నేను వరిచేన్లల్ల పండినవాణ్ణి
పొలాల గట్టుమీద పెరిగినవాణ్ణి
పంట పసలమీద, తిండిగింజలమీద
తినేవాళ్ళ పేర్లు రాసిన వాణ్ణి
మంచెమీద నిలబడి వడిసెల విసిరి
చేన్లు కాపుకాచినవాణ్ణి
ఈ తిండిదొంగల్ని పారకొట్టలేకపోతున్నా
రైతురెక్కల్ని విరుస్తున్న అంగట్లబరువు
తొయ్యలేకపోతున్నా
పచ్చదనాల కలల్ని దోపిడిదార్లనుంచి
దాచుకోలేకపోతున్నా
నాకు పొలం పని బతుకు, పొలం పనే సంస్కృతి
నేను.. పొలం ఒక్కటే, మట్టిలో మట్టయినవాణ్ణి
నేనెక్కడైనా పచ్చగా మొలకెత్తుత
అది వీరోచిత పోరాటంలోనైనా
వీధుల్లో ఊరేగింపుగా నైనా
పొలాల జైత్రయాత్ర నాది
హలాల యుద్ధకవాతు నాది
గింజ గింజలో నా ఊపిరులూది
ధాన్యం పండించినవాణ్ణి
నా కణం కణంలో ప్రాణాలు నింపి
చేస్తున్న పోరాటమిది
నేను మరణించినా మళ్ళీ పంటమొక్కనై లేస్తా
మళ్ళీ నీకు తిండి నేనే పెడ్తా…
నన్ను చూడు
నీ ఆకలి తీర్చినవాణ్ణి
నన్ను చావులోకి తోస్తున్నవాడా, ఖబర్దార్
బరాబరిగ నేనే గెలుస్తున్నా
ఈ దేశం జెండాను నేను
ఈ ప్రజల ఆకుపచ్చటి ఉదయాన్ని నేను
ఈ వీరుల యుద్ధకవచాన్నీ నేనే
మట్టిమీద ఒట్టు
నీ అంగల్లన్నీ మట్టికొట్టుకపోతయ్
హరగోపాల్, శ్రీరామోజు
99494 98698