మాడపాటి హన్మంతరావు ‘ఆంధ్ర జనసంఘం’, ‘ఆంధ్ర మహాసభ’ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. మంచి వాదనా పటిమ కలవాడు. ఆ రోజుల్లో ఆంధ్ర మహాసభలు జరపాలంటే నిజాం ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు పెట్టేది. వాటిని తొలగించటానికి నగర కొత్వాల్, విద్యాసంస్కర్త రాజా బహద్దూర్ సాయంతో మాడపాటి ఎన్నో సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలకు అనుమతులు తెచ్చేవాడు. తెలంగాణలో సాహిత్య చైతన్యానికి కారకుడయ్యాడు.
‘మీజాన్’ పత్రిక సంపాదకుడు అడవి బాపిరాజు మాడపాటిని.. ‘తెలుగుదనము తమకే లేదని, తెలుగు భాష తమదే కాదని తెలుగువారు తామే కామని, తెలంగాణ మత్తులో వుంటే మంత్రపు కర్ర తిప్పారండి, మాడపాటి వారు..’ అని ప్రస్తుతించాడు.
మాడపాటి నిజాం వ్యతిరేకోద్యమంలో కార్యశీలుడై పాల్గొన్నాడు. అతనికి ‘ఆంధ్ర పితామహా’ అనే బిరుదం ఇచ్చారు. ఆ కాలంలో ‘తెలుగు’ లేదా ‘తెలంగాణ’ అనే శబ్దం ఉపయోగించకుండా ‘ఆంధ్ర జనసంఘం’, ‘ఆంధ్ర మహాసభ’,‘ఆంధ్ర పాఠశాల’, ‘ఆంధ్ర కళాశాల’, ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’, ‘ఆంధ్ర భాషానిలయం’ అని ‘ఆంధ్ర’ అనే పదా న్నే ఎక్కువగా వాడేవారు. ఎందుకంటే.. ‘ఆంధ్ర’ పదాన్ని చూసి ఇక్కడి తెలుగువారు, అక్కడి తెలుగువారితో ఏకమైపోయారని నిజాం రాజు భయపడటానికి ఈ విధం గా చేసేవారు. దానిలోభాగంగానే మాడపాటికి ‘ఆంధ్ర పితామహ’బిరుదిచ్చారు.
మాడపాటి మంచి రచయిత. 1912లోనే ‘హృదయశల్యము’ అనే కథను రాశాడు. బండారు అచ్చమాంబ కథలు బయట పడేంత వరకు ఆయన కథే తెలంగాణలో మొదటి కథ అనుకున్నాం. పారశీక కవులు సాదీ, ఫిరదౌసీ కవితలను తెనిగించాడు. ఆయనకు తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, పారశీ భాషల్లో మంచి ప్రవేశం ఉన్నది. తెలంగాణ ‘ఆంధ్రోధ్యమం’ (1950) పేరు తో ‘తెలంగాణ విమోచనోద్యమ చరిత్ర’ను రచించాడు. ఆయన ప్రేమ్చంద్ కథలను కొన్నింటిని అనువదించాడు. నైజాంలోనూ ప్రేమ్చంద్ కథల్లోని పీడిత ప్రజలున్నారని కావచ్చు, ఆయనకు ఆ కథలంటే ఇష్టం. మాడపాటి ఒక శక్తిగా మారి అనేక సభలను, కార్యక్రమాలను నడిపిన తెలంగాణ వైతాళికుడు.
శేషాద్రి రమణకవులు ఆంధ్రప్రాంతం వారైనా తెలంగాణను కేంద్రంగా చేసుకొని పరిశోధనలు చేశారు. శేషాద్రి రమణకవులు ఇద్దరన్నదమ్ముల్లో ఒకరు దూపాటి వెంకట రమణాచార్యులు మాత్రమే పరిశోధనలు నిర్వహించేవారు. కానీ పేరు మాత్రం ‘శేషాద్రి రమణ కవులు’ అని పెట్టుకొనే వారు. కొమ్మర్రాజు 1922లో ‘పరిశోధక మండలి’ని స్థాపించాడు. ఆ మండలి ప్రతినిధిగా శేషాద్రి రమణకవులు తెలంగాణ జిల్లా ల్లో పర్యటిస్తూ తాళపత్ర గ్రంథాలను, నాణేలను, శాసన ప్రతిబింబాలను సేకరించేవారు.
వేములవాడలో సంచరిస్తున్నప్పుడు వారికి వేములవాడ వాసి రాజరాజేశ్వరుని భక్తుడైన ‘సోమ కవి’ రామరాజభూషణుని ‘వసుచరిత్ర’కు రచించిన ‘విద్వజ్జన రంజని’ అనే వ్యాఖ్యానం లభించింది. సోమకవి క్రీ.శ.1750 ప్రాం తం వాడు. సోమకవి రచించిన వ్యాఖ్యానం ప్రతి శిథిలమైనచోట శేషాద్రి రమణకవులు సవరించారు. ఆ తర్వాత కొత్త వ్యాఖ్యానం లో కొన్ని అలంకారిక విషయాలను చేర్చి ‘ప్రతి’ని తయారుచేశారు. దీన్ని 1926లో వావిళ్లవారు ప్రచురించారు. అంతకుముందు బ్రౌన్ ‘వసుచరిత్ర’కు జూలూరి అప్పయ్యగారి చేత ప్రతిపదార్థాలతో వ్యాఖ్యను రచింపజేసి ప్రచురించాడు. కాని సోమకవి వ్యాఖ్యానం విపులంగా ఉంది. సంస్కృతంలో నైషధకావ్యం ‘విద్వదౌషధం’ అని అనబడుతుంది. అంటే విద్వాంసుల గర్వాన్ని పోగొట్టే మందు ఆ కావ్యం. అంటే వారు కూడా వ్యాఖ్యానం లేకుండా నైషధాన్ని అవగాహన చేసుకోలేరని అర్థం. అదేవిధంగా ‘వసుచరిత్ర’ రాను రాను శ్లేష మూలకార్థాలతో అర్థం కాకుండా పోయింది. అటువంటి సమయంలో శేషాద్రి రమణకవులు సోమకవి వ్యాఖ్యానాన్ని ప్రచురించారు. తెలంగాణలోని వేములవాడ వాసి సోమకవి వ్యాఖ్యానం ఈ విధంగా ప్రసిద్ధిపొందటం తెలంగాణ పండితుల ప్రతిభను తెలియజేస్తున్నది.
నిజాం రాజ్యంలో ఉర్దూ భాషకు ప్రాధాన్యం ఉండి తెలుగుభాషకు ఆదరణ లేనప్పుడు ఆదిరాజు వీరభద్రరావు దాని అభివృద్ధికి కృషిచేసిన నిస్వార్థ దేశభక్తుడు. ఆదిరాజు వీరభద్రరావు, కొమ్మర్రాజు లక్ష్మణరావు పండితులతో పరిశోధనలో పాల్గొన్నారు. షితాబ్ఖాను గూర్చి పరిశోధన చేసి పుస్తకాన్ని ప్రచురించారు. ‘గోలకొండ పత్రిక’లో సురవరం వారికి కుడిభుజంగా పనిచేశారు.
ఆదిరాజు వీరభద్రరావు ఎన్నో సంస్థలు, గ్రంథాలయాలు, పాఠశాల నిర్వహణలో భాగస్వాములయ్యారు. ‘శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం’ స్థాపనలో ఒక ప్రముఖ వ్యక్తిగా ఎన్నో చారిత్రక వ్యాసాలను రచించి గోలకొండ పత్రికలో ప్రచురించారు. ‘విజ్ఞాన కోశము’ను సంగ్రహరూపంగా విజ్ఞానకోశ సమితి వారు ప్రచురించినప్పుడు ఆ బాధ్యతను ఆదిరాజు వీరభద్రరావు తీసుకున్నారు.
విద్యార్థుల కోసం ఎన్నో పుస్తకాలు రచించారు. ఈ విధంగా అనేక సంస్థలతో, పత్రికలతో సంబంధం ఉండి తెలంగాణ భాషా, సాహిత్యం కోసం సేవలందించిన వైతాళికుడు ఆదిరాజు వీరభద్రరావు.
ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606