ఆయన మధురమైన గేయాలతో కంటతడి పెట్టిస్తాడు. ప్రౌఢమైన పద్యాలతో మహా పండితులను కూడా హడలెత్తిస్తాడు. ఆయన మృదు మధురమైన ప్రసంగాలతో సభికులను కట్టిపడేస్తాడు. ఆశు కవిత్వంతో అందరినీ అలరిస్తాడు. అమోఘమైన కవితా ప్రవాహంతో ఆకర్షిస్తాడు. చిరునవ్వులు చిందిస్తూ, అలవోకగా చిత్రకవిత్వాన్ని వినిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. ఆయనే అగ్రస్థాయి మహాకవుల వరుసలో నిలువదగిన ప్రౌఢకవి గణపతి రామచంద్రారావు.
కవి గణపతిగా ప్రసిద్ధి పొందిన గణపతి రామచంద్రారావు తెలుగు, సంస్కృత భాషల్లో ఉద్ధండ పండితుడు. ఆయన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో 1940, జూలై 25న యమునాబాయి-లక్ష్మీకాంతారావు దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం మెట్రిక్యులేషన్ మాత్రమే. అయినప్పటికీ శాస్త్ర జ్ఞానానికీ, పాండిత్యానికీ ఏ మాత్రం కొదవ లేదు. ఈయన సరస్వతీ పుత్రుడు. కావ్యాలు, ప్రబంధాలు, వ్యాకరణ, తర్క, ఛంద శాస్ర్తాలన్నీ ఆయన నాలుకపై నాట్యమాడుతుంటాయి.
శ్రీనివాసార్థ శతకం, శ్రీ వేంకటేశ్వర శతకం, వాసర జ్ఞాన సరస్వతీ శతకం, హృద్య పద్య కావ్య సంహిత, యమ నియమ యోగ దర్శనం, రసభూమిక, ఛందశాస్త్రం, షోడశ కర్తాకావ్య శాస్త్రం, రస సిద్ధాంతం, మధుపానం మొదలైన 25 కావ్యాలు రాశారు. వీరు భక్తి పూర్వకమైన శతక రచన ఎక్కువగా చేశారు. కేరళ, మహారాష్ట్ర ప్రాంతాల్లోని భక్తజనం వీరి పద్యాలను ఇప్పటికీ పాడుకుంటారు. ‘తెలుగు నా సవిత, తెలుగు నా కవిత, తెలుగు నా మెతుకు, తెలుగు నా బతుకు’ అని గర్వంగా చెప్పుకొన్న అచ్చమైన విద్వత్కవి గణపతి రామచంద్రారావు. చిత్ర కవిత్వంలో గొప్ప నైపుణ్యం కలవారు రామచంద్రారావు. వీరు నిరోష్ఠ్య పద్యాలను ఆశువుగా చెప్పడంలో ఆరితేరినవారు. నిరోష్ఠ్య పద్యం అంటే పెదవులు అంటకుండా పలికే పద్యం. ఇలాంటి చిత్ర విచిత్రమైన ప్రయోగాలతో కవిత్వం రాయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. సందర్భాన్ని బట్టి, అప్పటికప్పుడు, ఆశువుగా చిత్ర కవిత్వం చెప్పడం సామాన్యమైన విషయం కాదు. ఇంతవరకు ద్విపద ఛందస్సులో శతకాలు రాసిన కవి ఎవరూ లేరు. అలాంటి ద్విపద ఛందస్సులో ‘సంతోషి మాత’ శతకాన్ని వీరు రాశారు. వీరి కుమారుడు అనారోగ్యంతో నడువలేని స్థితిలో ఉన్నప్పుడు..
‘కడలిలోని కల్లోలమునకు కనువిందగు ఒక గతి ఉన్నది కరచరణమ్ములు లేకున్నను గాలి మేతరికి గతి ఉన్నది పద్యమునకు కలిగిన ప్రతి యొక పాదమ్మునకు గతి ఉన్నది ఓ ముద్దుల కుమార! నడువగ నోపవు నీకే గతి ఉన్నది’
కరుణ రసార్ద్ర పూరితమైన ఈ గేయం రాసి వినిపిస్తే మహాకవి సినారె కంటతడి పెట్టుకున్నారంటే వీరి అత్యున్నత ప్రతిభా సంపత్తిని మనం అంచనా వేయవచ్చు.
ఈయన సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు. ఔరంగాబాద్‌లోని ‘మరాఠవాడ ఇతిహాస పరిషత్తు’లో శాశ్వత సభ్యత్వం పొంది చరిత్ర పరిశోధన చేశారు. 1979లో శాతవాహనుల చరిత్రను అప్పటి కలెక్టర్ కోరిక మేరకు ‘కరీంనగర్ మండల చరిత్ర’గా రాశారు. అనేక మంది కవి పండితులతో సాహిత్య చర్చలు చేశారు. ఎన్నో సాహిత్య సంస్థలలో అనేక కావ్య గానాలు, కావ్య సమీక్షలు చేశారు. అభినవ శ్రీకృష్ణ దేవరాయ, సర్వయుగ కవి సామ్రాట్, చతుర్విధ మహా కవితా పితామహ, బ్రహ్మర్షి, మహాకవి గణపతి, వ్యాకరణాలంకార చక్రవర్తి, వంటి బిరుదులు, విశిష్ట గౌరవ సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు.
‘నా తెలంగాణ విజ్ఞాన
నందనోద్యాన సూనమ్ము
నా తెలంగాణ భూలోక
నాకమ్ము నాదు ప్రాణమ్ము’
అని తెలంగాణ వైభవాన్ని ఎలుగెత్తి చాటిన కవి గణపతి రామచంద్రారావు 2005, అక్టోబర్ 12న పరమపదించారు.