కళ్లను కాలచక్రం వైపు తిప్పామా
కనిపించని కాలుష్యం కాటేస్తున్న కథలై
ఆరోగ్య చిట్కాల చిట్టాలనే పట్టుకుంటున్నాయి
మూడు పువ్వులు ఆరు కాయల జనులుగా మారిన
యుగయుగాల చరిత్రలో కలాలకు అందుతున్నది
దిగాలు పడుతున్న మనుషుల చరిత్రనే!
తృణధాన్యాలు తరగని నిధులెందుకవుతున్నాయో
విధిగా తెలియాల్సిన శారీరక శ్రమలేంటో
మానసికోల్లాసానికి మంచి ఆలోచనల అవసరాలేవో
వెన్నెల గ్రోలే చకోరాల్లా మానవాకారాలు మారుతున్నాయి
కొచ్చగా నిటారుదేలని పజ్జొన్న చేనుపై చిల్కలు వాలి
రైతు పాలిట కష్టపు వృష్టి అయిన దృశ్యం
నన్ను అయోమయాలోచనల వెల్లువను చేశాయి
కిటికీ తలుపు తెరిచానా పచ్చని పంట పరీమళం
చూపుల వలలతో చువ్వలను విడవనివ్వదు
పొడిచిన వెలుగులా గడిచిన
నెలల తంతు అంతా ఇంతే
ఇంటివెనుక పంటచేనుండటం కాకతాళీయమే!
కథనమొక్కటే ఇప్పటిది భావమంతా
రేపటి బతుకు గమనానిది
నెలరోజులుగా కంకుల మీద బడి పులుగుల దాడి
జీవులు కదా! జొన్నలు మమా ప్రీతట
మంచెమీద మనుషుల ఒడిసెల రాళ్ల విసుర్లు
నాలుగైదు స్కేర్ కో దిష్టిబొమ్మల
బెదిరింపులు లెక్కచేయని పక్షులు
చేతికొచ్చిన పంట నాశనమైతుంటే రైతులేం చేస్తారు?
తెల్లారితే చాలు కుటుంబమంతా
చెల్కకతుక్కుంటున్నారు
పిట్టలనెల్లగొట్టే పనిలో డబ్బాల
డబడబ మోతలేగాదు
మంటికి మింటికి శబ్ద వారధులైనవి వాళ్ల అరుపులు
కోత అయ్యేదాకా ప్రృకతిలో యుద్ధ సన్నాహాలే!
పంట పొలాల్లో మొలిచిన పట్నం చిరునామా
కనుచూపు మేర కాంక్రీటు అడవి
చిన్న చిన్న గృహ వృక్షాల నడుమ అనాథగా
రెండు ఎకరాల చెక్క చెల్క అయ్యింది
భూతల్లి అతని జీవనాధారం అప్పుడు
ఇప్పుడీ రైతు కళ్లలో భయాందోళనల విన్యాసం
‘ఉన్న గీ జాగనమ్మితే నేనేంజేయాలె అటెన్క?’
ఆశ్చర్యం నా వంతయి
అంతులేని అనుమానాలు రేపింది!
భూమి ధర ఆకాశంతో పోటీ
‘అన్నా అమ్ముతవానే?
అమ్మనంటె అమ్మను మా జీవనార్తి ఇది’
‘ఎందుకమ్మవన్నా’
‘డబ్బెవరికి చేదుగాని?
మాకు తీపి కూడా కాదు’
‘గదేంది గట్లంటవు?
లక్షాధికారివి అవ్వొచ్చు లాకర్లల్ల పెట్టొచ్చు
కార్లు కొనొచ్చు మిద్దెలు కట్టొచ్చు’
‘ఇయన్నొస్తైలేగాని, చేతులు
ముందరేస్కోని ఒట్టిగనే కూర్సోవాలె
మాతోనేడైతది అమ్మేదే లేదు’
నోరు అట్లనే తెర్సుకున్నది
ఈగలు పోతయని మూసేసిండట
ఓ తమ్ముడు
నిజమే హృదయం అణువణువునా
మట్టి బంధాల పూలు పూయిస్తుంటే
చెల్కనమ్మి అతనేం చేస్తాడు!
ఈ వినిమయాల ఎత్తు జిత్తులు
రైతు కన్నీళ్లకేం వెల కడ్తాయి?
పజ్జొన్నలు ఆరోగ్యానికి మేలు
పాకెట్ల మీద రేట్లు పరేషాన్ జేస్తుంటె
పండించే రెక్కల కష్టాల్ని
తలుచుకునేదెవరూ?
కాలం గిర్రున తిరుగుతుంటె
కాళ్లకు బలపం కట్టుకుని
ఇంటికి మార్కెట్కు
ఆగని చక్రాలవుతున్నారు రైతులు
ఏ పంట కష్టం ఆ పంటదే
దిగుబడి మాట ఎవరెరుగుతారు?
నా కవితా కథ సాగుకిప్పుడు
తొలి విత్తనం పజ్జొన్న చేను!
కన్నీటి పదబంధాల్లో
కష్టాల పలుకుబళ్లలో
చెక్కలేని శిల్పం చెప్పగల
శైలీ విన్యాసాలు రైతులే!!
రైతే రాజైతే తన గోడెవరికి చెప్పుకోవాలి?
– డాక్టర్ కొండపల్లి నీహారిణి