‘మా సదాశివ మాస్టారు’ అంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గర్వంగా పిలుచుకునే డాక్టర్ సామల సదాశివ సాహిత్య ప్రపంచానికీ, యావత్ తెలంగాణకూ గర్వకారణం. నిరాడంబరతకు నిలువెత్తు రూపంలా నిలిచిన సామల సారు ఉర్దూ మీడియంలో చదువుకున్నా తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్లం, పారసీ, మరాఠీ భాషల్లో లోతైన పాండిత్యం ఉన్నవారు. కవిగా, రచయితగా, అనువాదకుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞావంతుడు. ‘అతడి మాట సూది వంటిది, మనసు దూది వంటిది’ అని సదాశివ వ్యక్తిత్వం గురించి చెప్తారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని అసిఫాబాద్ జిల్లా (ఇప్పుడు కుమ్రంభీం) దహెగాం మండలంలోని ‘తెనుగుపల్లె’లో 1928, మే 11వ తేదీన సామల సదాశివ జన్మించారు. చదువుకున్న కుటుంబమే కాబట్టి ఆయన చిన్నప్పుడే మహాభారతం, బసవపురాణం, కళాపూర్ణోదయాది గ్రంథాలను చదివారు. తండ్రి నాగయ్య తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో సదాశివ 19వ ఏటనే ఉపాధ్యాయుడై, ఉద్యోగం చేస్తూనే ఎంఏ బీఈడీ పూర్తిచేసి ప్రమోషన్లు పొందుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల (భద్రాచలం)లో ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు.
‘ఆంధ్ర బిల్హణ’ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి ప్రోద్బలంతో సదాశివ తన 21వ ఏట అన్ని కులాల భేదాలను నిరసిస్తూ అందరూ సమానమని చెప్పే ‘ప్రభాతం’ అనే పద్యకావ్యాన్ని రాశారు. 1950లలో ‘సాంబశివ శతకం’ రాశారు. ‘అపశృతి’, ‘రేవతి’ నవలలు రాశారు. ‘అంబాపాలి’ (ఆమ్రపాలి), ‘సర్వస్వ దానము’, ‘పశ్చాత్తాపము’, ‘మీరాబాయి’, ‘మంచిమాటలు’ వంటి రచనలు చేశారు.
మిత్రుడు వి.హనుమంతరావుతో కలిసి ‘వృషభగిరి నివాస వెంకటేశా’ అనే శతకరచన చేశారు. ‘భారతి’, ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రభూమి’, ‘వార్త’, ‘గీటురాయి’, ‘సియాసత్’ వంటి పత్రికల్లో వందలాది ఉర్దూ, తెలుగు వ్యాసాలు రాశారు. తెలుగు, ఉర్దూ భాషల మధ్య స్నేహవారధిగా నిలిచారు.
సురవరం సూచనతో సదాశివ పద్య రచనలు వదిలిపెట్టి అనువాదరంగంలోకి ప్రవేశించారు. 1963లో ఎహతేషామ్ హుసేన్ హిందీ రచననూ, హజ్రత్ అమ్జద్ హైదరాబాదీ రుబాయీలనూ, 1967లో పారసీ భాషలోని జలాలుద్దీన్ రూమీ ‘మస్నవి’నీ, మరాఠీ కవి కేశవసుత్ జీవిత చరిత్రను తెలుగులోకి అనువదించారు. ‘మీర్జాగాలిబ్ జీవితం- సాహిత్యం’, ‘ఉర్దూ కవుల కవితా సామగ్రి’, ‘పారసీ కవుల ప్రసక్తి’ వంటి గ్రంథాలు రచించి తెలుగు వారికి పరిచయం చేసి సాహిత్య పరిధిని పెంచారు. 1974 నుంచి 1994 వరకూ సదాశివ ఉర్దూ రచనలు మాత్రమే చేశారు.
ఆ తర్వాత ‘ఆంధ్రప్రభ’ వారపత్రిక సంపాదకుడు వాకాటి పాండురంగారావు హిందూస్థానీ సంగీతంపై, గాయనీ గాయకులపై సామల సదాశివతో వ్యాసాలు రాయించారు. అవి ‘మలయ మారుతాలు’ గ్రంథంగా రూపుదిద్దుకున్నాయి. ఆ తర్వాత ఏడాది పాటు రాసిన సంగీత సంబంధిత వ్యాసాలు ‘సంగీత శిఖరాలు’ గ్రంథంగా వచ్చాయి. ‘స్వర లయలు’ అనే ఇంకో పుస్తకాన్నీ ప్రకటించారు. దీనికే (సామల 83వ ఏట) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
‘వార్త’ సంపాదకుడు కె.రామచంద్రమూర్తి సదాశివ జీవిత జ్ఞాపకాలను ‘ఆదివారం వార్త’లో సీరియల్‌గా రాయించారు. అవన్నీ ‘యాది’ పేరిట పుస్తకంగా వచ్చాయి. 8వ తరగతి తెలుగువాచక పాఠ్య గ్రంథకర్తగా ఆదివాసీ ముద్దుబిడ్డ, ‘జల్ జంగల్ జమీన్’ నినాదంతో పోరాడి అమరుడైన కుమ్రంభీం పాఠాన్ని అందులో చేర్చి, అతడి గురించి అందరికీ విస్తృతంగా తెలిసేలా చేశారు సదాశివ. డాక్టర్ సదాశివ కొత్త తరంతోనూ చాలా సన్నిహితంగా ఉండేవారు. సాహిత్యం, కవిత్వంలో ఆధునిక ధోరణులను ఆహ్వానిస్తూ ఉండేవారు. కొత్త కవులు ఇంటికొస్తే వాళ్లతో గంటల సేపు సాహిత్య చర్చలు చేసేవారు. అచ్చమైన తెలంగాణ మాండలికంలో మాట్లాడే సదాశివ లేకుండా ఏ సభా జరిగేది కాదు. తన 84వ ఏట 2012, ఆగస్టు 7వ తేదీన డాక్టర్ సామల సదాశివ స్వర్గస్థులయ్యారు. తన రచనల ద్వారా సామల సదాశివ చిరంజీవులు.
(2025, ఆగస్టు 7వ తేదీన సామల సదాశివ 13వ వర్ధంతి)
– రఘువర్మ (టీయల్యన్) 9290093933