వెచ్చగా పొదువుకునే చిరుచలి
టేబుల్ మీద మగ్గులో
పొగలు కక్కే కాఫీ ఎంజాయ్ చేస్తూ సూర్యుడు
తెల్లని మబ్బుల నిండా
పొగమంచు నిండా
ఆకురాలు కాలం నిండా
ఫిల్టర్ కాఫీ పరిమళం
నానా రంగులూ పూసుకున్న అడవికి కొత్త పూనకం
అడవిలోంచో ఆకాశంలోంచో తెలీదు
మేలిమి ఛాయ మబ్బులతో
ఆమె సూరీడి కళ్లు మూసి
ముసిముసిగా నవ్వుతూ
ఎవరో చెప్పుకోమంటుంది
పేరు చెప్పలేని సూర్యుడు తడబడుతూ
ఆమె సొట్టబుగ్గలు తడిమి పకపకా నవ్వుతాడు
ఆమె తెల్లని టీ షర్టు మీద పండుటాకుల గల గల
ఆమె పరిమళం చుట్టూ ఉన్మత్తంగా
గింగిరాలు కొట్టే సీతాకోకల మిలమిల
స్కై బ్లూ డెనిమ్ షార్ట్స్‌లో ఆమె
నీరెండలో ఆడ పులి ఆమె శరీర వర్ణం
నిండా పండుటాకుల పచ్చ బొట్లు
సముద్రం పక్క కొండ దగ్గర
రంగులు దోబూచులాడే
అడవి మలుపు ఆమె నడుం
చుట్టూ వెచ్చగా సూరీడి హస్తం
ఆమె సూరీడి చేయి పట్టుకొని
పర్వతాలను తడుముతుందా
ఇద్దరి చేతుల నిండా ఆకురాలు అడవి రంగులు
ఆమే సూర్యుడూ కీకారణ్యాల్లోని
ఆకుల సందుల్లోంచి నేల మీది రంగుల్లోకి
వెచ్చని బంగారు కాంతులు చాచి
అడవి తలని ప్రేమగా నిమురుతారు
ఆకురాలు శబ్దాలకు బెదిరిన
ఉడతని దగ్గరికి తీసుకొని ముద్దు చేస్తారు
తన కుచ్చుతోక మెత్తటి కుంచె
ఫాల్ కలర్స్‌లో ముంచిన ఉడత
ఆమె ముఖానికి మేకప్పు టచ్చింగులిస్తుంది
సూరీడి బంగారు మీసాలకి
అక్కడక్కడ ఆరెంజి పులుముతుంది
మీసం వంపు మీద నిమ్మపండు నిలబెట్టి
కెవ్వు కేకంటూ చప్పట్లు చరిచి కేరింతలు కొడుతుంది
ఆమే సూర్యుడూ ముఖ ముఖాలు చూసుకొని
పగలబడి నవ్వుతుండగా
సప్తవర్ణాల గలగలల్లోకి దూకి
మాయమైపోతుంది క్రేజీ ఉడత
– వసీరా 9177727076