సృజన ఏ ఒక్కరి సొంతం కాదు. పైగా భిన్న భాషలు, భిన్న సంస్కృతులు. ఒక భాషలో ప్రతిభావంతులైన వారి సాహిత్య సృజనను ఎంతోమందికి చేర్చాలంటే ‘అనువాదం’ అనేది ఎంతో అవశ్యం. ఎక్కడి డోగ్రి, ఎక్కడి కొంకణి, పక్కన మలయాళీ, మరాఠీ పొరుగున నేపాలీ నుంచి సింహళి వరకు భోజ్పురి నుంచి సంబల్ పురీ ఇలా ఎన్నో భాషల్లో ఇంకిన కవితా మధురిమలు ఇక్కడి తెలుగు వారికి అందడం గొప్ప అవకాశం. వారంతా ఆ వివిధ భాషల కవిత్వాన్ని తమ చేతులతో అందుకుని ఆపాదమస్తకం తిరగేసి, చదివేసి బాధను, సంతోషాన్ని ఆశ్రువులుగా మార్చుకున్న పాఠకులు అనేకం. అందులో నేనొకదాన్ని. వివిధ భాషల కవిత్వం చదవడమంటే కేవలం కవిత్వమే కాదు అక్కడి సంస్కృతినీ చదవడం, అర్థం చేసుకోవడమే.
‘నాకు కవిత్వం కేవలం కవిత్వం కాదు
సగం శబ్దం సగం నిశ్శబ్దం
శబ్దమేమో బతుకు ఏడుపులోంచి
ఎగిసి పడుతున్న ఎక్కిళ్లు
నిశ్శబ్దమేమో బతుకు చేతగానితనం
లోంచి వ్యక్తమవుతున్న ‘మౌనం’
అంతే కాదు కవిత్వ సంక్షోభం కాల ప్రవాహంలోనన్ను ఒడ్డుకు చేర్చే తెరచాపబతుకు సమరంలో నిలబట్టే లంగరు’ అని తన అంతరంగాన్ని ఆవిష్కరించే వారాల ఆనంద్ అనువాదం పట్ల కూడా అంతే నిబద్ధతతో ఉన్నారు. స్వయంగా కవిత్వం రాస్తే రాసిన వ్యక్తి భావం బాణిని మనం తెలుసుకోగలం. కానీ అనువాదం వలన విభిన్న ప్రాంతాల, భాషల ఆలోచనలను ఒడిసి పట్టుకోగలం. అందులో ఓలలాడగలం.
ప్రపంచ సాహిత్యాన్ని ఆసాంతం చదివేయాలని ఆకాంక్ష ఉన్న పాఠకులకు ఆనంద్ లాంటి అనుసృజనకారుల పుట్టుక ఒక వరమే. ద్విభాషా సూత్రం, త్రిభాష సూత్రం అమలు అంటూ ప్రభుత్వాలు ఎన్నిచేసినా మూడు భాషలకు మించి ఎక్కువ మందికి తెలిసే అవకాశం లేదు. మాతృ భాష కాకుండా ఇంకా ఎక్కువ మందికి తెలిసిన మిగతా భాషల్లో కూడా సాహిత్యాన్ని ఆస్వాదించేంత భాషపై పట్టు ఉండదనే చెప్పొచ్చు. మరి అలాంటి అన్యభాషల సాహిత్యంలోని మాధుర్యం పొందాలంటే ఆనంద్ లాంటి వారి అవసరం ఈ సాహితీ ప్రపంచానికి ఎంతో ఉన్నది.
భారత రాజ్యాంగం ఆమోదించిన 22 భాషలే కాకుండా మొత్తం 29 భాషల నుంచి దాదాపు 100 మంది కవుల కవిత్వాన్ని అనువదించి సెంచరీ కొట్టారు ఆనంద్. కవుల్నే కాకుండా కవితలను లెక్కిస్తే 150కి పైగా వారి ‘ఇరుగు పొరుగు’ సంకలనంలో జతచేరాయి. ఆనంద్ ‘ఇరుగు పొరుగు’ సాహి త్య సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలోనే ఉన్నా రు. త్వరలోనే ‘ఇరుగు పొరుగు’ 2వ సంకలనం కూడా రాబోతుందట. గుల్జార్ రాసిన ‘ఎ పోయెమ్ ఎ డే’ అనేది తనకు గొప్ప ప్రేరణ అంటున్న ఆనంద్ కొత్తతరం అనువాదకులకు మార్గదర్శి అనడంలో సందేహమే లేదు. ఇప్పటికే గుల్జార్ గ్రీన్ పోయెమ్స్ను ఆకుపచ్చ కవితల పేరున తెలుగులోకి అనువదించారు ఆనంద్. ఆ సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డునిచ్చి సత్కరించింది.
ఎంత ఇష్టం ఉన్నా చదివి పూర్తిగా అర్థం చేసుకోలేని భాషను పరాయి బాషగానే చూస్తాం. కానీ, ఆనంద్ పుణ్యమాని గుల్జార్ గ్రీన్ పోయెమ్స్(ఆనంద్ ఆకుపచ్చ కవితలు)తో తెలుగువాళ్ల సాహితీ లోగిళ్ల పుస్తకాల అలమారాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. యువతను చదివించే విధంగా ఉన్న రూపికౌర్ ఆంగ్లం లో తన చిన్న చిన్న కవితలతో ఇన్స్తా పోయట్గా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించారు. అంతేకాదు, ఆమె యువతతో సాహి త్యం చదివించడంలో విజయం సాధించారు. ఇలాంటి కవితలను అనువదించడం ద్వారా ఆనంద్ కూడా తెలుగు యువతరానికి చేరువయ్యారు.
‘అతన్ని ఎట్లా ప్రేమించాలో నేర్చుకుంటున్నాను నన్ను నేను ప్రేమించుకుంటూ’ అంటారు. అంతే కదా! ఇద్దరు ఒకటే అయినపుడు అంతకుమించి ఇంకేముంది. అదే ప్రేమకు పరాకాష్ట. పొట్టి పొట్టి వాక్యాల్లో ఇంతటి గట్టి భావాన్ని అందించి అనువాదానికి అందం తెచ్చారు.
అశోక్ వాజపేయి హిందీ మూల కవిత మరణం గురించి…‘చిన్న పిల్లాడిని ఉదయపు నడకకు చేతి వేలు పట్టుకుని తీసుకెళ్ళినట్టు తనతో తీసుకెళ్ళిపోతుంది’ అంటూ చాలా సున్నితంగా సుతిమెత్తగా మనం వెళ్లిపోవాల్సిందే అనే చేదు నిజాన్ని తేట తెలుగులో తీయంగా మార్చారు. ఈ సందర్భంలో భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్టు అని చేగువేరా వాక్యాలు గుర్తొస్తాయి. ఇక అరిజిత్ రావు ఆంగ్ల కవిత ‘పగిలిన హృదయాలు’ భిన్నమైనవైనా ఒకేలా ఉంటాయి.
‘బహుశా అందుకేనేమో కన్నీళ్లకు ఏ రంగు ఉండదు. అవునవును కన్నీళ్లకు మూలాలుంటాయి’ రంగు రుచి వాసన ఉండదంటూనే తెలుగు వర్ణం అద్దారు. ‘వీడ్కోలు’ అనే బద్రీనాథ్ హిందీ కవితలో..‘వీడ్కోలు’లో నిర్ణయించడం ఒకింత కష్టమే ఎవరు ఎవరికి వీడ్కోలు చెప్తున్నారో ఇద్దరు ఆకర్షణీయమైనవారే ఇద్దరు ఆధునికులే కానీ ఒకటే అంశం సాంప్రదాయకమైంది అదేమిటంటే ఇద్దరు ఏడుస్తున్నారు’ అన్నారు. ఎవరు ఎవరికి చెప్పినా వీడ్కోలు విచారకరమే! వీడ్కోలులో ఉన్న బాధ లోతును చక్కని పదప్రయోగంతో కళ్లకు కట్టినట్టు అనువదించి రాసి కన్నీళ్లు తెప్పించారు ఆనంద్. గొప్ప కవిత్వాన్ని అనుసృజన ద్వారా అమ్మ భాషలోకి కూర్చి అమ్మ రుణం తీర్చుకున్నారాయన.
ఇంతమంది కవుల మది తలుపు తట్టి వారి భావనల్లోకి తొంగిచూసి పాఠకులకు అత్యంత సులభంగా సాహితీ ప్రపంచాన్ని సందర్శించే అవకాశాన్ని అందించిన ఆనంద్కు అభినందనలు.
-కల్వకుంట్ల శ్రీలత రావు
94914 80386