కవి భర్తృహరి ప్రతి మానవుడికి జీవన గమనంలో ఉపయోగపడే ‘నీతి’, ‘శృంగార’, ‘వైరాగ్య’ శతకాలను రచించాడు. ఈ మూడు శతకాలు అమూల్య రత్నాల వంటి శ్లోకాలతో నాటినుంచి నేటివరకూ లోకాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
భర్తృహరి యోగిగా మారకముందు రచించిన శతకమ్ ‘నీతి శతకమ్’ కాగా ఆ తదుపరి రచించినది ‘శృంగార శతకమ్’. కవి భర్తృహరి తన భార్య పింగళతో సంసార జీవితాన్ని గడిపే కాలంలో, సమాజంలోని శృంగార జీవన విధానాన్ని పరికిస్తూ ఈ ‘శృంగార శతకమ్’ను వ్రాసి ఉంటాడని పండితాభిప్రాయం.
‘శమ్భు స్వయమ్భు హరయో హరిణే- క్షణానాం/ యేనా క్రియన్త సతతం గృహకుంభదాసాః/ వాచామ గోచర చరిత్ర విచిత్రితాయ/ తస్మై నమో భగవతే మకరధ్వజాయ’ -శివ, బ్రహ్మాది విష్ణు దేవుళ్లనూ సైతం వాళ్ల భార్యలకధీనులుగా చేసి ఇండ్లలో ఘటదాసులుగా మార్చి, ఇట్లా మాటలకందని చేతలనెన్నింటినో చేసేవాడైన మన్మథ దేవుడికి నమస్కారం అంటూ నమస్కరిస్తూ భర్తృహరి ఈ శతకాన్ని ప్రారంభించారు.
ఇందులో ‘స్త్రీ ప్రశంస’ మొదలుకొని ‘ఋతు వర్ణన పద్ధతి’ వరకూ ఏడు శీర్షికలతో నూరు శ్లోకాలున్నాయి. భర్తృహరి మూడు శతకాలలోని శ్లోకభావాలననుసరించి ప్రఖ్యాత సంస్కృత కావ్య వ్యాఖ్యాత రామచంద్ర బుధేంద్రుడు శీర్షికలను నిర్ణయించాడని చెప్తారు.
మొదటి శీర్షిక: ‘స్త్రీ ప్రశంస’లో ‘స్మితేన భావేన చ లజ్జయా’ సుందర దరహాసంతో, సిగ్గుతో, బెదురుతో, సొగసుగా ముఖం తిప్పుకునే విధానాలతో, క్రీగంటి చూపులతో స్త్రీలు తమ భర్తలను తమ చెంతనే బంధిస్తారంటూ, కనుబొమ్మల నేర్పుదనాల ముడిపాటులూ, ఓర చూపులూ, ముసిముసి నవ్వులూ, మెత్తని మాటల పలుకరింపులూ, సాగుతూ నిలుస్తూ మళ్లీ సాగే ఒయ్యారాల నడకలు స్త్రీలకు ఆభరణాలూ, ఆయుధాలూ అనీ పందొమ్మిది శ్లోకాల్లో స్త్రీని భర్తృహరి ప్రశంసించాడు.
చక్కని కనుబొమ్మలు పద్మ సౌందర్యాన్ని అవహేళన చేయగలిగే ఆ కన్నులూ, మేలిమి పసిడిని ప్రక్కకు పెట్టగలిగే మేనిరంగూ యువతులకు పుట్టుసొమ్ములంటాడు. అందమైన మగువకు మన్మథుడు సేవకుడేనని, ఆమె కనుబొమ్మల కదలికల సూచనలతో మన్మథుడు తన బాణాలను వేసేవాడుగా నడుచుకుంటున్నాడనీ అంటాడు. చీకట్లను పోగొట్టే దీపమూ, జ్వాలాశిఖాగ్నీ, తారలూ, సూర్యచంద్రులూ ఉన్నా… కొదమ లేడి కన్నుల వంటి కనులు కలిగిన ప్రియకాంత చెంతలేకుంటే ఈ లోకమే తన కంధకారమయమనీ చెప్తాడు.
రెండవ శీర్షిక: ‘సంభోగ (సౌఖ్య) వర్ణనము’లో సంభోగ శృంగారాన్నీ, విప్రలంభ శృంగారాన్నీ పదమూడు శ్లోకాల్లో వర్ణించాడు. ‘విశ్రమ్య విశ్రమ్య వనే ద్రుమాణాం.. నివారయన్తీ శశినోమయూఖాన్’ -కాంతుడి విరహంలో కాగుతున్న కోమలి ఒకామె రాత్రి తోటలో చంద్ర కిరణాల తాపాన్ని తట్టుకోవడానికి తలపై కొంగును కప్పుకొని అక్కడ తచ్చాడుతూ చెట్ల నీడల్లో కూర్చుంటూ సేద దీరిలేస్తూ తిరిగి కూర్చుంటూ మళ్లీ లేచి తిరుగుతూ ప్రియుడి కోసం ఎదురుచూస్తుందని విప్రలంభ శృంగారాన్ని వర్ణించాడు. కుముదాక్షులూ, ఇందీవరాక్షులూ అయిన మాప్రేయసుల యవ్వన రూపాలను ముసలితనం ఆవరించక మునుపే సుఖ భోగాలలో తేలడానికి మాకు ఇళ్ళకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి ఓ రాజా! అంటూ రాజును అర్థిస్తాడు.
మూడవ శీర్షిక: ‘పక్షద్వయనిరూపణం’లో స్త్రీలను ప్రేమతో చూసుకునేవారికి ఇహలోక సౌఖ్యాలూ, స్త్రీలపై విరక్తితో వారిని త్యజించేవారికి పరలోక సౌఖ్యాలు కలుగుతాయనీ అనురక్తి, విరక్తి అనే రెండు పక్షాలుగా ఏడు శ్లోకాల్లో వర్ణించాడు. మానవా- నీవు విరాగివై అడవి జింకలకు పచ్చని దర్భలను ఆహారంగా అందిస్తూ అక్కడే అడవిలో ఉండిపో లేదా అనురాగివై నీ వధూమణికి తాంబూలాన్ని ప్రేమతో అందిస్తూ నీ గృహ స్వర్గంలోనే ఉండిపో! అని చెప్తాడు. ఇక్కడినుంచే భర్తృహరి వైరాగ్యం వైపు మళ్లుతున్నాడని చెప్పవచ్చు. ఓ జనులారా! ఘననితంబినులైన ప్రమదల కన్నా మనోజ్ఞమైన వారెవరూ లోకంలో లేరు, విరహాన్ని రగిలించి ఏడిపించడంలో వీళ్ల కన్నా ఇంకెవరూ లేరని అంటాడు.
నాలుగవ శీర్షిక: ‘కామినీ గర్హణము’లో ‘కాన్తేత్యుత్పలలోచనేతి విపులో శోణీభరే..’ అన్ని తెలిసిన విద్వాంసుడూ యవ్వనాదులు అశాశ్వతం అని తెలిసి కూడా అందమైనది మగువ అని మెచ్చుకుంటూ మన్మథకేళుల్లో తేలియాడుతుంటాడు. ఆహా! మోహపు దుశ్చేష్ట ఎంతటి ఆశ్చర్యకరమని అంటాడు. అతివను, తలచుకుంటే ఆమె మన్మథ తాపాన్ని రగిలిస్తుందనీ, చూస్తేనే మదన సంబంధోన్మాదాన్ని పెంచుతుందనీ, తాకితేనే మోహపు తన్మయత్వాన్ని కలిగిస్తుందనీ.. ఇట్లా అస్థిరంగా, బలహీనంగా మార్చే ఆ అతివ ప్రేయసి ఎట్లా అవుతుందని ప్రశ్నిస్తాడు. అనురాగం ఉన్నప్పుడు ఆమె అమృతలత, అనురాగం లేనప్పుడు ఆమెనే విషమంజరి అని ఇట్లా స్త్రీని గర్హిస్తూ ఇరువై శ్లోకాలు రచించాడు భర్తృహరి.
ఐదవ శీర్షిక: ‘సువిరక్త పద్ధతి’లో స్త్రీల పట్ల విముఖులైన వాళ్లలో సువిరక్తులూ, దుర్విరక్తులూ అని పురుషులలో రెండు రకాలని చెప్తాడు. తెల్లని విశాల నేత్రాలు కలవారైన, పరువాల గరువాల మిడిసిపాటుతో ఎద సంపద గలవారైన అతివల అందమైన రూపాలను చూసి ఏ పురుషుల మనసులు మదన వికారానికి లొంగిపోవో వారే ధన్యులు అంటూ సువిరక్త పద్ధతిని తొమ్మిది శ్లోకాల్లో వరిస్తాడు.
ఆరవ శీర్షిక: ‘దుర్విరక్త పద్ధతి’లో ‘తావదేవ కృతినామపి స్ఫురత్యేష నిర్మల వివేకదీపః’ విద్వాంసులనెంతవరకూ ఆడవాళ్ల వయ్యారాల వాలుచూపుల అంచులు తాకవో అంతవరకూ ఆ విద్వాంసుల నిర్మల వివేకదీపం ఉజ్వలంగా ప్రకాశిస్తుందంటూ స్త్రీలపై నిందాపూర్వకంగా పది శ్లోకాలు రాశాడు.
ఇక ఏడవ శీర్షిక: ‘ఋతు వర్ణన పద్ధతి’లో ‘పరిమళభృతో వాతాః శాఖా నవాంకుర కోటయోః’ పవనాలు పరిమళభరితాలయ్యాయి, చెట్లకొమ్మలు క్రొత్త చిగురులు వేశాయి, మగ కోకిలల కాకలీ స్వరగీతాలు ఆడ కోకిలలకు పియాన్ని కూరుస్తున్నాయి, వనితల వదనేందు బింబాలు మరుకేళుల వల్ల చెమట చుక్కలతో చెమరుస్తున్నాయి, వసంతం వస్తూండగానే ధరిత్రిపై ప్రతిదీ సుందర మధుర గుణ ప్రవర్ధమానమై ప్రవర్ధిల్లుతుదన్నదని వసంత ఋతువు గురించి ఆరు శ్లోకాల్లో వర్ణించాడు.
‘అచ్ఛాచ్ఛచన్దనరసార్ద్రతరా మృగాక్ష్యో’ స్వచ్ఛ చందనరసాల మైపూతలతో స్త్రీలూ, జలయంత్ర సదనాలు, పుష్పాలు, పున్నమి వెన్నెలా, విరజాజి వాసనల మందమారుతమూ మున్నగునవి గ్రీష్మ ఋతువులో హర్షా న్నీ, మన్మథుడి గర్వాన్నీ పెంచుతున్నాయని గ్రీష్మఋతువును భర్తృహరి మూడు శ్లోకాల్లో వర్ణించాడు. ఇక వర్షఋతువు గురించి కామాన్ని ఉద్దీప్తం చేసేదని చెప్తూ ఆరు శ్లోకాల్లో వర్ణించాడు. ఇంకా శరదృతువులో పురుషుడు నడిరాత్రి వరకు అటూ ఇటూ పొరలి చిన్న కునుకు తీసి లేచి ప్రియకాంతతో కూడి తర్వాత ఆరని దాహంతో ఉన్నవాడై తన ప్రియకాంత కౌగిలి నుంచి కొంత విడి వడి మట్టి పాత్ర నుంచి అందించే నీటిధారను -శరత్కాల చంద్రుడి వెన్నెలలో ఎవడైతే తాగడో వాడు అదృష్ట హీనుడంటూ ఒక్క శ్లోకంలో అద్భుతంగా వర్ణించాడు.
చివర శిశిర ఋతువును రెండు శ్లోకాలలో వర్ణిస్తూ శిశిర ఋతువే పవనుడై అతివేగంగా వీస్తూ స్త్రీల కేశాలను చిందరవందర చేస్తూ, వస్ర్తాలను ఈడ్చేస్తూ, పెదవులు కొరుక్కునేలా చేస్తూ భర్తల వలెనే సంచరిస్తున్నాడని చెప్తాడు. ఇట్లా భర్తృహరి నాటి సమాజ శృంగార జీవనాన్ని చెప్తూ శృంగారంలోని అతిని వర్జిస్తూ ‘శృంగార శతకాన్ని’ రచించాడు.
ఇక హేమంత ఋతువును రెండు శ్లోకాలలో వర్ణిస్తూ పెరుగు, నెయ్యిలను కలిపి సుష్ఠుగా భుజించినవాడు, భార్యల బిగి కౌగిళ్ళలో ఉన్నవారు, తాంబూలం నమలి ఇళ్ల లోలోపలి గదుల్లో స్త్రీ పురుషులు సుఖంగా నిద్రిస్తున్నారంటాడు భర్తృహరి.
తెలంగాణ ప్రజలకు భాష ఓ పిలుపు మాత్రమే కాదు. చరిత్ర మారినా చెదరని అస్తిత్వం. అందుకే తెలంగాణ ఘన సాహిత్యానికి పెద్దపీట వేస్తూ చెలిమెను నిర్వహిస్తున్నది మన పత్రిక. అలసిసొలసిన వేళల్లో కళారూపాలైనా, పోరుబాటల్లో పాటలా మారినా, ఆత్మగౌరవాన్ని కథతో నినదించినా… తనదైన శైలి తెలంగాణది. ఆ సాహిత్యంలో మీకు ఎలాంటి అభిరుచి ఉన్నా, కలాన్ని కదిలించండి. ఆసక్తిగా, సూటిగా తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన రచనలు చేయండి… editpage@ntnews.com
‘రఘువర్మ’ (టీయల్యన్)
92900 93933