తెలుగు కావ్యాల్లో అయోధ్య వర్ణన
మర్యాద పురుషోత్తముడు, పితృవాక్య పరిపాలకుడు, నీలమేఘ శ్యాముడు, అమేయకృపావతంసుడైన రామచంద్రుని జన్మస్థలి అయోధ్యలో ఆలయ నిర్మాణం జరుగుతున్న తరుణంలో మన ప్రాచీన తెలుగు కావ్యాల్లో అయోధ్యాపురాన్ని ఎలా వర్ణించారో కావ్యాలు, పద్యాల ద్వారా అవలోకనం చేసుకుందాం.
మర్యాద పురుషోత్తముడు, పితృవాక్య పరిపాలకుడు, నీలమేఘ శ్యాముడు, అమేయకృపావతంసుడైన రామచంద్రుని జన్మస్థలి అయోధ్యలో ఆలయ నిర్మాణం జరుగుతున్న తరుణంలో మన ప్రాచీన తెలుగు కావ్యాల్లో అయోధ్యాపురాన్ని ఎలా వర్ణించారో కావ్యాలు, పద్యాల ద్వారా అవలోకనం చేసుకుందాం.
ఆదికవి వాల్మీకి రామాయణాన్ని మూలంగా, ఆలంబనగా, ఆధారంగా చేసుకుని తెలుగులో యాభైకి పైగా పద్య కావ్యాలు వెలువడ్డాయి. విశ్వనాథ తన రామాయణ కల్పవృక్షంలో వచనంతో అయోధ్య నగరాన్ని వర్ణించారు. ‘పండ్రెండు యోజనముల పొడవు, మూడు యోజనముల వెడల్పు గల అయోధ్యాపురి’ అని చెప్తూ సీస పద్యం మొదలెట్టి ఎత్తుగీతిలో…
క్రిక్కిరియకుండ ప్రతిమేడ ప్రక్కలందు
బ్రసవితోద్యానములు నామ్రవనములొప్ప
నొడయనికి శాత్రవులకె యయోధ్య గాక
యోధ్యవరపురి శోభ కయోధ్య యయ్యె!
అయోధ్య అంటే శత్రువులకు మాత్రమే జయింప వీలుకానిది కాదు, అక్కడి వీరుల జయింపలేని శోభకు కూడా అయోధ్యే అంటూ చమత్కరించారు.
ప్రముఖ కవయిత్రి మొల్ల తన రామాయణంలోని
సీస పద్యంలో…
సరయూ నదీతీర సతత సన్మంగళ
ప్రాభవోన్నత మహా వైభవమ్ము
కనకగోపుర హర్మ్య ఘన కవాటోజ్వల
త్ప్రాకార గోపుర శ్రీకరమ్ము
గజరాజి రథభట గణికాతపత్ర చా
మర కేతు తోరణ మండితమ్ము
ధరణీవధూటికాభరణ విభ్రమరేఖ
దర్శించు మాణిక్య దర్పణమ్ము
భానుకులదీప రాజన్య పట్టభద్ర
భాసి నవరత్నఖచిత సింహాసనమ్ము
నాగ నుతికెక్కు మహిమ ననారతమ్ము
ధర్మనిలయమ్ము మహి నయోధ్యాపురమ్ము
అంటూ సరయూ నదీతీరంలోని బంగారు గోపురాల మేడలు, ఏనుగులు, రథ భట, అశ్వ సంపదలు కలిగి ధరణీ వధూటి తన ఆభరణాలు సరిచూసుకునే దర్పణంలా ఉందని వర్ణిస్తూ సూర్యవంశపు రాజుల నవరత్నఖచిత సింహాసనమై ధర ధర్మనిలయంగా అయోధ్యను భావించారు.
ఉత్తర రామాయణంలో కంకంటి పాపరాజు ఇలా వర్ణించారు…
శ్రీతరుణీవిహార సరసీజ విరాజిత రాజసౌధ సం
ఘాతము, గోపుర స్ఫురిత కాంచన కుంభ విభాభి భూత ఖ
ద్యోతము, ద్యోతమాన మణితోరణ వార సమేత మొప్పు సా
కేతము, వాలు సంచలిత కేతు పట ప్రహతాభ్ర జాతమై
శ్రీలక్ష్మి విహరించు పద్మములలాగా ప్రకాశించుమేడల సమూహం కలది, సూర్యుని కాంతులనే తిరస్కరించగల స్వర్ణమయ గోపుర కాంతులు కలది, మణితోరణాల సమూహాలతో కూడినది, గాలికి కదలాడే ధ్వజ వస్త్రంచేత కట్టబడిన మేఘసమూహం కలదై ఆ సాకేతం ఒప్పుతున్నది అని మనోహరంగా వర్ణించారు కంకంటి పాపరాజు.
గోన బుద్ధారెడ్డి తన రంగనాథ రామాయణం
ద్విపద కావ్యంలో…
మణిగోపురంబుల మణితోరణముల- మణికుట్టిమంబుల మణి గవాక్షముల
గేళికాగృహముల గృతక శైలముల-బాలానిలంబుల బటహ నాదముల
విమల సౌధంబుల విపణి మార్గముల- గమనీయ వరముల కమలాకరముల
భానుకులజులకు కులరాజధానియై అయోధ్య ఒప్పుచున్నది అని వర్ణించారు
రమణీయమూ ప్రౌఢమూ అత్యద్భుతమైన చంపూ రామాయణంలో కవి కార్వేటినగర సంస్థాన విద్వత్కవి శ్రీ ఋగ్వేదికవి వేంకటా చలపతి కవి
మాటల జవరాలి మగనికి నామ భేదంబులే కటకంబు ధరణి సురులు అని రాశారు. మాటల జవరాలు సరస్వతి. ఆమె భర్త బ్రహ్మ, వేద పాండిత్యంలో బ్రహ్మకు ఇక్కడి బ్రాహ్మణులకు తేడా లేదని అంటూ మిగతా త్రివర్ణాల ప్రజలను కూడా వర్ణిస్తూ
వెలయునది సారవాజ గంధిలసమీర, వికసితారామ వాటికా విహరమాణ
కీరకంఠకలకలోద్గీత బిరుద రతి వధూజాని సాకేత రాజధాని అంటూ ప్రౌఢమైన సమాసంతో ముగిస్తారు.
ఇక అయ్యలరాజు రామభద్రుడు తన రామాభ్యుదయం కావ్యంలో అత్యద్భుతమైన వర్ణన గావించారు.
ఖరకరహరిఖురాగత సింధు పంకంబు, గంగాతరంగ శీకరములుడుప
గరికర్ణపుటమరుద్గతి వీక, వినువాక పూవు పుప్పొడి ధూళి బోవ ద్రోయ
డగ్గరి పెంపెక్కు నగ్గల పుంజుక్క, నిగ్గులు ముత్యాల మ్రుగ్గు గాగ
వాలుగా గైవ్రాలు వేలుపు పూబంతి, చాలు మేలైన వాసనలు గ్రుప్ప
నెపుడు జేయని శృంగార మెనయుచుండ
గొమరు మీరిన రత్న శృంగముల యొరపు,
నెట్టుకొని మించు జాళువా గట్టుతోడి, జోడు కోడియ లవ్వీటి మేడగములు
అంటూ అయోధ్యలోని మేడలు ఎంత ఎత్తులో ఉన్నాయో ఆశ్చర్యకరమైన పోలికలతో వర్ణించారు అయ్యలరాజు రామభద్రుడు.
ఆకాశంలో వెళ్తున్న సూర్యుని గుర్రముల గిట్టలతో లేచిన సముద్రపు బురద ఆ మేడలను అంటుకోగా ఆకాశగంగ వాటిని శుభ్రపరిచింది. ఈ నగరంలోని వెడల్పైన ఏనుగు చెవులు ఊపడంతో వచ్చిన గాలి ఆకాశగంగలోని తామరపూల పుప్పొడిని వెడల గొట్టింది. వేలుపు పూబంతిని పారిజాత పుష్పం అంటే అన్వయం చక్కగా కుదురుతుంది. అమరావతిలోని పారిజాత పూల వాసన ఆ మేడల మీద తగులుతున్నది. అలా స్వర్ణతాపడం చేసిన ఆ మేడలు ఆకాశాన్నంటుతున్నాయని అద్భుతంగా వర్ణించారు.
ఇక కళాప్రపూర్ణ జనమంచి శేషాద్రి శర్మ తన శ్రీ ధర్మసార రామాయణంలో…
శ్రీరమణీనివాసమయి సిద్ధ సుపర్వగణ ప్రపూజ్యమై
చారుతరోన్నత ప్రకట పద్మ సమూహ సమావృతంబునై
వైరుల కెన్నడైన గెలువంగ జొరంగ నశక్యమె మహో
దారనృపాల పూతమయి ధాత్రి జెలంగు నయోధ్య యెంతయున్
అంటూ లక్ష్మీ దేవి నివాసమై దేవతలతో పూజలందుకున్న అందమైన పద్మపుష్ప సమూహాలతో జయింపనశక్యమై అని అయోధ్యను మనోహరంగా వర్ణించారు.
ఇలా తెలుగు పద్య కావ్యాల్లో అయోధ్యను అద్భుతంగా వర్ణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తెలుగు పద్య కవుల సాహితీ పటిమకు, అద్భుతమైన వారి పాండిత్యానికి నిదర్శనమే ఈ వర్ణనలు.
చేపూరి శ్రీరాం
97055 91497
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

