తెలంగాణ భాష అంటే మాట్లాడే పదాల సమాహారం కాదు. అదో జీవితం, అదో ఉనికి, అదొక జాతి గర్వబోతు గొంతుస్వరం. కానీ, ఈ గొంతు శతాబ్దాలుగా నొక్కబడింది. తెలంగాణ భాషను హేళన చేసిన కుట్రలు బ్రిటిష్ పాలన నుంచి, నిజాం నవాబుల కాలం దాకా, ఆ తర్వాత ఆంధ్ర పాలకుల చేతిలోనూ కొనసాగింది. ఈ భాషను ‘వికృతమైనది’, ‘తౌరక్యాంధ్రం’, ‘అర టమాటలు’ అంటూ చిన్నచూపు చూశారు. కానీ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తిరగబడి చేసిన ఉద్యమమే ఈ భాషకు తిరిగి గౌరవాన్ని తీసుకువచ్చింది.
భాషపై దాడుల చరిత్ర: 18వ శతాబ్దం నాటి బహమనీ, నిజాం నవాబుల పాలనలో అధికారిక భాషలుగా దక్కనీ ఉర్దూ, అరబ్, పారసీ భాషలు బలవంతంగా ప్రవేశపెట్టబడినాయి. దాంతో తెలుగు పరిపాలనలోకి ప్రవేశించలేక ప్రజల భాష తెలంగాణ మూలన పడిపోయింది. ఆ తర్వాత అధికారులుగా ఆంధ్రా ముల్కీలు రావడం, 1956లో ఏకీకృత ఏపీ ఏర్పాటుతో తెలంగాణ భాష మళ్లీఅధికారం కోల్పోయింది. తెలంగాణ మాట మాట్లాడితే చదువుల్లో వెక్కిరింపు, ఉద్యోగాల్లో వెనుకంజ అనే దుస్థితి నెలకొన్నది. ప్రభుత్వ పాఠశాలల నుంచి స్కాలర్షిప్ ఇంటర్వ్యూల వరకూ నీ మాటలతో నీ స్థాయి తెలుస్తోందనే అప్రతిష్ట మాటలు చెవుల్లో మోగాయి.
పోరాట భాష ఉద్యమ శబ్దం: తెలంగాణ భాష ఉద్యమ భాషగా మారింది. ఆ ఉద్యమానికి జ్ఞానబీజాలు నాటినవారు కవులు, రచయితలు, కళాకారులు. పోతన తన భాగవతాన్ని ‘తెలుగు మాట చక్కగా రాస్తా’నని ప్రకటించగా, దాశరథి కృష్ణమాచార్యులు ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అంటూ తెలంగాణ గర్వాన్ని ఆలపించారు. నందిని సిధారెడ్డి తెలంగాణ భాషపై ‘నన్ను కన్న తల్లి కన్న కంట చూసినవాణ్ణి’ అంటూ ఈ భాషకు రక్తాన్ని చిందించారు. రచయితల్లో పరశురాం, రజినీ, రాపాక వర్మ, బత్తిని సత్యనారాయణ, వారాల ఆనంద్, కల్లూరి భాస్కర్, అల్లాదురై సుందర్, సీదిరి శేఖర్ లాంటి వారు తెలంగాణ భాషలో కథలు, నవలలు రచించి ప్రజల జీవితాన్ని ప్రతిబింబించారు.
తెలంగాణ భాషపై కేసీఆర్ స్పృహ: తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ తెలంగాణ భాషను ప్రభుత్వ వేదికల మీద గౌరవంతో వినిపించేలా చేశారు. సిద్దిపేట సభలో ఆయన ‘ఒక్కసారి’ తెలంగాణ మాట మాట్లాడమంటే కాళ్ల కింద నేల పోయిందన్నట్టుగా తడుముకున్న రోజులున్నాయి. కానీ, ఇకపై మన మాటే మన ప్రభుత్వం మాట.’ అని చెప్పారు.
తెలంగాణ భాషను పాఠ్యాంశాల్లోకి తీసుకురావడంలో చేసిన కృషి: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల పాఠ్యాంశాల్లో తెలంగాణ ప్రాచుర్యం పొందిన పదాలు, కథలు చేర్చబడినాయి. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వర్గీకృత తెలంగాణ భాషా నిఘంటువులు వెలువడుతున్నాయి. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ భాషా, సాహిత్యంపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి.
భాషకు ఎప్పుడు గౌరవం లభిస్తుందంటే..: తెలంగాణ భాషా గౌరవం అనేది పుస్తకాల్లో రాసే విషయమే కాదు. ప్రతి తల్లి తన పిల్లలతో మాట్లాడే భాషలో, ప్రతి ఉపాధ్యాయుడు బోధించే వాక్యంలో, ప్రతి ఉద్యోగి తన కార్యాలయంలో వాడే పదాల్లో భాషా గౌరవం ఉండాలి.
తెలంగాణ భాషకు నిజమైన గౌరవం లభించాలంటే..: ప్రభుత్వ విధి విధానాల్లో పదాలు మార్చాలి. విద్యారంగంలో తెలంగాణ పదాలు చేర్చాలి. ప్రతీ పత్రిక, ఛానల్ తెలంగాణ పలుకుబడిని గౌరవించాలి. భవిష్యత్తు తరాలకు ఈ భాష గర్వంగా నేర్పాలి. తెలంగాణ భాష గౌరవాన్ని పొందినప్పుడే నిజమైన తెలంగాణ స్వాతంత్య్రం సిద్ధించిందని చెప్పగలం.
– కె.కృష్ణమూర్తి 97051 96097