ప్రేమ తాలూకు భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు హను రాఘవపూడిది అందెవేసిన చెయ్యి. తొలి సినిమా ‘అందాల రాక్షసి’ నుంచి ‘సీతారామం’ వరకూ ఆయన ప్రతి సినిమాలోనూ ప్రేమతో కూడిన బలమైన ఎమోషన్ ఉంటుంది. అగ్ర హీరో ప్రభాస్‌తో ఆయన తెరకెక్కిస్తున్న పానిండియా చిత్రం ‘ఫౌజీ’లోనూ హీరోయిన్ పాత్ర కోణంలో అలాంటి ఎమోషనే ఉంటుందట.
యుద్ధం అనే వినాశనం మధ్య చిగురించే సున్నితమైన ప్రేమను ‘ఫౌజీ’లో హను రాఘవపూడి చూపించబోతున్నారు. ఓ సైనికుడి మనసులోని మమకారం, ప్రేమ కోసం తను చేసే పోరాటం ‘ఫౌజీ’లో హైలైట్‌గా ఉంటుందని తెలిసింది. యుద్ధభూమిలో ఉండే ఉద్వేగం, ప్రేమలో ఉండే ప్రశాంతత.. ఈ రెండిటి మధ్య వైరుధ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించే సినిమా ‘ఫౌజీ’ అని, ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదని, ఇదొక ఎపిక్ లవ్‌స్టోరీ అని చిత్రయూనిట్ చెబుతున్నది.
ముఖ్యంగా ఈ సినిమా ైక్లెమాక్స్ గుండెలు పిడేసేలా ఉంటుందట. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం ఈ దృశ్యకావ్యానికి ప్రధానబలం కానున్నదని మేకర్స్ చెబుతున్నారు. 1940 నాటి యుద్ధ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో శరవేగంగా జరుగుతున్నది. ఇమాన్వి కథానాయికగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, అనుపమ్‌ఖేర్, జయప్రద, చైత్ర జై ఆచార్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ యర్నేని, యలమంచిలి రవిశంకర్, నిర్మాణం మైత్రీమూవీమేకర్స్, సమర్పణ: టి.సిరీస్.