హైదరాబాద్, మార్చి 12 : హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నూతనంగా నిర్మించిన మెడికవర్ దవాఖానను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ దవాఖాన ప్రారంభంతో దేశంలో మెడికవర్ దవాఖానల సంఖ్య 25కు చేరింది. ప్రారంభోత్సవంలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్‌కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, దవాఖాన యాజమాన్యం, వైద్యులు పాల్గొన్నారు. ఈ దవాఖానను అత్యాధునిక సదుపాయాలు, ఆధునిక సాంకేతికతతో 550 పడకల సామర్థ్యంతో నిర్మించారు. ఈ దవాఖానలో ముఖ్యంగా 5 సెకండ్లలోనే గుండె స్కాన్ పూర్తిచేసే అత్యాధునిక హార్ట్ స్కానింగ్ టెక్నాలజీని అందుబాటులో ఉంచారు. 640-ైస్లెస్ సీటీ స్కాన్‌ను ఏర్పాటుచేశారు. దవాఖాన ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ దేశంలోనే అత్యంత హెల్త్‌కేర్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్నట్టు పేర్కొన్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో కూడిన దవాఖానలు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించనున్నట్టు తెలిపారు.
వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యరంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. మెడికవర్ దవాఖానల మేనేజింగ్ డైరెక్టర్(ఇండియా)అనిల్‌కృష్ణ మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజలకు ప్రపంచస్థాయి వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ఈ దవాఖానను ప్రారంభించినట్టు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్‌రెడ్డి మాట్లాడుతూ.. 640-ైస్లెస్ సీటీస్కాన్, వేగవంతమైన హార్ట్ స్కానింగ్ వంటి ఆధునిక యంత్రాలతో కచ్చితమైన నిర్ధారణ చేసి రోగులకు చికిత్స అందించనున్నట్టు చెప్పారు. మరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి వైద్యసేవల అవసరం పెరిగిందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దవాఖానను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. డైరెక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన వైద్యనిపుణులు, ఆధునిక వైద్య పరికరాలు, సమగ్ర వైద్యవిధానాలతో ఈ ఆస్పత్రిని ముందుకు తీసుకొచ్చినట్టు చెప్పారు.