ఎట్లనో చదువబ్బింది నాకు
అందుకు ఇక్కడున్నాను
చాలారోజుల తర్వాత ఊరికెళ్లాను
భిక్షపతి కోసం వెతికితే
పొలంలో దొరికాడు
వయస్సు మళ్లింది గానీ
అట్లనే వున్నడు.
చెయ్యి కలిపితే
గరుగ్గా తగిలింది,
కళ్లల్లో అదే వెలుగు
అదే ప్రేమ
‘చాలా పెద్దోనివైనవంట గదరా’ అన్నాడు
స్కూళ్లో నాకన్నా తెలివైనవాడు
ఇప్పుడు అక్కడే వేసిన గొంగడిలా ఉన్నాడు.
మా ఇంటికి తీసుకొచ్చాను
కలిసి బోంచేద్దాంరా అన్నాను
ఇది నువ్వు పండించిన బువ్వే
అన్నం తిన్నప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు.
ఇద్దరం కలిసి
ఊరంతా తిరిగాము
చిన్ననాటి కబుర్లు
తల్లి కడుపంత వెచ్చగా ఉన్నాయి.
గిల్టీ ఫీలింగ్ గిల్టీ ఫీలింగ్
నిలువెల్లా నన్ను దహించి వేస్తుంది
తగినవాడికి
తగిన జీవితం చేతికందని
దరిద్ర దేశం మనది.
నన్ను సాగనంపడానికి
రైల్వే స్టేషన్ దాకా వచ్చిండు
వాడు చెయ్యి ఊపుతుంటే
అభయహస్తం చూపుతున్న
దేవుడిలా ఉన్నాడు.
– డాక్టర్ ఎన్.గోపి