నిజమే!
‘గత కాలము కంటే వచ్చుకాలమే మేలు’
నిన్నటి గతం మానని పుండు
ఇయ్యాళ్టి వర్తమానం
ఎగురుతున్న ఆత్మగౌరవ జెండా
రేపటి భవిష్యత్తు చెరగని చరిత్ర!
రెక్కలెట్లా తొడుక్కున్నానో
రివ్వున ఎట్లా ఎగిరి వచ్చానో
అన్ని దుఃఖనదుల్ని ఎట్లా ఈదుకొచ్చానో
ఏదీ గుర్తురావడం లేదు
ఒక్క విరామం లేని యుద్ధం చేయడం తప్ప!
ఎట్లా ఈ ఒడ్డును చేరుకోవాలనుకున్నానో
లేక ఎటు గాలొస్తే అటు
చెట్టును వీడిన ఆకై కొట్టుకొచ్చి
ఈ నగరం కాంక్రీటు అరణ్యానికి చిక్కుకున్నానో
ఏదీ తెలియడం లేదు
ఒక్క మొండి పట్టుదల తప్ప!
చీకటిని చీల్చుకుంటూ.. వెలుతురు పిట్టలు
నా భుజాల మీద ఎట్లా వాలినయో
అక్షరాల లాంతరొక్కటే
గుండెల నిండా
మినుకు మినుకుమంటున్న దోస్తీ
దాటివస్తున్న దారులు తప్ప
గట్టెక్కిన గండాలేవి జ్ఞాపకం రావడం లేదు
బహుశా ఇది మా అమ్మ నేర్పిన ఎదురీతై ఉంటది!
కుడుమంటే పండుగంటూ
దారినపోయే మనిషే సుట్టమైనట్టు
కలుపుగోలుతనం
కల్మషమంటని గుణం
ఎవరు ఎవరికి అరువిస్తారు
ఒక్క అమ్మ చనుబాల ధార తప్ప!
అచ్చం అమ్మలెక్కనే ఉన్నవంటరు
రూపాన్ని చూసి!
ఔను, అమ్మకు మరో రూపమే అంటరు
గుణాన్ని కూడా చూస్తే!
మడికట్ల జీవితాన్ని
లెక్కచేయని సాహసం
జొన్నకొయ్యల్ల కారే నెత్తురును
లెక్క చేయకుండా దాటే ధైర్యం
నాలో ఏనాడు నింపిందో
లోలోపలే ఆలోచిస్తూ…
ఇప్పుడు అమ్మ కడుపు పంటనై
లోకాన్ని చూస్తున్న…
అడుగులు తడబడినా సరే…
అమ్మ వైపు నడవడమే కదా
ఏ కన్న పేగుకైనా అసలైన గమ్యం!
– డాక్టర్ పసునూరి రవీందర్ 63030 08268