భారవి : ‘పురా కవీనాం గణనా ప్రసంగే / కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసః’ క్రీ.శ. 5వ శతాబ్దంలో కవీ, మహాకవీ కాళిదాసు ఒక్కడే. అనంతరం కాలంలో కవి భారవి – ‘కిరాతార్జునీయం’ అనే మహాకావ్యం రాసి మహాకవిగా పరిగణింపబడినాడు. ‘ఉపమా కాళిదాసస్య భారవే రర్థగౌరవమ్’ అనే శ్లోకపంక్తిని బట్టి ఉపమాలంకార ప్రయోగంలో కాళిదాసూ, అర్థగౌరవంలో భారవీ సాటిలేని సుప్రసిద్ధులనీ అర్థం. అర్థవంతమైన కొద్ది పదాలతోనే గొప్ప భావాన్ని ప్రకటించడం ‘అర్థ గౌరవం’!
భారవి-ప్రాంతం: భారవికి ముని మనుమడైన కవి దండి రచించిన ‘అవంతీ సుందరి’ కథ ద్వారా కవి భారవి బ్రాహ్మణుడనీ, కౌశిక గోత్రీకుడనీ, కాంచీపుర ప్రాంత ‘అచలపురం’ నివాసి అనీ, పండిత నారాయణస్వామి పుత్రుడనీ తెలుస్తున్నది.
భారవి కాలం: క్రీ.శ.634లో రాజు రెండవ పులకేశి ‘ఐహోళె’ (కర్ణాటక)లోని మేగుటి జైన దేవాలయం దగ్గర ప్రాచీన కన్నడ లిపిలో వేయించిన సంస్కృత శాసనంలో – ఆ శాసన రచయిత, కవి రవికీర్తి తాను కవితా నైపుణిలో, కీర్తిలో కాళిదాసూ, భారవిలతో సమానుడననీ చెప్పుకున్నాడు. పశ్చిమ గంగవంశరాజు దుర్వినీతుడి ఆస్థానంలోనూ, పల్లవరాజు సింహవిష్ణు (క్రీ.శ. 556-590) ఆస్థానంలోనూ భారవి ఉండేవాడనీ చారిత్రికాధారాలు చెప్తున్నాయి. కనుక పైన ఉదాహరించిన శాసనాది ఆధారాలతో కవి భారవి క్రీ.శ.6వ శతాబ్దం వాడని చెప్పవచ్చు.
కౌమారంలోనే అర్థగౌరవ కవితాగరిమ: భారవి కౌమార దశ నుంచే అర్థవంత శ్లోకాలు రాస్తూ పండిత ప్రశంసలు పొందుతుండేవాడు. భారవి తండ్రి మాత్రం చిన్నవాడైన తన కొడుకు రాసే కవిత్వం మెచ్చుకోదగినది కాదనీ పండితులకు చెప్పడంతో తండ్రిపై భారవి కోపం పెంచుకొని బండరాయితో మోదాలనుకుంటాడు. అయితే చిన్ననాడే మెచ్చుకుంటే గర్వం పెరిగి, కవిగా పెరగడం ఆగిపోతుందనీ మెచ్చుకోవడం లేదనే తండ్రి మనసులోని మాటను తెలుసుకొని భారవి-తండ్రి పాదాలపై పడి క్షమించమనీ, తన తప్పుకూ శిక్ష విధించమంటాడు. అప్పుడు తండ్రి-భారవిని అత్తవారింట ఆరు నెలలు గడిపి రమ్మనీ, అదే శిక్ష అంటాడు. భారవి భార్యతో అత్తవారి ఊరికి పయనమవుతాడు.
భారవికి – అత్తవారింట మొదటి నెలవరకూ రాచమర్యాదలందుతాయి. ఆ తర్వాతే పశువులను మేపుకు రావడం, ఆ పశువుల పాకను శుభ్రం చేయడం వంటి చిన్న పనులు చేయమనీ ఆజ్ఞాపింపులు మొదలవుతాయి. భార్య చినిగిన వస్ర్తాలతో ఉండటం చూడలేక భారవి ఒక తాటాకుపై శ్లోకం వ్రాసి, ఆ ఊరి షావుకారుకు చూపించి కావలసినవి కొని తెచ్చుకొమ్మంటాడు. షావుకారు శ్లోకం చదివి, ఆమెకు ధనమిచ్చి పంపిస్తాడు. ఎదురుగ ఎపుడూ ఆ శ్లోకం కనిపించేట్లు ఇంటి గోడకు తగిలిస్తాడు. కొద్దిరోజులకు అయిదేళ్ళ కొడుకు బాధ్యతను భార్యకప్పగించి ఆ షావుకారు వ్యాపార నిమిత్తం దేశాంతరం వెళతాడు. పదేళ్ళ తర్వాత స్వదేశానికి ప్రయాణమై అర్ధరాత్రి ఇల్లు చేరుకుంటాడు. లోపల యువకుడు పడుకొని ఉండటం చూసి, భార్య శీలాన్ని శంకించి, శిక్షించడానికి తొందరపడి ముందుకుపోబోతాడు. గోడపైన శ్లోకాన్ని చూసి ఆగిపోయి నిదానపడి భార్యను నిద్రలేపి, ఆ యువకుడు కొడుకని తెలుసుకొని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. శ్లోకంతో తన కుటుంబాన్ని కాపాడిన కవి భారవిని మరునాడు తమ ఊరికి రప్పించి, ధనకనకాదులతో ఘన సన్మానం చేసి పంపిస్తాడు.
ఆ షావుకారు కుటుంబాన్ని కాపాడిన, భారవి అర్థగౌరవ శ్లోకం ఇది – ‘సహసా విదధీతన క్రియా మవివేకః పరమాపదామ్ పదమ్/ వృణతే హి విమృశ్య కారిణం గుణాలుబ్ధాః స్వయమేవవ సంపదః’- ఆలోచన లేకుండా తొందరపడి ఏ పనీ చేయరాదు. అది అనేక ఆపదలకు కారణమవుతుంది. వివేక కార్యశీలురనే సంపదలు తామే వచ్చి చేరుతాయి అని అర్థం. (ఈ శ్లోకం ‘కిరాతార్జునీయం’ రెండవ సర్గలో 30వ శ్లోకంగా కనిపిస్తుంది)
మహాకావ్యం- ‘కిరాతార్జునీయం’: కవి భారవి – రాజాస్థాన కవిగా కుదురుకున్న తర్వాతే ‘కిరాతార్జునీయం’ మహా కావ్యాన్ని ప్రారంభించి ఉంటాడు. ద్వైతవనంలో ద్రౌపదీ సమేతులై వనవాసం చేస్తున్న పాండవుల వద్దకు వ్యాసమహర్షి వచ్చి పాశుపతాస్త్ర సంపాదన ఆవశ్యకతను చెప్పి శివుని గురించి తపస్సు చేసి సంపాదించుకొమ్మని ఉపదేశించి వెళ్ళడం, ధర్మరాజు అనుమతితో అర్జునుడు హిమాలయాలకు వెళ్ళి తపమొనర్చి శివానుగ్రహంతో పాశుపతాస్ర్తాన్ని పొంది తిరిగిరావటం ఇది వ్యాస మహా భారతం వన పర్వంలో ఉన్న చిన్న కథ.
భారవి – ఈ చిన్న కథను తీసుకొని మహాకావ్యోచిత వర్ణనలతో వేయికి పైగా శ్లోకాలతో ‘కిరాతార్జునీయం’ పేరిట 18 సర్గల మహా కావ్యాన్ని బట్టి 1, 2, 3 సర్గలను ఒక భాగంగా చూడవచ్చు. ఇందులో క్షత్రియోచిత ధర్మాలూ, రాజనీతి గురించీ విలువైన శ్లోకాలున్నాయి.
‘శ్రియః కురూణామధిపస్య పాలనీం/ ప్రజాసు వృత్తిం యమయుంత వేదితుమ్’ (1-1) అంటూ వనేచర గుప్తచరుడి మాటతో ఈ కావ్యం ఆరంభమవుతుంది. దుర్యోధనుడిరాజ్య పాలననూ కపట ప్రవర్తననూ తెలుసుకోవడానికి ధర్మరాజు హస్తినకు పంపిన వనేచర గుప్తచరుడు వచ్చి, తాను తెలుసుకున్న సమాచారాన్నంతా నివేదించి వెళ్లిపోతాడు. తర్వాత విచారగ్రస్త ద్రౌపది ధైర్యంగా ధర్మరాజుకు క్షత్రియోచిత ధర్మాలు చెప్తూ శాంతిని వదిలి పరాక్రమంతో శత్రు సంహారం చేయుమంటూ ‘లక్ష్మీస్తాం సమభ్యేతు భూయః’ (1-46) నీవు మళ్ళీ పూర్వ రాజ్యలక్ష్మిని పొందెదవు గాక అని కోరుకుంటుంది. (భారవి ఇందులోని ప్రతి సర్గాంత శ్లోకంలోనూ ‘లక్ష్మి’ పదం వచ్చేలా రచించాడు) తర్వాత భీముడూ శాంత స్వభావుడైన ధర్మరాజుకు క్షత్రియోచిత ధర్మాలు విన్పిస్తూ యుద్ధోన్ముఖుడిగా చేయాలని ప్రయత్నిస్తాడు.
ధర్మాలన్నింటినీ తెలిసిన ధర్మరాజు – యుద్ధానికి సమయం రాలేదనీ ‘సహసా విదధీత న క్రియామ వివేకం…’ (2-30) ఆలోచించకుండా తొందరపడి ఏ పనీ చేయరాదనీ, వివేక కార్యశీలురనే సంపదలు స్వయంగా వచ్చి చేరుతాయనీ ద్రౌపదీ, భీమ సేనులను సమాధానపరుస్తాడు. ఇంతలో వ్యాసమహర్షి వచ్చి, ధర్మరాజుతో పరాక్రమించడంతో రాచ్యప్రాప్తి కలుగుతుందని చెప్పి తపస్సుతో అలౌకిక అస్ర్తాలు సంపాదించమని అర్జునుడికి ఇంద్రమంత్రోపదేశం చేసి, హిమాలయాలకు తొందరగా చేరడానికి సహాయకుడిగా యక్షుడిని నియోగించి ఆ మహర్షి వెళ్లిపోతాడు. అర్జునుడు అన్న ధర్మరాజు అనుజ్ఞతో, భార్య ద్రౌపది ప్రేమాభిరామ నయనయుగళ వీక్షణాన్ని ‘చద్ది’గా గ్రహించి, యక్షుడు మార్గం చూపుతుండగా తపస్సుకై హిమాలయాలకు బయల్దేరుతాడు.
ఇక – 4వ సర్గ నుండి 11వ సర్గ వరకూ మరో భాగంగా చూడాలి. మహా కావ్య వర్ణనలు ఇందులో ఉన్నాయి. భారవి ఊహాశాలిత్వ ప్రతిభ, భావనాశక్తి ఇందులో కనిపిస్తుంది. పచ్చని పంట పొలాలూ, వ్యవసాయదారులున్న ప్రదేశాన్ని చేరుకున్న అర్జునుడికి ‘వినమ్రశాలి ప్రసవౌఘశాలినీ.. ఉపాయనీ భూత శరద్గుణశ్రియః (4-2) హరిత గ్రామ సీమలు శరదృతు సంపదను బహుమతిగా ఇస్తున్నట్టుగా ఉన్నాయని వర్ణిస్తాడు భారవి. ఇట్లా పొలాలూ, పంట కాపు కాంతలూ, ఆలమందలూ, పెరుగు చిలుకుతున్న గొల్ల భామలున్న గ్రామ సీమలనూ, గ్రామోప సీమలను దర్శిస్తూ దాటుతూ సూర్యుడిని కప్పివేసేంత ఎత్తయిన హిమాలయాలకు అర్జునుడు చేరుకుంటాడు. ‘తపన మండల దీపిత మేకతః.. శివమివానుగతం గచ చర్మణౌ’ (5-2) ఒకవైపు సూర్యకాంతిలో ప్రకాశిస్తూ, మరోవైపు రాత్రి చీకటి ఆవరించినట్లు ఉండి గజ చర్మాన్ని ధరించిన శివుని వలె హిమ పర్వతం ఉన్నదని వర్ణించాడు భారవి.
కైలాస పర్వత పరిసరాల వర్ణన చేస్తూ భారవి – ‘ఉత్ఫుల్లస్థలనవినీ.. కనకమయాత పత్ర లక్ష్మీమ్’ (5-39) మిక్కిలిగ వికసించిన స్థల పద్మవనం నుంచి గాలిచే ఎగురగొట్టబడిన పుప్పొడి నింగిలో గుండ్రంగా తిరుగుతూ ఆ ప్రాంతంలో స్వర్ణఛత్ర శోభవలె ఉందనీ అద్భుత భావన చేశాడు. దీనితో ‘ఆత పత్ర భారవి’ పేరునూ పొందాడు.
హిమాలయాల ప్రాంతంలో చంద్రోదయవర్ణన చేస్తూ.. ‘సంవిధాతు మభిషేకముదాసే.. సోత్పలో రజత కుంభః ఇవేందుః’ (9-32) మన్మథాభిషేకం చేయడానికి యామినీ వనిత, ప్రకాశ కిరణ జలాలతో నింపి, పరిమళం కోసం నల్ల కలువను అందులో ఉంచి, పైకెత్తిన వెండి కలశం వలె చంద్రుడు భాసిల్లాడు’ అని చంద్రునిలోని మచ్చను నల్ల కలువతో భారవి మహాద్భుతంగా పోల్చినాడు.
అర్జునుడి తపస్సుకనుకూలమైన ఇంద్రకీలాద్రి చూపి యక్షుడు వెళ్లిపోతాడు. అర్జునుడు ఇంద్రుని గురించి కఠోర తపస్సు మొదలుపెడుతాడు. ఇంద్రుడు అర్జునుడి నియమ నిష్ఠను పరీక్షించడానికి అప్సరసలనూ, గంధర్వులనూ భూలోకానికి పంపుతాడు. వాళ్ళు అర్జునుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చి అతడిని ప్రలోభపరచడానికి వన విహారం, పుష్పాపచయం, జలక్రీడలు, శృంగారలీలలు మున్నగునవి చేస్తారు. భారవి కావ్యోచిత వర్ణనలన్నీ – అంటే సూర్యోదయ, చంద్రోదయాది వర్ణనలూ, నదీవర్ణనలూ, శరత్, వర్ష, వసంత, గ్రీష్మ, హేమంతాది ఋతువర్ణనలూ అద్భుతంగా చేశాడు. అప్సరసలు అర్జునుడి ముందు మన్మథావస్థల్ని ప్రదర్శించి ఎంత ప్రయత్నం చేసినా అతడిని కించిత్ ప్రలోభపెట్టలేక విఫలమవుతారు. అప్సరసలూ, గంధర్వులూ తిరిగి వెళ్లిపోయి ఇంద్రుడికి రాజర్షి అర్జునుడి విషయం విన్నవిస్తారు. అప్పుడు ఇంద్రుడు వృద్ధముని వేషంలో వచ్చి అర్జునడితో తపస్సు మాన్పించాలని చూస్తాడు. కానీ అతడి తపస్సు వెనుక దృఢ నిశ్చయం విని, నిజరూపం చూపి శివుడి గురించి తపస్సు చేయమని చెప్పి వెళ్లిపోతాడు.
ఇక ఇందులో 12వ సర్గ నుండి 18వ సర్గ వరకూ శివుని గురించి అర్జునుడి మహా తపస్సూ, వారి మధ్య యద్ధమూ శివుడు ప్రసన్నుడై పాశుపతాస్త్ర ప్రదానం చేయడం ఈ మూడవ భాగంలో ఉంది.
అర్జునుడు సూర్యుడికెదురుగా ఒంటికాలితో నేలపై నిలిచి శివతపస్సు ప్రారంభిస్తాడు. సిద్ధ తాపసులు శివుడికి ఈ విషయం నివేదించగా – నరనారాయణుల్లో నరుడే అర్జునుడని చెప్పి తన ప్రమథ గణాలను కిరాత సేనలుగా ముందు పంపించి తాను కిరాత వేషంలో వచ్చేస్తాడు. తన తపస్సుకు భంగం కలిగిస్తూన్న మూకాసురుడనే వరాహంపై అర్జునుడు బాణం వేస్తాడు. అదే సమయానికి కిరాత వేషధారి శివుడూ బాణం వేస్తాడు. వరాహం నేల కూలుతుంది. దానిని సంహరించింది తామేననీ ఇద్దరి మధ్యా యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో అర్జునుడి అమ్ముల పొదులు శూన్యమై, ఆయుధాలు విఫలమవుతాయి. అర్జునుడు, శివుడి మధ్య మల్లయుద్ధం మొదలవుతుంది. శివుడి ఎదపై అర్జునుడు పిడికిళ్లతో చరుస్తాడు.
గాలిలో ఎగిరిన శివుడి పాదాలను పట్టుకొని నేలకు కొట్టాలని ప్రయత్నిస్తాడు. అలిసిపోని అర్జునుడి పరాక్రమానికి శివుడు సంతోషించి నిజరూపం ధరించి అర్జునుడిని కౌగిలించుకొని, ఆతడి తపోదీక్షకు ప్రసన్నుడై పాశుపతాస్ర్తాలతో పాటు ధనుర్వేదం ప్రసాదిస్తాడు. లోక పాలకులు విజయ ప్రదాలైన తమ అస్ర్తాలను ప్రసాదిస్తారు.
‘వజ్ర జయరిం పులోకం.. ధృతగురుజయ లక్ష్మీర్ధర్మసూనుం ననామ’ (18-48) అర్జునుడు విజయలక్ష్మిని పొంది వచ్చి, అన్న ధర్మరాజుకు నమస్కరించాడు అనే శ్లోకంతో ఈ ‘కిరాతార్జునీయం’ మహాకావ్యం సంపూర్ణం అవుతుంది. భారవి రచించిన ఈ ‘కిరాతార్జునీయం’ మహాకావ్యం మరో మహా కవిని సృష్టించింది. అతడే మాఘ మహాకవి. భారవి ప్రభావంతోనే ‘శిశుపాలవధమ్’ కావ్యాన్ని మాఘుడు రాశాడు. మహా కవి కాళిదాసుతో పాటు భారవి – సంస్కృత సాహిత్య కావ్య సంవిధాన నిర్మాత అయినాడు!!
అప్సరసలూ, గంధర్వులూ తిరిగి వెళ్లిపోయి ఇంద్రుడికి రాజర్షి అర్జునుడి విసయం విన్నవిస్తారు. అప్పుడు ఇంద్రుడు వృద్ధముని వేషంలో వచ్చి అర్జునడితో తపస్సు మాన్పించాలని చూస్తాడు. కానీ అతడి తపస్సు వెనుక దృఢ నిశ్చయం విని, నిజరూపం చూపి శివుడి గురించి తపస్సు చేయుమని చెప్పి వెళ్లిపోతాడు.
– రఘువర్మ (టీయల్యన్)