ఇవ్వాళ ‘నగరం’
స్తిరాస్థికి చిరునామా
పిడికెడు తడి మట్టీ
చిటికెడు లేత చిగురూ
మెత్తటి ఆత్మా లేని
నగరానికి
అన్నివైపులా తలుపులు తెరిచే వుంటాయి
వ్యాకోచానికీ విస్తరణకూ పరిమితుల్లేవు
ఎదగడానికి హద్దుల్లేవు
భూమికీ ఆకాశానికీ నడుమ
ఎగరడానికి పరిమితుల్లేవు
ఇక్కడ శ్వాసకోశాలు బద్దలవుతాయి
అగ్నిగోళాలు తెరుచుకుంటాయి అయినా
ఆకుపచ్చగా అమ్మకాలు కొనసాగుతాయి
జీవవైవిధ్యం స్మశానం బాట పడుతుంది
అన్నీ సరళ రేఖల్లా నిర్మాణాలు
వక్రరేఖల్లా రహదారులూ ఆలోచనలూ
అయినా నగరం చాలా
అందంగా కనిపిస్తుంది
ఎంతో సవ్యంగా వుందనిపిస్తుంది
నిజానికి వర్తమాన నగరమూ
ఇవ్వాల్టి స్వార్థంతో నిండిన మనిషీ ఒకటే
నగరంలో మనిషున్నాడు
మనిషిలో నగరముంది
ఇప్పుడు మనిషికి
చిరునామా నగరమే
కానీ, నగరమేమో
కన్నీటి చుక్కయినా ఇంకని ఎడారి
శుభ్రమయిన గాలయినా
తిరుగని శూన్య నిశీధి
కనీస ప్రేమయినా దొరకని
అరుదయిన ఎండమావి
(హైదరాబాద్లో కంచ గచ్చిబౌలిలో వందల ఎకరాల భూమి వేలానికి పెట్టిన విషయం తెలిసిన వేదనతో…)
– వారాల ఆనంద్