దేశ రాజధాని ఢిల్లీలో చలో పార్లమెంటు నినాదంతో కదంతొక్కిన యువతపై పోలీస్ లాఠీలు విరుచుకుపడటం, వీధుల్లో నెత్తురు చిందడంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. సుమారు పన్నెండేండ్ల క్రితం నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన కీలక నిరసనోద్యమంగా ఇది నిలుస్తుందని చెప్పవచ్చు. ఏ దేశంలో అయినా రాజకీయాలకు తమ ఆందోళనల ద్వారా యువత-విద్యార్థులు దిశానిర్దేశం చేయడం ఇటీవల చరిత్ర చెప్తున్న సత్యం. అయితే దీన్ని ఏదో పేపరు లీకేజీలు, రాజీనామా డిమాండ్లకు సంబంధించిన వ్యవహారంలా చూడటం సరైంది కాదు. ఎన్డీయే 12 ఏండ్ల పాలనపై దేశంలో కొన్నేండ్లుగా పేరుకుపోతున్న అసంతృప్తి ఒక్కసారిగా బద్దలవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పాలనను ఎండగట్టి ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించిన బీజేపీ.. తమకు అధికారం చేతికిస్తే తానూ అదే బాటలో వెళ్తానని ఢిల్లీ వీధుల్లో పారిన యువకుల రక్తధారల సాక్షిగా చాటిచెప్పింది.
జవాబుదారీ కావాలని డిమాండ్ చేస్తూ, వేలాది మంది యువతీయువకులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తే పోలీసు జులుం ప్రయోగించింది. పరిస్థితి చేయిదాటిపోయే సమయం రావడంతో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా తూతూమంత్రం మంతనాల తంతు కొనసాగిస్తున్నది. విద్యార్థుల డిమాండ్లు పూర్తిగా నెరవేరుతాయో లేదో తెలియదు కానీ, కేంద్రం మేకపోతు గాంభీర్యం చెదిరిన సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఆ మేరకు నిరసనకారులు విజయం సాధించినట్టే. కేంద్ర సర్కార్‌పై సమాజంలో అసంతృప్తి ఎంత లోతుగా, ఎంత విస్తృతంగా ఉన్నదో విద్యార్థుల ఆందోళన బయటపెట్టింది. ఇది రాత్రికి రాత్రే రాజుకున్న నిప్పు కానే కాదు. దీని వెనుక గూడుకట్టుకున్న నైరాశ్యం, అనిశ్చితి, అవకాశాల కొరత, పాలనపై నమ్మకం తగ్గడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీపై ఆగ్రహంతో ప్రారంభమైన ఈ ఉద్యమం, ఇపుడు మరింత విస్తృత రాజకీయ-సామాజిక ప్రశ్నలను లేవనెత్తుతున్నది.
ఎంతకాలం వరకు హిందూముస్లిం, ఇండియాపాకిస్థాన్ వంటి విభజనాత్మక రాజకీయాలనే ప్రజల ముందు ఉంచుతారు? అనే ప్రశ్న యువత నుంచి స్పష్టంగా వినిపిస్తున్నది. పాలనలో బాధ్యత, జవాబుదారీతనం, విద్యావిధానాల లోపాలు, అభివృద్ధిలో అసమానతలు, పేదరికం, ఉద్యోగావకాశాల కొరత వంటి అనేక అంశాలు ఇపుడు యువత ద్వారా చర్చల్లోకి వచ్చాయి. 2014 తర్వాత మొదటిసారిగా పౌర సమాజంలోని ఒక వర్గం ఇంత స్పష్టంగా, బలంగా అధికార వ్యవస్థను సవాలు చేయడం విశేషం. ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ కదిలించలేని రీతిలో జంతర్ మంతర్‌కు యువత తరలడం బీజేపీపై వ్యతిరేకతకు స్వాభావిక నిదర్శనం. రాజకీయ ప్రతిపక్షం అనేక సందర్భాల్లో తన బాధ్యతను సమర్థంగా నిర్వహించలేకపోవడం కొట్టినట్టు కనిపిస్తున్నది. ఇప్పుడా బాధ్యతను యువత, పౌర సమాజం తీసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నది. ఇది ప్రజాస్వామ్య ఆరోగ్యానికి ఒక సానుకూల సంకేతం కావచ్చు.
సందట్లో సడేమియా అన్నట్టు విద్యార్థుల ఆందోళనపై కాంగ్రెస్ మొసలి కన్నీరు రాజకీయాలు చేస్తుండటం విడ్డూరం. ఢిల్లీలో ఆందోళన వేదిక వద్దకు వెళ్లి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విద్యార్థులపై ప్రేమ ఒలకపోయడం సరే, తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై నోరెత్తరు. ఎన్నికల ముందు తను స్వయంగా వచ్చి గుప్పించిన ఉద్యోగ హామీల గురించి అడిగితే యువతపై లాఠీలు నాట్యమాడటం ఆయనకు తెలియదా? సెంట్రల్ యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయడానికి బుల్డోజర్లను ఉరికిస్తే ప్రతిఘటించిన విద్యార్థులపైకి పోలీసులను ఉసిగొల్పడం తన దాకా రాలేదా? లేక ఎప్పటికప్పుడు మూటలు అందితే చాలు, పాలన మంచిచెడ్డలు మనకెందుకు అనుకున్నారా? ఎదుటివాళ్లకు చెప్పేటందుకే నీతులు ఉన్నాయనేది కాంగ్రెస్ విధానమా? దమననీతి విషయంలో జాతీయ పార్టీలుగా చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని ప్రజలు గుర్తించారు. కేంద్రంలోని పాలకులకు ఢిల్లీ ఆందోళన ఒక హెచ్చరిక, ఒక అవకాశం కూడా. పాలనలో పారదర్శకతను పెంచడం, విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం, ఉద్యోగ అవకాశాలను విస్తరించడం, ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టడం తప్పనిసరి. లేనిపక్షంలో, ఈరోజు కనిపిస్తున్న అసంతృప్తి రేపు మరింత విస్తృతంగా, మరింత తీవ్రంగా వ్యక్తమయ్యే ప్రమాదం ఉన్నది.