China | చైనా రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం సోమవారం స్పందించింది. ఆ వాదనలు నిరాధారమని పేర్కొంది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. బీజింగ్ ఎప్పుడూ శాంతియుత అభివృద్ధి మార్గానికి కట్టుబడి ఉందన్నారు. అణ్వాయుధాల విషయానికి వస్తే.. కఠినమైన ‘నో ఫస్ట్ యూస్’ అనే విధానాన్ని అనుసరిస్తుందని తెలిపారు. చైనా అణు వ్యూహం ‘పూర్తిగా రక్షణాత్మకమైనది’, అన్ని అణు పరీక్షలపై తాత్కాలిక నిషేధాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
చైనా అంతర్జాతీయ కమిట్మెంట్స్కు కట్టుబడి ఉందని.. ప్రపంచశాంతి, స్థిరత్వాన్ని నిలబెట్టడంలో చురుకైన పాత్ర పోషిస్తూనే ఉంటుందని మావో పేర్కొన్నారు.
అణు సమస్యలపై చైనా నిరంతరం బాధ్యతాయుతమైన వైఖరిని కొనసాగిస్తుందని ఆమె తెలిపారు. బీజింగ్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. మూడు దశాబ్దాలకుపైగా తొలిసారిగా అమెరికా తన సొంత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించిన తర్వాత.. అణు పరీక్షలపై మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చైనా స్పందించింది. ఇటీవల ట్రంప్ రష్యా, చైనా, పాకిస్తాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు రహస్య పరీక్షలు నిర్వహించాయని ఆరోపించారు. ఈ సందర్భంగా మళ్లీ అణ్వాయుధ పరీక్షలకు సన్నాహాలు ప్రారంభించాలని పెంటగాన్‌ను ఆదేశించారు.
ఈ అంశంపై ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మళ్లీ స్పందించారు. రష్యా, చైనా, పాకిస్థాన్, ఉత్తర కొరియా తదితర దేశాలు అణు పరీక్షలను నిర్వహిస్తున్నాయని.. కానీ వారు వాటిగురించి మాట్లాడటం లేదన్నారు. తాము అలా కాదని.. వారికి భిన్నంగా ఏదైనా బహిరంగంగానే చేస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలకు ఉన్న విధ్వంసకర శక్తి కారణంగా ఆ పరీక్షలు చేయకూడదని గతంలో నిర్ణయించినట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. ఇతర దేశాలు వేగంగా తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయన్న ఆయన.. అణ్వాయుధ సామర్థ్యంలో అమెరికా, రష్యా, చైనా ఐదేళ్లలోపు సమానస్థాయికి చేరుకునే అవకాశం ఉందని.. అందుకే మళ్లీ అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాల్సి వచ్చిందని ట్రంప్ చెప్పుకొచ్చారు.