ఆయన కవిత్వంలో ఒక చమత్కారం ఉంటుంది. ఆయన మాటల్లో ఒక రకమైన మ్యాజిక్ ఉంటుంది. ఆయన ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. అప్పుడే ఆశువుగా ఒక పద్యం చెప్తారు. వెంటనే గమ్మత్తయిన ఒక ఛలోక్తి విసురుతారు. ఆయన ఒక నవ్వుల ప్రపంచం. ఆయనతో మాట్లాడితే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. ఆయనే ప్రముఖ విద్వత్కవి మామిండ్ల రామగౌడ్.
మామిండ్ల రామగౌడ్ 1943 ఏప్రిల్ 2న మెదక్ జిల్లా లింగారెడ్డిపేటలో బాలమ్మ, మల్లాగౌడ్ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే కవిత్వం పట్ల ఆసక్తి ఉన్న ఆయన అనేక కావ్యాలు, ప్రబంధాలు, వ్యాకరణ, అలంకార, తర్కశాస్ర్తాలను అధ్యయనం చేశారు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ భాషల్లో చక్కని పాండిత్యం సంపాదించారు. 16 ఏండ్ల వయస్సు నుంచే కవిత్వం రాయటం ప్రారంభించిన రామగౌడ్ బాలకవిగా మంచి గుర్తింపు పొందారు. తెలుగులో బీఓఎల్ పట్టా సాధించి తెలుగు భాషోపాధ్యాయునిగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగరీత్యా పలు ప్రాంతాల్లో పనిచేసి చివరకు నిజామాబాద్ జిల్లా రుద్రూరులో స్థిరపడ్డారు. శబరిమాత శతకం, నారసింహ శతకం, కవి గౌడప్ప శతకం, రసతరంగిణి, గౌడ జన ప్రబోధం, కవితా సుధాలహరి మొదలైన 15 పుస్తకాలను ఆయన రచించారు.
‘జీవితమెల్ల యాతనలు జీవికి సౌఖ్యము లేదదించుకన్ బావిని బడ్డ బాలవలె బావురు మంచిట నేడ్చుటే గదా త్రోవన బోవ బాకులును క్రూర మదోత్కట సర్ప శ్రేణులున్ నావయు కూలునట్టుల వినాశన మొందుట తప్పదీ ధరన్’
జీవితంలో మనిషి అనుభవించే కష్టాలు, కన్నీళ్లను పై పద్యంలో కండ్లకు కట్టినట్లు చిత్రించారు రామగౌడ్. మహాకవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉండేవారు రామగౌడ్. తాను రాసిన ‘రస తరంగిణి’ కావ్యా న్ని సినారెకు అంకితం చేశారు. జీవీ సుబ్రహ్మణ్యం, వానమామలై వరదాచార్యులు, దివాకర్ల వేంకటవధాని, దేవులపల్లి రామానుజరావు వంటి మహానుభావులతో కలిసి సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు ఎన్నో సాహిత్య చర్చలు కూడా చేసేవారు రామగౌడ్.
ప్రముఖ కవి, అష్టావధాని డాక్టర్ అందె వేంకటరాజం కోరుట్లలో స్థాపించిన భారతీ సాహిత్య సమితికి చాలాకాలం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించి, ఆ పదవిని సమర్థవంతంగా నిర్వర్తించారు రామగౌడ్. ఆయన రాసిన ‘రస తరంగిణి’ కావ్యంలోని పద్యాలను 9వ తరగతి విద్యార్థులు పాఠ్యాంశంగా చదువుకోవటం తెలుగు వారందరికీ గర్వకారణం.
‘నల్లమొగమ్మున నెల్ల లోకాలలో వెన్నుడు పూజ్యుడై వెలయ లేదేవిషపు మేతరి గొంతు విడ్డూరమగు నలు పున్నను శివుడంచు పొగడ బడడే చుక్కల దొరలోన ముక్కున నలుపున్నచల్లని వెన్నెల జల్లులిడడే నరుల తలలు నలుపు ఇరుల దారులు నలుపు నింగి నీరును రేయి నీడ నలుపు కాకి నలుపటంచు గావుకేకలు పెట్టిమాయనంటి పొరలు మాయి నలుపుఅంధకారమైన అజ్ఞానమే నలుపు వాయసముల నలుపు రోయనేలా’
అంటూ నలుపు రంగులో ఉన్న కాకిని చులకనభావంతో చూసేవారికి చురకలంటించడమే కాకుండా చక్కని సందేశాన్ని కూడా పై పద్యంలో అందించారు రామగౌడ్. గంభీరమైన, మధురమైన కంఠస్వరం కలిగి ఉండే రామగౌడ్ తరగతి గదిలో పాఠాలు చెప్తుంటే పిల్లలు తన్మయత్వంతో పరవశించి పోయేవారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రపంచ తెలుగు మహాసభలను 2017లో అత్యంత వైభవంగా నిర్వహించిన సందర్భంగా ‘మామిండ్ల రామగౌడ్’ పేరిట తోరణం ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైన విషయం. కవిగా, గాయకుడిగా, వ్యాఖ్యాతగా, సరస సంభాషణా చతురుడిగా పేరు పొందిన రామగౌడ్ తాను కవి కావటానికి పడిన తపనను ఈ పద్యంలో చక్కగా వివరించారు.
‘కవిని గాదలచి కలము చేతను బూన
పెనుగులాడు గుండె గొణుగు చుండె
ప్రతిభ తొంగి చూచె భావ ప్రకృతి పూచె
మతులు రెక్క సాచె మనసు లేచె’
కవి కోకిల, సుకవి సుధాకర, సరస కవి చక్రవర్తి వంటి బిరుదులు పొందిన రామగౌడ్ తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా ముంబయి, పుణె వంటి ప్రాంతాల్లో కూడా పర్యటించి తన కవితాగానంతో అలరించాడు. ఎన్నో బిరుదులు, పురస్కారాలు, గౌరవ సత్కారాలు అందుకున్నారు. 2003 జూన్ 6న కీర్తిశేషులు అయినప్పటికీ తెలుగు సాహితీ వనంలో రామగౌడ్ చిరంజీవియై పరిమళిస్తూనే ఉంటారు.
– తిరునగరి శ్రీనివాసస్వామి 9440369939