హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సర్వేకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించి కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీ సుదర్శన్‌రెడ్డి కోరారు. బీఆర్కే భవన్‌లోని సీఈవో కార్యాలయంలో శుక్రవారం ‘సర్’ ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం అర్హులైన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చి, అనర్హులను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితాను తయారు చేసేందుకే ‘సర్’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.
ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే గణన ప్రారంభం కానున్నందున, బీఎల్వోలు తమ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందిస్తారని, వాటిని పూరించే విషయంలో రాజకీయ పార్టీలు బీఎల్ఏ ద్వారా సహకరించాలని సుదర్శన్‌రెడ్డి కోరారు. ఇందుకు సంబంధించి బీఎల్ఏలకు అవగాహన కల్పించాలని, ‘సర్’పై ప్రజలకు ఎలాంటి అపోహలు, అనుమానాలు కలుగకుండా తమవంతు బాధ్యతగా అవగాహన కల్పించాలని సూచించారు. మ్యాపింగ్‌తో సంబంధం లేకుండా ఎన్యుమరేషన్ ఫారాలు పూరించి సమర్పించిన ప్రతి ఓటరును జూలై 31న ప్రచురించే ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చనున్నట్టు తెలిపారు. ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలను అధికారిక పోర్టల్ voters.eci.gov.in ద్వారా ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చని చెప్పారు.