మనిషి మనిషిని తట్టిలేపేది పద్యం. మనిషి జీవితానికి చైతన్యవారధిలా నిలిచేది పద్యం. అలాంటి పద్యాలతో కూడిన నీతిశతకాలు, భక్తి శతకాలు మనకు తెలుగు సాహిత్యంలో చాలా ఉన్నాయి. వాటిలో ‘నరసింహ శతకం’ ఒకటి. భక్తి, వైరాగ్యం, సందేశాల సమ్మిళితమై నరసింహ శతకం మనకు కనిపిస్తుంది. ఇందులోని ప్రతి పద్యం తెలుగువాడి నరనరాన జీర్ణించుకుపోయిందని చెప్పడం అతిశయోక్తి కాదేమో. అంతటి గొప్ప శతకాన్ని రాసిన కవి శేషప్ప.
శేషప్ప కవి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో (ప్రస్తుతం జగిత్యాల జిల్లా) గోదావరి నది ఒడ్డున గల ధర్మపురిలో జన్మించానని తానే స్వయంగా చెప్పుకున్నారు. ఆయన క్రీ.శ 1730-1820 మధ్యకాలంలో జీవించి ఉంటారని చారిత్రక పరిశోధకుల అభిప్రాయం. శేషప్ప కవి ధర్మపురి క్షేత్రంలో వెలిసిన లక్ష్మీనరసింహస్వామికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప భక్తుడు. ఆయన నృకేసరి శతకం, నరసింహ శతకం, నరహరి శతకంతో పాటు ధర్మపురి రామాయణం, అవనీజ చరిత్రం అనే రెండు యక్షగానాలను కూడా రాశారు.
ఆయన శతకాల్లోని ప్రతి పద్యంలోనూ భక్తిమాధుర్యం, పారవశ్యమూ ధ్వనిస్తుంది. నరసింహస్వామిపై ఆయనకున్న అపార భక్తి ప్రపత్తులను ఆయన రాసిన పద్యాలే చాటి చెబుతున్నాయి. ఆయన రాసిన ‘నరసింహ శతకం’ పద్యాలు తెలుగు ప్రాంతమంతటా సుప్రసిద్ధాలు. అందులోని ఏ ఒక్క పద్యమైనా పఠించని తెలుగువాడు ఉండడు. ఇది ద్వైపాద మకుటమున్న శతకం. ఇలాంటి మకుటమున్న శతకాలు మనకు తెలుగులో అరుదుగా కనిపిస్తాయి.
‘తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్లిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమెగాని
మెరుగు బంగారంబు మ్రింగబోడు
విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని
కూడబెట్టిన సొమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి
దానధర్మము లేక దాచి దాచి
తుదకు దొంగలకిత్తురో దొరలకవునో
తేనెజుంటీగలీయవా తెరువరులకు?
భూషణవికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర’
ఎంతటి లక్షాధికారైనా అన్నము, ఉప్పు తప్ప బంగారం తిని బతకడు. సంపాదించినది తాను తినక, దానధర్మము చేయక దాచి దాచి బాటసారులపాలో, దొంగలపాలో చేయడం మూర్ఖత్వం అంటూ నీతిబోధ చేస్తూ శేషప్ప రాసిన పై పద్యం ఎన్ని కాలాలు గడిచినా నేటికీ నిత్యనూతనమే. గొప్ప సందేశమే. శేషప్ప కవి రాసిన నరసింహ శతకాన్ని ఆచార్య రవ్వా శ్రీహరి సంస్కృత భాషలోకి అనువదించారు. ఇంకా…‘శ్రీ మనోహర సురార్చిత’, ‘ప్రహ్లాదుడేపాటి పైడికానుకలిచ్చె’, ‘నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత’, ‘వ్యాసుడేకులమందు వాసిగా జన్మించె’ వంటి ఎన్నో పద్యాలు అజరామరాలు.
‘పద్మలోచన! సీసపద్యముల్ నీ మీద
జెప్పబూనితినయ్య! చిత్తగింపు
గణయతి ప్రాసలక్షణము జూడగలేదు
పంచకావ్య శ్లోక పఠనలేదు
అమరకాండ త్రయం బరసి చూడగ లేదు
శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు
నీ కటాక్షంబున నే రచించెదగాని
ప్రజ్ఞనాయది కాదు ప్రస్తుతింప
దప్పు గలిగిన సద్భక్తి తక్కువౌనె?
చెరకునకు వంక పోనేమి జెడునె తీపి
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార నరసింహ! దురితదూర’
ఓ కమలనేత్రా! సీసపద్యాలు నీమీద చెప్పాలని సంకల్పించుకున్నాను. విను. నేను గణము, యతి, ప్రాస మొదలైన లక్షణాలను చూడలేదు. పంచకావ్యాల్లోని శ్లోకాలు, శాస్త్ర గ్రంథాలను చదువలేదు. నీ కటాక్షంతో నేను రాశాను గాని ఇది నా ప్రతిభ కాదు. నిన్ను కీర్తించే ప్రజ్ఞ నా దగ్గర లేదు. కేవలం భక్తి మాత్రమే నా దగ్గర ఉన్నది. నేను రాసిన పద్యాల్లో లోపం ఉండొచ్చునేమో గాని నా భక్తిలో మాత్రం ఎటువంటి లోపం ఉండదు. చెరకు వంకరగా ఉన్నంత మాత్రాన దాని తీయదనం చెడిపోతుందా? అదేవిధంగా నావల్ల ఏమైనా తప్పులు దొర్లినా నా భక్తి మాత్రం చెడిపోదు. కరుణ కలిగిన చూపులతో నా తప్పులను క్షమించుము అంటూ నరసింహస్వామిని వేడుకుంటున్నారు శేషప్ప.
‘ఏనుగుబోవజూచి ధ్వనులెత్తుచు గుక్కలు గూయసాగుచో
దాని మనస్సు కోపపడి
దందడి వానిని వెంబడించునే
మానవులందు సజ్జనుడు,
మత్తులు కొందరు గేలిచేయు చో
ఆ నరుడల్గి వాండ్ర బదులాడునె
ధర్మపురీ! నృకేసరీ!’
అంటూ నృకేసరీ మకుటంతో ఆయన రాసిన నృకేసరీ శతకంలోని పద్యమిది. ఏనుగు నడుస్తుంటే కుక్కలు మొరిగినా, ఏనుగు కోపంతో వెనుతిరగదు. సజ్జనుడు నడుస్తుంటే మూర్ఖులు కూసినా సజ్జనుడు కూడా వాదం పెట్టుకోడు అంటూ గొప్పగా చెప్పారు శేషప్ప. డా.దివాకర్ల వేంకటావధాని, విద్వాన్ వేదం చిన్ని కృష్ణశర్మ తదితర విద్వాంసులంతా శేషప్ప కృతులను వెలికితీసి విశేషమైన పరిశోధనలు జరిపారు. ఇంకా..శేషప్ప సాహిత్యంపై విస్తృతమైన పరిశోధనలు జరగాల్సి ఉన్నది. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పద్యం శేషప్ప కవి పద్యం…తెలుగు భాష ఉన్నంతకాలం శేషప్ప కవి చిరంజీవిగా ఉంటారు.
-తిరునగరి శ్రీనివాసస్వామి
9440369939