హైదరాబాద్ : దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లోగల ఓ రెస్టారెంట్లో బుధవారం ఉదయం భారీ స్థాయిలో మంటలు చెలరేగి 21 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే..గురుగ్రామ్‌లోని సెక్టార్ 46కు చెందిన వివేక్ అగర్వాల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్ ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తన తండ్రిని పరామర్శించడానికి ఢిల్లీకి వచ్చారు. అతనితో పాటు అతని భార్య తర్జనీ అగర్వాల్, ఇద్దరు కుమార్తెలు జివిషా, వర్య మరో నలుగురు బంధువులు కూడా వచ్చారు.
అగ్నిప్రమాదం జరిగిన ఫ్లోరిష్ స్టే బెడ్-అండ్-బ్రేక్‌ఫాస్ట్‌లోనే వివేక్ రెండు గదులను బుక్ చేసుకున్నారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఆ బృందం హోటల్ రెస్టారెంట్లో అల్పాహారం తీసుకుంటోంది. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది మరణించారు. వివేక్ కుటుంబంలో ప్రాణాలతో మిగిలిన ఏకైక వ్యక్తి వివేక్ అగర్వాల్ తండ్రి రాధే శ్యామ్ అగర్వాల్(80). కుటుంబంలోని ఎనిమిది మంది మరణించడంతో గురుగ్రామ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, డీఎన్ఏ టెస్టుల అనంతరం బంధువులకు మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు తెలిపారు.
కాగా, దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లోగల ఓ రెస్టారెంట్లో బుధవారం ఉదయం భారీ స్థాయిలో మంటలు చెలరేగి 21 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఒకే ప్రవేశ, నిష్క్రమణ మార్గమున్న ఫ్లరిష్ బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. ప్రమాదం నుంచి పలువురిని కాపాడినప్పటికీ మరికొందరు మంటల్లో చిక్కుకుని ఉంటారని తెలుస్తున్నది. స్థానికులు రోడ్డుపై పరుపులు పరచడంతో భవనంలోని మూడవ అంతస్తులో చిక్కుకున్న పలువురు వ్యక్తులు పైనుంచి కిందికి దూకారు.
ఓ మహిళ తన చంటిబిడ్డను పట్టుకుని 3వ అంతస్తు నుంచి కిందకు దూకగా ఆమెకు కాలు విరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డీఎఫ్ఎస్తోపాటు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది, పోలీసులు, అంబులెన్సు సర్వీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. హోటల్లో బస చేసిన విదేశీయులు సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా నుంచి చికిత్స కోసం వచ్చినట్లు అధికారులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పథకం కింద ఈ హోటల్ నడుస్తున్నది.