ఇచట పూచిన పూలకొమ్మ యశోదమ్మ!
పాలమూరు జిల్లా నడిగడ్డ బిజినేపల్లి గ్రామంలో కత్తి కాశిరెడ్డి-సరస్వతమ్మలకు 1929 ఆగస్టు 8న పాకాల యశోదారెడ్డి జన్మించారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు నిషేధం.
పాలమూరు జిల్లా నడిగడ్డ బిజినేపల్లి గ్రామంలో కత్తి కాశిరెడ్డి-సరస్వతమ్మలకు 1929 ఆగస్టు 8న పాకాల యశోదారెడ్డి జన్మించారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు నిషేధం. స్త్రీలకు ఘోషా పద్ధతి ఉండేది. ఉన్న చదువులు ఉర్దూ భాషా మాధ్యమంలోనే. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి ఒకసారి బిజినేపల్లి గ్రామంలోని పాఠశాలలో యశోదమ్మ తెలివితేటలను చూసి హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఉన్న వసతిగృహంలో చేర్పించారు. ఆ రోజుల్లో మాడపాటి హనుమంతరావు స్థాపించిన బాలికల పాఠశాలలో మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుకునే వీలుండేది. హైదరాబాద్‌లో మెట్రిక్ పరీక్ష రాసే అవకాశం లేదు. విజయవాడలో మెట్రిక్ పరీక్ష రాసేందుకు ప్రత్యేక అనుమతిని తీసుకున్న మాడపాటి.. యశోదారెడ్డి, లక్ష్మీ, వసుమతీరెడ్డి, భారతీ రత్నాకారాంబలను అక్కడ పరీక్ష రాసేందుకు పంపించారు. ఈ నలుగురు మెట్రిక్ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన మొదటి బ్యాచ్.
యశోదారెడ్డి మెట్రిక్ తర్వాత ఏ.సీ.కళాశాల, గుంటూరులో ఇంట ర్మీడియెట్ మొదటి సంవత్సరం, హైదరాబాద్ ఉమెన్స్ కళాశాలలో రెండవ సంవత్సరం చదివారు. ఒక ఉపన్యాస పోటీలో యశోదారెడ్డి ఉపన్యాస ధాటికి మెచ్చుకున్న చిత్రకారుడు పాకాల తిరుమలరెడ్డి ఆమెను 1947లో వివాహం చేసుకున్నారు.
సహచరుడు పీటీ రెడ్డి ప్రోద్బలంతో ఆమె డిగ్రీ ప్రైవేట్‌గా చదివా రు. 1957లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. తెలుగులో ప్రథమ శ్రేణి పొందారు. ఎంఏ సంస్కృతంలోనూ డిగ్రీ తీసుకున్నారు. 1961లో జర్మనీ భాషలో డిప్లొమా తీసుకున్నారు. ఇంకా భాషా శాస్త్రంలో, జానపద విజ్ఞానంలో సర్టిఫికెట్ కోర్సులు చేశారు.
యశోదారెడ్డి కోఠి ఉమెన్స్ కాలేజీలో ఉపన్యాసకురాలిగా చేరి, క్రమంగా ఓయూలో తెలుగుశాఖలో ఆచార్య పదవిలో పదవీ విరమణ చేశారు. తర్వాత 1990-93 వరకు తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా సేవలందించారు. తెలంగాణ నుంచి ఈ పదవిని చేపట్టి పూర్తికాలం సేవలందించిన ఏకైక మహిళ యశోదారెడ్డి. కథా రచయిత్రిగా, తెలంగాణ మాండలిక భాషోద్యమ కార్యకర్తగా, విమర్శకురాలిగా ఆమె అనేక గ్రంథాలు రచించించారు. తెలుగు భాషపై పట్టు సాధించి తన పరిశోధనల ద్వారా విశిష్ట సాహితీవేత్తగా తనదైన ముద్ర వేశారు. భాషా ప్రేమికురాలిగా తెలుగు, తెనుగు, ఆంధ్ర, తెలంగాణ భాషోత్పత్తులను పరిశీలించి ‘ఆంధ్ర సాహిత్య వికాసము’ అనే గ్రంథంలో పొందుపరిచారు.
భాషపై ఆమెకు ఎంతో మక్కువ. ‘అసలైన తెలుగు భాషా రుచిని ఆస్వాదించాలంటే తెలంగాణ తెలుగును, చదవండి, వినండి, గ్రహించండి. ఆ భాషపై సరైన అవగాహన, పట్టులేని వారి మాట విని అది శిష్ట వ్యవహార యోగ్యం కాని అనాగరికుల భాషంటూ అవమానించడం, అవహేళన చేయడం గొప్ప కాదు, తప్పు’ అనేది ఆమె అభిప్రాయం.
తెలుగు భాషకు ముఖ్యంగా తెలంగాణ భాషకు ఏర్పడనున్న ప్రమాదాన్ని 1960-70ల్లో పసిగట్టి.. వలస సంస్కృతి నుంచి వేరై యశోదమ్మ ‘ఎచ్చమ్మ’గా మారిపోయారు. మాతృభాషను బతికించుకొని, గర్వంగా నిలబెట్టుకునే జాతి పౌరుషం ఆమెది. ఆమె కలం నిండా కమ్మని జున్ను పాలలాంటి తెలుగు పదబంధాలు, జాతీయా లు, నుడికారాలు, పలుకుబడులు, సామెతలుంటాయి. వీటన్నింటితో కథల రాశులు, ముచ్చట్ల పందిళ్ల కింద సాహిత్య సాంస్కృతిక విభావరులు నిర్వహించారు.
1950-60 దశకాల్లో యశోదమ్మ ‘దక్కన్ రేడియో’లో తన ఊరి ముచ్చట్లనే ‘మహాలక్ష్మి ముచ్చట్లు’గా వినిపించి శ్రోతలను అలరించారు. ఆ ముచ్చట్లను 1973లో ‘మా ఊరి ముచ్చట్లు’గా ప్రచురించారు. నాచన, సోమన, ఎర్రాప్రెగడ, మొల్ల వంటి ప్రాచీన కవుల కావ్యాలలోని పలుకుబడులను, సామెతలనూ పరిశీలించి ప్రకటించారు. ఆమె జీవిత పర్యంతం సాహితీసృజన చేశారు. 80కి పైగా పరిశోధక వ్యాసాలు, రెండు కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు, 22 విమర్శనా గ్రంథాలు రాశారు. పాఠ్య పుస్తకాలు, ఏకాంకికలు, గల్పికలు, అనువాదాలు, పీఠికలు విరివిగా రాశారు. అనేక పుస్తకాలను సమీక్ష చేశారు.
తేనెలద్దిన రొట్టె ముక్కల్ని నోటికందించినట్లుగా మన భాషలోని జాతీయపు అందాలను, మన పల్లె ‘పలుకుబడుల’ను తన జీవనయానంలో హత్తుకొని వాటిని విశిష్ట నిధిగా ముందుతరాలకూ అందించే బాధ్యతను నెత్తిన మోసిన కోయిలమ్మ యశోదారెడ్డి.
తాను తలపెట్టిన పనులు పూర్తికాకుండానే 2007 అక్టోబర్ 7న ఆమె అనంతతీరాలకు వెళ్లిపోయారు. తెలంగాణ ఆత్మగౌరవపు కిరీటానికి ప్రత్యేకతనూ, గుర్తింపునూ సుస్థిరం చేసిన సాహిత్య వైతాళికురాలు యశోదారెడ్డికి తెలుగుజాతి నిండు నీరాజనాల నివాళులు.
– అనిశెట్టి రజిత, 98494 82462
(రేపు పాకాల యశోదారెడ్డి 95వ జయంతి)
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

