నీళ్లేసిన గొర్లను కత్తిరించి
ఇంటికి తీసుకొచ్చిన ఉన్ని మూటలు
వొడుకుడు పీట మీద నాయినమ్మ
కదుర్లకు సుట్టుకున్నట్లు
పాల దంతాలొచ్చిన నా అక్షరాలు
పాతింటి కబుర్లను గుర్తు చేసుకుంటున్నాయి…
కండెలు కండెలుగా ఉన్ని వొడుకుతూ
నాయినమ్మతో మా అమ్మ పోటీ పడేది
టెంకాయ చిప్పలు గిరగిరా తిరుగుతుంటే
కదుర్లు పరుగు పందెంలో పాల్గొన్నట్టుగా ఉండేది…
పాతింటి ముందు ఎడ్ల కొట్టానికి
తాటికమ్మలు కోసిన కొడవళ్లు
సపారంలో సూరుకు చెక్కిన సూల్కందబ్బ వలె
పని కోసం ఎదురుచూస్తున్నాయి
ఇనుప సామానులో కలిసిపోయి వింత వస్తువులుగా…
మెట్లెక్కి బాల్కనీ మీదికి నడుస్తుంటే
మట్టి మిద్దె ఎక్కడానికి ఆసరైన వెదురు నిచ్చెన
కొడుపులు వదులై తుప్పుపట్టిన ఇనుములాగా కనిపిస్తుంది
ఈత సాప మీద పడుకున్న నాయినమ్మల కాలం
ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ సాపలకు ఒరవడి దిద్దినట్టుంది
దర్వాజ సుంచు మీద కదుర్లు మళ్లీ
వొడుకుడు పీట కోసం ఎదురుచూస్తున్నట్టుంది…
ఎజ్జు మల్లయ్య
96528 71915