దివ్యాంగులకు అందరికంటే ఎక్కువ పింఛన్‌తోపాటు అత్యధికంగా సంక్షేమాన్ని అందించిన రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ నిలవడం గర్వకారణం. ఈ ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. 2014కు ముందు ఉమ్మడి ఏపీలో వృద్ధులు, వితంతువుల పింఛన్ రూ.200 కాగా, దివ్యాంగుల పింఛన్ రూ.500 మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో ఆసరా పేరిట దివ్యాంగుల ఫించన్‌ను ఏకంగా రూ.1,500కు పెంచారు. 2019 జూన్‌లో దానిని రూ.3,016కు, 2023 జూలైలో రూ.4,016కు పెంచారు. దేశంలో ఏపీ మినహా అన్ని రాష్ర్టాల్లో దివ్యాంగులకు గరిష్ఠంగా అందుతున్న ఫించన్ రూ.1,500 నుంచి రూ.2 వేలు మాత్రమే. ఒక్క తెలంగాణలోనే కేసీఆర్ పుణ్యమాని దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ అందుతున్నది. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ హయాంలో ఆసరా పథకం కింద అభాగ్యులకు ఇచ్చిన ఫించన్లు రూ.58 వేల కోట్లు. అందులో ఒక్క దివ్యాంగ సమాజానికి ఇచ్చిన పింఛన్ మొత్తం రూ.10 వేల కోట్ల పైమాటే.
కేసీఆర్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని మైలురాళ్లుగా నిలిచిపోయాయి. దివ్యాంగుల ఫించన్‌ను రూ.500 నుంచి రూ.4,016కు పెంచడమే కాదు, దివ్యాంగులకు అప్పటివరకు అమలవుతున్న 3 శాతం రిజర్వేషన్లను 4 శాతానికి పెంచిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణే. అభాగ్యులు, అసహాయుల పట్ల కేసీఆర్‌కు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం. గ్రూప్-1, గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్లను అమలుచేశారు. దివ్యాంగులకు వయోపరిమితిలో పదేండ్ల సడలింపు కూడా ఇచ్చారు. అంతేకాదు, వసతి గృహాల్లో భోజనం, ఉచిత వసతి కల్పించడమే కాదు, బ్రెయిలీ లిపి, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ లాంటి వాటిపై ప్రత్యేక శిక్షణ అందించారు. దివ్యాంగుల హక్కుల చట్టం-2016 అమల్లో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రతి జిల్లాలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, అవసరమైన వారికి కృత్రిమ అవయవాలు, వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, హియరింగ్ ఎయిడ్స్, బ్రెయిలీ కిట్స్ వంటివి ఉచితంగా అందజేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక కమిషన్‌తోపాటు రాష్ట్ర స్థాయి అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేశారు. అక్కడ దివ్యాంగుల కోసం ర్యాంపులు, ప్రత్యేక మరుగుదొడ్లు, వీల్‌చైర్ రోడ్లు నిర్మించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ ఈ దిశగా చర్యలు తీసుకున్నారు. కేసీఆర్ సర్కార్ చొరవను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం విశేషం. 20142023 మధ్య కేసీఆర్ పాలనలో దివ్యాంగుల సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచింది. ఆర్థిక సహాయం నుంచి విద్య, ఉద్యోగం, గౌరవప్రదమైన జీవనం వరకు- ప్రతి రంగంలోనూ దివ్యాంగులను ఆదరించే, సాధికారత కల్పించే విధానాలను కేసీఆర్ అమలు చేశారు. ఈ కారణంగానే దివ్యాంగుల స్వర్గధామం తెలంగాణ అనే మాట సార్థకమైంది. కేసీఆర్ పాలనలో దివ్యాంగులు పొందిన గౌరవం, ఆర్థిక భద్రత, సామాజిక గుర్తింపు రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో తిరోగమించింది.
అధికారంలోకి రావడానికి దివ్యాంగుల ఫించన్‌ను రూ.6 వేలకు; వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల ఫించన్‌ను రూ.4 వేలకు పెంచుతామని, ప్రభుత్వ ఉద్యోగులు సహా ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఫించన్ ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ, రెండేండ్లయినా ఆ హామీలను అమలు చేయడం లేదు. అధికారం కోసం కోతలు కోసిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఫించన్లను పెంచకపోగా ఉన్నవాటికి కోత కోస్తున్నది. అందాల పోటీలకు, అబద్ధాల ప్రచారాలకు రూ.వందల కోట్లు కుమ్మరిస్తున్న ప్రభుత్వానికి దివ్యాంగులకు చేయూతనివ్వడానికి మాత్రం మనసు రావడం లేదు. అప్పుల పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తూ అభాగ్యులను తిప్పలు పెడుతున్నది. కాంగ్రెస్ సర్కార్‌కు కాంట్రాక్టర్ల మీద, కమీషన్ల మీద ఉన్న ప్రేమలో ఇసుమంతైనా దివ్యాంగులపై ఉంటే బాగుండేది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2023 డిసెంబర్ నుంచే పింఛన్లను పెంచుతామని నాడు రేవంత్‌రెడ్డి కోతలు కోశారు. ‘ఇప్పుడు ఫించన్ తీసుకుంటే రూ.2 వేలే, రూ.4 వేలే. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటే రూ.4 వేలు, రూ.6 వేలు’ అని గప్పాలు కొట్టారు. కానీ, ఇప్పటి వరకు పింఛన్లు పెంచకుండా మొఖం చాటేశారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆసరా పింఛన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.14,628.91 కోట్లు కేటాయించింది. 2025 మార్చి నాటికి అందులో రూ.10,514.32 మాత్రమే ఖర్చు చేసింది. రూ.4,114.59 కోట్ల నిధులను ఖర్చు చేయకపోవడం గమనార్హం. 2024 అక్టోబర్ నాటికి 11 రకాలు కలిసి 44,49,767 మందికి ఆసరా పింఛన్లు అందుతుండగా, నేడు 42,51,331 మందికే పింఛన్లు వస్తున్నాయి. నాడు 5,14,422 మంది దివ్యాంగులకు పింఛన్లు వస్తుండగా, నేడు 4,90,044 మందికి మాత్రమే పింఛన్లు వస్తుండటం శోచనీయం. పింఛన్ లబ్ధిదారుల్లోనూ కోత విధించిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుంది. అధికారం కోసం హామీలిచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత వాటిని విస్మరించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగుల శాఖను స్వతంత్ర శాఖగా ప్రకటించి జీవో నంబర్ 34 ద్వారా ఆదేశాలిచ్చింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవోను అమలు చేయడం లేదు. దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ఉద్దేశించిన ఉత్పత్తి శిక్షణ కేంద్రాలు (టీసీపీసీ) కాంగ్రెస్ పాలనలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్‌తోపాటు, ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 4 శాతం రిజర్వేషన్లు, బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ, వసతి గృహాలకు శాశ్వత భవనాలు, దివ్యాంగులకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ, వాటిలో ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు.
దివ్యాంగులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం వారిని కూడా ఒకే గాటన కట్టి గాలికొదిలేయడం బాధాకరం. దివ్యాంగత్వం అంటే శారీరక సమస్య మాత్రమే కాదు, అదొక నిరంతర ఒంటరితనం. జీవితంలో గెలిచేందుకు వారు నిత్యం ఒక యుద్ధమే చేయాలి. దివ్యాంగులు చీకట్లో వెలిగే కాంతిదీపాలు. అందుకే వారికి చేయూతనివ్వాలి. గౌరవంతో పాటు అవకాశాలు కల్పించాలి. వారి కలలకు రెక్కలు తొడగాలి. ఈ నేపథ్యంలో పింఛన్‌ను రూ.6 వేలకు పెంచడంతోపాటు దివ్యాంగులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా.