పచ్చటి పైరు పంటలతో కళకళలాడే గ్రామవాసులు జరుపుకొనే పండుగలలో అతి ముఖ్యమైంది బతుకమ్మ పండుగ. ఈ పండుగ రోజున దూరప్రాంతాలలో ఉన్న తమ ఇంటి ఆడబిడ్డలను పిల్లా పాపలతో సహా పిలిపించుకొని సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకొంటారు.
మగవారు అడవిలో దొరికే తంగేడు, గునక పువ్వులను తెస్తారు. వాటిని చిన్న చిన్న కట్టలుగా కట్టి వాటికి రకరకాల రంగులు అద్దుతారు. ఈ విధంగా అన్నిరకాల పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు. వదినె మరదండ్లు, ఇంట్లో ఆడవాళ్లందరూ ఈ పనులలో పాలుపంచుకుంటారు. పసుపుతో గౌరీదేవిని చేసి బతుకమ్మ మధ్యలో పెడతారు. గౌరీదేవికి పెరుగన్నం నైవేద్యం పెడతారు. పెసర్లు, సెనగలు, పల్లీలు, మక్కలు వీటన్నింటిని వేయించి, చక్కెర కలిపి పొడిచేస్తారు. దీనినే సత్తుపిండి అని కూడా అంటారు. రకరకాల ఆహారపదార్థాలను తయారుచేస్తారు. వాకిట్లో పెండతో అలికి, పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి, బతుకమ్మను పెట్టి అగరు బత్తీలు వెలిగించి ఆడవాళ్ళంతా చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఉంటారు. తర్వాత ఊరిలోని ఆడవాళ్లంతా బతుకమ్మలను చెరువు దగ్గరకు తీసుకెళ్లి చెరువు గట్టు మీద బతుకమ్మలను పెట్టి బహుచక్కగా ఆడతారు.
గోసంగులు కూడ ఈ బతుక మ్మ పండుగను చేస్తారు. వారి ఇంటి దేవతతో కూడిన బతుక మ్మ పాటలను పాడుతూ పండు గను జరుపుకుంటారు.
గోసంగుల బతుకమ్మపాట
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
గోసంగుల బతుకమ్మ ఉయ్యాలో
గౌరమ్మ రూపమే ఉయ్యాలో
ఎల్లమ్మగా మా ఇంట్లో ఉయ్యాలో
ఇంటి దేవతలు ఉయ్యాలో
ఇద్దరమ్మల రూపమే ఉయ్యాలో
ఒక రూపమే ఉయ్యాలో
రెండో రూపమే ఉయ్యాలో
తూరుపు తుత్తుబాయి ఉయ్యాలో
బాపనెల్లమ్మ గోరింది ఉయ్యాలో
బెల్లమన్నం ఉయ్యాలో
చాపలె గోరింది ఉయ్యాలో
నవమినాడు ఉయ్యాలో
మమ్మల్ని మొక్కమన్నారే ఉయ్యాలో
గోసంగులందరు ఉయ్యాలో
గోప్యముగా జేస్తారె ఉయ్యాలో
ఎల్లమ్మ దేవతను ఉయ్యాలో
ఎంతో నెపముతో ఉయ్యాలో
కోరికలు తీర్చమని ఉయ్యాలో
కోరి కోరి మొక్కుతారు ఉయ్యాలో
గోసంగి స్త్రీలు వారి ఇంటిదేవతైన ఎల్లమ్మను గౌరీదేవతగా తలచి ఈ పండుగను జరుపుకొంటారు. కొన్ని ప్రాంతాల్లో మహర్నవమికి ముందు జరుపుతారు. కాబట్టి వీరు బతుకమ్మను ఎల్లమ్మ దేవతగానే భావిస్తారు. ఎందుకంటే మహర్నవమి రోజున ఎల్లమ్మ దేవతకు వీరు పూజలు చేస్తారు కాబట్టి బతుకమ్మను ఎల్లమ్మ రూపంతోను, గౌరీ రూపంతోను కొలుస్తారు.
డా. గంధం
విజయలక్ష్మి