కుటుంబాలది
వెనుకటిలా కలిసుండలేనితనం
విచ్ఛిన్న రాజ్యాల దయనీయ
దృశ్యాలను తలపిస్తున్నాయి!
నేనేం పెద్ద పెద్ద కలలు కనలే
నాతో నా పిల్లలు
పిల్లలతో నేను కలిసుంటే చాలు
నా దుఃఖాన్ని వీడియోకాల్స్ ఆర్పలేవు!
అంతా బాగున్నట్టే
ఒకరినొకరు నొచ్చుకోకుండా
అందమైన అబద్ధాలు
చెప్తే ఎవరు నమ్ముతారు?!
పొద్దున్నే మరచిపోకుండా
మనవని గుడ్ మార్నింగ్ పలకరింపు
ఇంపుగానే అనిపించినా
స్పర్శలేని పలకరింపు కలవరపెడతది!
పొద్దున్నో సాయంత్రమో
పిల్లలొచ్చి కౌగిట్లో ఒదిగిపోతే
ఏ తాతకైనా రమ్మని పిలిచినా
బీపీ షుగర్లు దరిచేరవు!
సాయంత్రాలు
పార్కుల చుట్టూ తిరుగుతుంటే
పిల్లలతో వచ్చే జంటలు కనిపిస్తే
కోల్పోయిన ముచ్చట్లు యాదికొస్తవి!
నేనెవర్నీ
నిందించడం లేదు
పొద్దున్నే లేచి ఎవరి జీవితాల్ని వారే
భుజాల మీద మోస్క తిరుగుతున్నరు!
ప్రజలకు ఉన్నచోట
సౌకర్యవంతమైన జీవితాలివ్వని
ఈ ప్రభుత్వాలను
ఇంకా ఎంతకాలం మోద్దాం?!
– కోట్ల వెంకటేశ్వరరెడ్డి 94402 33261