కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నా, అడుగడుగునా ఆంధ్రాధిపత్యమే కొనసాగుతుందనేందుకు నిదర్శనమే కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా ఇచ్చే బాల సాహిత్య పురస్కారం. ఈ పురస్కారాన్ని తెలుగుతో పాటు 24 భారతీయ భాషల్లో కృషి చేసిన సాహిత్యకారులకు ఇస్తున్నారు. ఈ అవార్డు తెలుగు బాల సాహిత్యంలో కృషి చేస్తున్న కవులకు, రచయితలకు 2010-2025 వరకు 15 మందికి ఇచ్చారు. ఇందులో తెలంగాణ రచయితలు నలుగురే. వారు భూపాల్, దేవరాజు మహరాజు, పత్తిపాక మోహన్, వాసాల నర్సయ్య. అంటే 27 శాతం అవార్డులు మాత్రమే తెలంగాణ రచయితలకు దక్కాయి. మిగిలిన 11 మందికి, అనగా 73 శాతం అవార్డులు ఆంధ్ర వారికే దక్కాయి.
బడి పిల్లలకు కథల వర్క్ షాప్స్ నిర్వహించి, కథలు రాయించి, పుస్తకంగా అచ్చు వేయించి, పిల్లలతోనే ఆవిష్కరణ చేయించిన బాల కథ రచయిత, కార్టూనిస్టు, చెకుముకి విద్యార్థి పత్రికకు సంపాదక మండలి సభ్యులు, తొలి తెలంగాణ మాండలిక బాల కథా రచయిత, పాఠ్య పుస్తక రచయిత, 47 గ్రంథాలు వెలువరించిన రామన్నపేట ఉపాధ్యాయులు, పొట్టి శ్రీరాములు కీర్తి పురస్కార గ్రహీత, పెండెం జగదీశ్వర్‌కు ఈ అవార్డును ఇవ్వనే లేదు. అవార్డు కోసం కలలు కంటూనే ఆయన కన్నుమూశారు. వీరు పోటీలో ఉన్నప్పుడూ సైతం కేవలం రెండు కథల పుస్తకాలు రాయడం తప్ప, బాలల అభివృద్ధి కోసం ఏ మాత్రం కృషి చేయని ఆంధ్ర రచయితకే ఈ అవార్డు ఇవ్వడం అత్యంత విషాదకరం. ఎనభై ఏండ్ల సీనియర్ రచయితల నుంచి ఇరవై ఏండ్ల రచయితల వరకూ వందలాదిమంది తెలంగాణలో అర్హులున్నారు. కానీ, వీరివైపు అవార్డు కన్నెత్తి కూడా చూడదు. ఇలా చెప్పుకొంటూపోతే ప్రతి ఏడాది తెలంగాణ బాలల సాహిత్యకారులది వలపోతే.
ఒక ఏడాది ఆంధ్ర ప్రాంతానికి చెందిన రచయితకు ఇచ్చి, మరో ఏడాది తెలంగాణ వారికి ఇవ్వడం సాహిత్య ధర్మం అనిపించుకుంటుంది. కానీ, ఒక ఏడాది ఆంధ్ర ప్రాంతానికి చెందిన రచయితకు ఇచ్చి కూడా, మరుసటి ఏడాది అదే ఊరు, అదే బజారుకు చెందిన రచయితకు అవార్డు ఇవ్వడం ఏం న్యాయం అనిపించుకుంటుంది. తెలంగాణలో బాల సాహిత్య రచయితలే లేనట్లు సాహిత్య అకాడమీ వ్యవహరించడం బాధాకరం. నేడు తెలంగాణలో వందలాది మంది రచయితలు బాల సాహిత్య సృజన చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
తెలంగాణ వచ్చాక, తెలుగు పాఠ్య పుస్తకాల్లో సృజనాత్మక రచన కోసం ప్రత్యేక విధానం రూపొందించారు. అందులో భాగంగా అనేకమంది ఉపాధ్యాయులు పిల్లల్లో దాగి ఉన్న రచనాశక్తిని వెలికితీసి కథ, కవిత, లేఖా రచన, విమర్శ మొదలైన విభాగాల్లో తర్ఫీదునిచ్చి వందలాది సంకలనాలను తీసుకొస్తున్నారు. తామూ స్వయంగా గ్రంథ రచన చేస్తున్నారు. ఇది ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాలేదు. తెలంగాణలోని 33 జిల్లాల ఉపాధ్యాయులు ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ఇవేవీ అకాడమీ దృష్టికి రావు. ఇందుకోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులు వీరి కంటికి కనిపించరు.
మరో చిత్రమేమిటంటే వీరు పరిగణనలోకి తీసుకునే నాలుగు సంవత్సరాల కాలంలో వందలాది రచయితలు బాల సాహిత్య సృజన చేస్తున్నారు. చివరి ఎంపిక కోసం ఇచ్చే పది లేదా పన్నెండు పుస్తకాల జాబితాలో ఒకే రచయితవి మూడు పుస్తకాలు, మరో రచయితవి రెండు పుస్తకాలు ఉంచడమేమిటో? దీని వెనుక ఉన్న మర్మం అకాడమీకే తెలియాలి. రచయిత సూచించిన, నచ్చిన ఒక్క పుస్తకాన్నే పోటీలో ఉంచవచ్చు కదా? అంటే, ఆయా రచయితల పుస్తకాన్నే ఎంపిక చేయాలని అకాడమీ సభ్యులని పరోక్షంగా ఆదేశిస్తున్నట్టా? మిగతా రచయితల పుస్తకాలనూ జాబితాలో పొందుపరిచి కొద్ది మందికైనా అవకాశం కల్పించవచ్చు గదా? ఇది పాలకమండలి లోపమా? నిపుణుల కమిటీ లోపమా? అకాడమీ ఆశ్రద్ధా? ఇంకో విషాదకరమైన విషయమేమిటంటే, పాలకమండలికి జర్నలిస్ట్ విభాగం నుంచి ఒకరిని, యూనివర్సిటీ నుంచి మరొకరిని ఇలా వివిధ రంగాలకు చెందిన పది, పన్నెండు మంది సభ్యులను అకాడమీ ఎంపిక చేస్తుంది. కానీ, ఇందులో ఒక్క బాల సాహితీవేత్తను కూడా ఎంపిక చేయడం లేదు. బాల సాహిత్య రంగంలో ఉత్తమ గ్రంథాన్ని, ఇతర రంగాలకు చెందిన వారు ఎంపిక చేయాల్సి వస్తున్నది. బాల సాహిత్యం రాస్తున్నవారు ఎవరో తెలియక, అవార్డు ఎంపిక కోసం ఈ సభ్యులు బాల సాహితీవేత్తలను వివరాలు అడిగిన సందర్భాలు అనేకం.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వందల మంది సాహిత్య, కళలు మొదలగు రంగాలకు చెందిన వారిని ఎంపిక చేసి, అవార్డులు ఇచ్చి సత్కరించింది. తెలంగాణ, ఇతర రాష్ర్టాల్లోనూ స్థిరపడిన ఆంధ్ర సాహిత్యకారులు వెళ్లి అవార్డులు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ సెక్రెటరీగా ఉన్న కె.శ్రీనివాసరావుకి కూడా అవార్డు ప్రకటించారు. మనకేం అభ్యంతరం లేదు. కానీ, ఆంధ్ర ప్రాంత రచయితలకు పెద్దపీట వేయడమే తెలంగాణ రచయితల అస్తిత్వాన్ని దెబ్బతీసినట్టుగా బాల సాహితీవేత్తలు భావిస్తున్నారు. ఇదేదో అకాడమీ ఇచ్చే డబ్బు కోసం వెంపర్లాడటమూ కాదు. ఆ మాటకొస్తే నూటికి 90 మంది రచయితలు, అవార్డు మొత్తం కంటే ఎక్కువే నెల జీతాలు పొందుతున్నారు. ఇది తెలంగాణ బాల సాహిత్యకారుల ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం.
తెలంగాణ రచయితలకు అవార్డులు
ఇచ్చే క్రమంలో ‘మేము కూడా తెలంగాణ వాసులమే. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. మా ఇండ్లు, ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయి’ అని క్లెయిమ్ చేయడం ఆంధ్ర రచయితల ద్వంద ప్రవృత్తి కాదా? రచయిత ఏ ప్రాంతం వారో అకాడమీ పరిగణనలోకి తీసుకోదా? తెలిసే తెలియనట్లు నటిస్తోందా? భాషనే కానీ, ప్రాంతం చూడం అంటారు. మరి ఈ 11:4 నిష్పత్తి ఏమిటీ? ఆంధ్ర ప్రాంతం నుంచి అవార్డులు పొందిన రచయితలకు దీటైన తెలంగాణ రచయితలను రెండు డజన్లకు పైగా చూపించగలం.
‘Son of Soil’ అన్నది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధమైన నినాదం. ఎక్కడి భూమిపుత్రులకు అక్కడి వనరుల మీద హక్కు ఉంటుంది. దాని కోసమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా నడిచిందన్నది అందరికీ తెలిసిందే. సిద్దిపేట నుంచి శ్రీకాకుళం వరకు అనేక సాహిత్య సంస్థలు అవార్డులను ఇస్తున్నాయి. ఆ అవార్డులను నెలకొల్పిన వారి ఇష్ట ప్రకారం వారు అవార్డులు ఎవరికైనా ఇవ్వవచ్చు. కానీ, ప్రజలు కట్టే పన్నులతో, ప్రభుత్వం కొన్ని నియమ, నిబంధనలు ఏర్పరిచి ఇచ్చే అవార్డుల్లో పక్షపాతం చూపించడం, తెలంగాణ రచయితలను చిన్నచూపు చూడటం కచ్చితంగా అవమానించడమే. ‘వడ్డించేవాడు మనవాడైతే కడ బంతిలో ఉన్నా మన ముక్క మనకొస్తది’ అనేది తెలంగాణలో ఒక నానుడి. ఆంధ్ర అధికారులతో పాటు ఒక తెలంగాణ అధికారి ఉంటేనే, మన ప్రాంత రచయితలకు న్యాయం జరుగుతుందని ఇక్కడి రచయితలు అభిప్రాయపడటంలో తప్పు లేదు.
చివరిగా ఒక్క మాట. 2010లో నెలకొల్పిన ఈ పురస్కారానికి రూ.50 వేలు నగదు బహుమానంగా ఇస్తున్నారు. ఈ పదిహేనేళ్ల కాలంలో ధరలు ఎన్ని రెట్లు పెరిగాయి. ప్రజాప్రతినిధులు ఎన్ని రెట్లు జీతాలు, అలవెన్సులు పెంచుకున్నారో ప్రభుత్వానికి తెలియనిదా? యువ సాహిత్య పురస్కారానికి ఇస్తున్నట్లు కనీసం లక్ష రూపాయలైనా ఇవ్వకూడదా? అవార్డు పొందినవారిలో కొంతమంది బాల సాహిత్య ట్రస్ట్‌లు నెలకొల్పి, సాటి రచయితలను, విద్యార్థులను ప్రోత్సహిస్తూ, సాహిత్య సేవ చేస్తూ, సమాజ ఉన్నతికి దోహదం చేస్తున్నారు. బాల సాహితీవేత్తలు సమాజానికి ఇచ్చే దాంతో పోలిస్తే, అకాడమీ ఇచ్చేది చాలా తక్కువ. విజ్ఞులు, తెలంగాణ సాహిత్యకారులు ఈ వివక్ష గురించి ఆలోచించాలి.
(వ్యాసకర్త: బాల సాహిత్య రచయిత)
ఒక ఏడాది ఆంధ్ర ప్రాంతానికి చెందిన రచయితకు ఇచ్చి, మరో ఏడాది తెలంగాణ వారికి ఇవ్వడం సాహిత్య ధర్మం అనిపించుకుంటుంది. కానీ, ఒక ఏడాది ఆంధ్ర ప్రాంతానికి చెందిన రచయితకు ఇచ్చి కూడా, మరుసటి ఏడాది అదే ఊరు, అదే బజారుకు చెందిన రచయితకు అవార్డు ఇవ్వడం ఏం న్యాయం అనిపించుకుంటుంది. తెలంగాణలో బాల సాహిత్య రచయితలే లేనట్లు సాహిత్య అకాడమీ వ్యవహరించడం బాధాకరం.
-పుప్పాల కృష్ణమూర్తి
99123 59345