హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): నేరాల స్వరూపం వేగంగా మారుతున్న క్రమంలో టెక్నాలజీని వినియోగించడమే సమర్థవంత పోలీసింగ్‌కు మూల సూత్రమని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్, షీ సైబర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, దర్యాప్తు, సైబర్ నేరాల ఛేదన, డాటా విశ్లేషణ వంటి రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తున్నదని తెలిపారు. తెలంగాణ పోలీసుశాఖ సాంకేతిక వినియోగంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏసీబీ అండ్ సీఐడీ డీజీ చారుసిన్హా, డీఐజీలు నవీన్‌కుమార్, నారాయణ నాయక్, పరిమళ హనా నూతన్, ఎస్పీ శ్రీనివాస్, సీఐడీ అధికారులు పాల్గొన్నారు.