చాలా ఏండ్ల తర్వాత
మా వూరికెళ్లాను
మా యిల్లు చిన్నగా కనిపిస్తున్నది
మూడు గదుల ఇల్లే అయినా
ముల్లోకాలంత పెద్దగా వుండేది.
మా బల్ల మీద వొరిగి పడుకొని
మూడు వేల పుస్తకాలు చదివాను
బల్ల వైశాల్యం ఎకరాలుగా విస్తరించేది
ఇంటి ముందు చెట్టు
ఇప్పటికి వుంది
దాని పైకెక్కి
చింతచిగురు తెంపేవాణ్ని
ఇప్పుడా ప్రాంగణమంతా
ఇరుకిరుగ్గా అనిపిస్తున్నది.
మా గోడల
జాజుపూతలు
సహజ చిత్రకారుని
కుంచె నుంచి జాలువారినట్టుగా ఉండేవి
ఇప్పుడవి మోటుగా ఉన్నాయి.
నగరంలో ఇల్లు కట్టినప్పుడు
పాత జ్ఞాపకాల ఇటుకల్తోనే కట్టించాను
ఈ మధ్య అది కూడా
చిన్నగా కనిపిస్తుంది.
ఎవరైనా కలిస్తే
మీ ఇల్లు ఎంత పెద్దది అని అడుగుతున్నాను
సైజు రోగం పట్టుకుంది నాకు
నాలో ఏదో మానసిక రుగ్మత ఆవరించింది.
అయితే
ఎంతో ప్రపంచం తిరిగొచ్చిన తర్వాత
ఇంట్లో అమ్మను చూస్తే మాత్రం
ఏ ప్రమేయమూ లేని
ఉజ్వల కాంతి వెలుగుతుంది
ఆమె ఒడిని మించిన
విస్తీర్ణం ఎక్కడా లేదని తెలుసుకున్నాను.
– డాక్టర్ ఎన్.గోపి