నేను..
నా గదిలో ఉన్నప్పుడు
అల్మైరాల్లో ఇష్టపడి పెంచుకున్న
ఓ అడుగు మేర ఎత్తున్న
తెల్లని చెట్ల మధ్య సంచరిస్తుంటాను
వాటి కొమ్మల కింద
అక్షరాలతో సేద తీరుతాను
నేను..
బయటికి వెళ్ళినప్పుడు
రోడ్డుకి ఇరువేపులా ఏపుగా పెరిగిన
నేలలో పర్ఫెక్ట్ బైండింగ్తో ఉన్న
పచ్చని పుస్తకాలను చూస్తుంటాను
వాటి పుటల్ని గమనిస్తూ
ఆక్సిజన్ నింపుకుంటాను
నేను..
పలక పట్టిన్నాటి నుంచి
చెట్లూ పుస్తకాలూ
నా బతుక్కి
శ్వాసనందిస్తున్న
చదువుల తిత్తులు
నలిమెల భాస్కర్