కాకా ! నడినెత్తిన సూర్యున్ని ఎత్తుకొని
ఎండలవడి కొలిచినట్లే 
కోసుకోసు దూరం నడిచినట్లున్నవు
పేగులొర్రిన నీ ఆకలి బాధ 
నీ ముఖంలా గావర గావరగా కనిపిస్తున్నది
అసలేమన్నా తిన్నవా ? తినలే ! తిందురా!
అగో ! కమ్మగ 
బియ్యముడికిన అన్నం ఆసన
కడప దాటి అస్తున్నది
బడుకల కూసుందురాయే 
పచ్చటి మోతుకాకు ఇస్తర్ల 
ఉడుకుడుకు బువ్వేసుకోని
కొత్త మామిడి తొక్కుతో 
అన్నం కలుపుకోని 
లొట్కలేసుకుంటూ తిందురా కాకా !
చూసేటోల్లకు నోరూరి 
కడుపుల ఆకలి లెవ్వాలే
నువ్వు పరదేశివైనా
మా పల్లెకొస్తే మా ఊరోడివే
ఆధార్ కార్డు ఎందుకు !
పరిచయ పత్రం ఎందుకు !
తినే కాడ అందరం ఒక్కటే
మా తెలంగాణ ఊర్లల్ల
పంటలకేం తక్కువ లేదు
చెరువులు నిండి మత్తడిని ఎత్తుకుంటున్నై
కడుపు నిండా తిను
తియ్యటి భగీరథ నీళ్లు దాగు
కందాళై 
రాఘవాచార్య 
87905 93638