Chikiri Chikiri | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలతో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. జూన్ 3 రాత్రి తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన స్పెషల్ ప్రీమియర్ షోలతో సినిమా సందడి మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమా సన్నివేశాలు, అభిమానుల స్పందనలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ‘పెద్ది’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘చికిరి చికిరి’ గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. సినిమా విడుదలకు ముందే ‘చికిరి చికిరి’ పాట ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించడమే కాకుండా, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలోనూ టాప్‌లో నిలిచింది.
ఈ పాటకు చిన్నారుల నుంచి యువత వరకు అందరూ స్టెప్పులేస్తూ రీల్స్ క్రియేట్ చేయగా, ‘చికిరి చికిరి’ సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్‌గా మారింది. అయితే సినిమా ప్రీమియర్ షోలను వీక్షించిన ప్రేక్షకులు ఒక విషయాన్ని వెంటనే గమనించారు. పాట ఆడియో వెర్షన్లో ఉన్న కొన్ని లిరిక్స్‌ను సినిమా వెర్షన్లో మార్చినట్లు తెలుస్తోంది. మొదట విడుదలైన పాటలో “పడతా పడతా పడతా.. ఎనుకే ఎనుకే పడతా.. సరుకు సామాన్లు సూసి మీసం లేసి ఏసే కేక.. చికిరి చికిరి” అనే పదాలు వినిపించాయి. కానీ థియేటర్లలో ప్రదర్శితమైన సినిమా వెర్షన్లో “సరుకు సామాన్లు” అనే పదాలను తొలగించి, వాటి స్థానంలో “సొగసు సింగారం” అనే పదాలను ఉపయోగించినట్లు అభిమానులు చెబుతున్నారు.
గత కొంతకాలంగా ‘సామాన్లు’ అనే పదంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. ముఖ్యంగా నటుడు శివాజి ఒక కార్యక్రమంలో మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యానిస్తూ చేసిన పదప్రయోగం వివాదానికి దారితీసింది. ఆ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం శివాజీ క్షమాపణలు కూడా చెప్పారు.అదే సమయంలో ‘చికిరి చికిరి’ పాటలోని “సరుకు సామాన్లు” లిరిక్స్‌పై కూడా కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. మహిళలను కించపరిచే విధంగా ఆ పదాలు ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే అప్పట్లో చిత్ర బృందం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సినిమా విడుదల తర్వాత ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు మేకర్స్ ముందస్తు జాగ్రత్తగా లిరిక్స్ మార్చి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, థియేటర్లలో వినిపిస్తున్న కొత్త వెర్షన్ ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు ‘చికిరి చికిరి’ పాటలో రామ్ చరణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.