బతుకమ్మ ప్రకృతిని అమ్మగా ఆరాధించే స్త్రీల పండుగ, పూల పండుగ. అంతేకాదు, బతుకమ్మ తెలంగాణ విశిష్ట సంస్కృతికి గొప్ప ప్రతీక. ముగ్గురమ్మల మూలపుటమ్మ గౌరీదేవి రూపంలో పూజలందుకుంటూ తొమ్మిది రోజులు జరుపుకొనే తెలంగాణకు మాత్రమే చెందిన అరుదైన పండుగ బతుకమ్మ.
పూర్వ కాలం నుంచి కూడా తెలంగాణ ఆడపడుచులు ఆ తొమ్మిది రోజులూ భక్తి శ్రద్ధలతో బతుకమ్మలో కొలువైన గౌరీ దేవిని పూజిం చి, ఆట, పాట, కోలాటాలతో సంబురాలు చేసుకోవడం ఆనవాయితీ. బతుకమ్మ ఆడటం నగరాల్లోనే కాదు, పట్టణాల్లోనూ చివరికి గ్రామాల్లోనూ నామోషీ గా భావించే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇట్లాం టి పరిస్థితుల్లో మలిదశ తెలంగాణ ఉద్యమం బతుక మ్మకు మళ్లీ జీవం పోసింది. తమ వనరుల మీద తమ కే ఆధిపత్యం ఉండాలని, తమ జీవన విధానం విలక్షణమైనదని చాటిచెప్తూ, తమ సంస్కృతి ప్రాచీనమైనదని, విశిష్టమైనదని, తమకంటూ ఓ చరిత్ర ఉన్న దని, చరిత్రలో తమ స్థానం ప్రత్యేకమైనదని, ఆ గుర్తిం పు, ఆ ఎరుక కోసం, అస్తిత్వం కోసం అహింసతో తమదైన పోరాటశైలితో, నిరంతరం చైతన్యంతో సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రపంచ అస్తిత్వ పోరాటాల్లోనే విలక్షణమైనది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం క్రమక్రమంగా దశదిశలా వ్యాపించి రాష్ట్ర సాధన డిమాండ్ ఊపందుకున్నది. దీనికి కారణం తెలంగాణలోని అన్నివర్గాలు ఏకతాటిమీది కొచ్చి అనేక విధాలుగా చేసిన మేధోమథనం. ముఖ్యంగా, ఆత్మగౌరవ ప్రతీకగా ముందుకొచ్చి ఉద్యమంలో తన పాత్ర పోషించిన బతుకమ్మ పండుగ కుల, మత, వర్గ, జాతి వివక్ష లేకుండా, ఊరూ వాడా, చిన్నా పెద్దలను ఏకం చేసి, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమ సెగలు రగిల్చింది.
ఈ విషయంలో తెలంగాణ జాగృతి సంస్థ చేసిన కృషి అభినందనీయం. జాగృతి వ్యవస్థాప క అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తిరిగి, పెద్దఎత్తున బతుకమ్మ ఆడి, ఉద్యమ అవగాహన కలిగించారు. అప్పటి ప్రభుత్వ నిషేధానికి వ్యతిరేకంగా చట్టపరంగా పోరాడి, ట్యాంక్‌బండ్‌పై లక్షల మందితో బతుకమ్మ సంబురాలు నిర్వహించుకోవడం ఉద్యమ ప్రస్థానంలో ఓ చారిత్రాత్మక సన్నివేశం. ఈ విధంగా తెలంగాణ సంస్కృతినీ, తెలంగాణ ప్రత్యేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఒక ఆత్మగౌరవ వేదికైంది. అంతేకాదు, మలిదశ తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మ స్ఫూర్తిగా నిలిచింది. కవులు, కళాకారులు తమదైన శైలిలో బతుకమ్మను గానం చేశారు.
‘అమ్మలకే అమ్మవై
ప్రజలందరి నమ్మికవై
తెలంగాణ తెమ్మెరవై
సకల జనుల సమ్మెవై’
అని ఒక కవయిత్రి గానం చేస్తే, మరో కవి…
‘తెలంగాణ నేల మీద వెలసిన లక్ష చందమామలు
ఆడబిడ్డల కండ్లల్ల మొలిచిన కోటి స్వప్నాలు’ అని గానం చేశాడు.
ఇప్పుడు బతుకమ్మ ఆడకపోతే నామోషీ! గ్రామాల్లోనే కాదు, పట్టణాలు, నగరాల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో బతుక మ్మ సంబురాలు ఆట, పాటలతో ఘనంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించుకోవడం ఒకరకంగా తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మకు లభించిన గౌరవం. అంతేకాదు, ఇనుమడించిన తెలంగాణ ఆత్మగౌరవం కూడా!!
(అక్షరయాన్ సౌజన్యంతో..)
డాక్టర్ వాణీ దేవులపల్లి