతికంగానే కాదు మిత్రమా. అక్కడి సంస్కృతి, ఆ ప్రేమ, అనురాగం, అడక్కుండానే కడుపులో అన్నం తీసిపెట్టే అచ్చమైన మనుషులను చూసిన తర్వాతే. అంతేకాదు, సహజన్మ అన్నట్టు స్వరాష్ట్ర పాలకుల నుంచి తెలంగాణవాసులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి, పరోక్షంగా చదువుకున్న తర్వాతే తెలంగాణ రావాలనే మా ఆకాంక్ష మరింత పెంచుకున్నాం.
మీకు నీళ్లు రావడం కోసం మీరెన్ని కన్నీళ్లు కార్చారో… ఇప్పుడు అటు ఇటు కాకుండా పోయిన ఈ మూడో తరగతి మనుషులుగా పిలవబడే మేం కూడా అంతే కన్నీరు కారుస్తున్నాం. మేం కార్చిన కన్నీళ్లకు బహుమతిగా మేం ఎటూ కాకుండా పోవడమే మాకు ఎదురైన విషాదం. ఓ భాషగా తెలుగు గురించి మాట్లాడాల్సి వస్తే కొందరికి కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. దేశంలో అనేక రాష్ర్టాల్లో హిందీ మాట్లాడతారు. భాషకు సంబంధించి యాసలో మార్పులుంటాయి కానీ భాషలో కాదు గదా? తెలంగాణ ఏర్పడకముందు ఆంధ్రప్రదేశ్ అనేవారు.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని విడివిడిగాను, రెంటిని కలపాల్సి వస్తే తెలుగు రాష్ర్టాలని అంటున్నారు. దీనివల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటన్నదే నాకు అర్థం కాని ప్రశ్న. ఇతర అంశాలు అంటే సాహిత్య అకాడమీలో సభ్యులకు సంబంధించి మీ ప్రతిపాదనకు నేను ఓటు వేస్తాను. పత్రికల్లో ప్రాధాన్యం ఇవ్వడం వంటివి ఆ పత్రిక పాలసీగా ఉంటుంది కాబట్టి ఓ జర్నలిస్టుగా నేను సమాధానం చెప్పలేను. భవిష్యత్తులో అస్తిత్వవాద ఉద్యమాలు వస్తే మాలాంటి వాళ్లు ఎటువైపు ప్రయాణించాలో తెలియని ఓ ప్రశ్న కూడా ఇప్పటినుంచే ప్రారంభం కావడం నన్ను ఇబ్బంది పెడుతున్న మరో విషాదం. చివరగా మీరు సరే.. వాళ్లు సరే.. మధ్యలో మా మాటేమిటన్నదే నా ప్రశ్న.
ముక్కామల చక్రధర్
99120 19929