యల్లాప్రెగడ సీతాకుమారి.. కాలానికి ముందున్న కథయిత్రి
స్త్రీలు ఏదో ఒక రంగంలోనైనా రాణించటానికి పరిమితమైన అవకాశాలున్న కాలమది; అవును-నూరేండ్లకు పూర్వపు రోజులవి! ఆ రోజుల్లోనే కవయిత్రి, కథానికల రచయిత్రి, సామాజిక సంస్కర్త, రాజకీయవేత్తగా ప్రకాశించిన బహుముఖ ప్రజ్ఞాశాలిని యల్లాప్రెగడ సీతాకుమారి.
- కథానిక కమామిషు 12
స్త్రీలు ఏదో ఒక రంగంలోనైనా రాణించటానికి పరిమితమైన అవకాశాలున్న కాలమది; అవును-నూరేండ్లకు పూర్వపు రోజులవి! ఆ రోజుల్లోనే కవయిత్రి, కథానికల రచయిత్రి, సామాజిక సంస్కర్త, రాజకీయవేత్తగా ప్రకాశించిన బహుముఖ ప్రజ్ఞాశాలిని యల్లాప్రెగడ సీతాకుమారి. సికింద్రాబాద్‌లోని కీస్ హైస్కూలో చదువుకుని, విద్వాన్ పట్టా పొందిన సీతాకుమారి, తాను చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయినిగా కొంతకాలం పనిచేశారు.
1932 నాటి ఖమ్మం (మూడో) ఆంధ్ర మహాసభ మహిళా విభాగానికి అధ్యక్షత వహించే నాటికి ఆమె వయసు ఇరవయ్యేండ్లే! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 1957లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో, పాత నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి సీతాకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిక్కడపల్లిలో ‘ప్రమదావనం’తో మొదలుపెట్టి, బర్కత్‌పురలో ‘ఆంధ్ర యువతీ మండలి’ నిర్మాణం వరకూ ఆమె ప్రదర్శించిన చొరవ అపూర్వం. సీతాకుమారి నాయకత్వ లక్షణాలను మరుగుపర్చటం సబబుకాదు! ఈ క్రమంలో ఆమెకు సహకరించిన వారెందరో ఉన్నారు. వారిలో ముఖ్యులైన ఇల్లిందల సరస్వతి లాంటి వాళ్లను ప్రస్తావించకపోవటం అపరాధమే అవుతుంది. 1911లో పుట్టి, 1986లో కన్నుమూసిన సీతాకుమారి ఈ కార్యక్రమాలకు నాయకత్వం వహించిన మాటా వాస్తవం.
కథయిత్రిగా సీతాకుమారి పాత్ర ప్రత్యేకంగా ప్రస్తావించదగిన విషయం. ‘ఆంధ్రపత్రిక’, ‘భారతి’, ‘గృహలక్ష్మి’, ‘ఆంధ్రకేసరి’, ‘యువ’ తదితర పత్రికల్లో ఆమె కథలు అచ్చయ్యాయి. ఆమె కథానికల్లోని వైవిధ్యం, ఆమె తరం కథయిత్రుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. విశేషించి, ఆమె రాసిన ‘ఉత్తరాలు’, ‘హాస్పిటల్లో….’, ‘వెన్నెల్లో’ లాంటి కథానికలు మరెవరైనా-ముఖ్యంగా రచయిత్రులెవరైనా-ఆ రోజుల్లో రాశారా? అనేది పరిశోధనార్హమైన విషయం.
తన మిత్రుడింట్లో, మకాం చేస్తున్న ఒకానొక అతిథికి ఎవరు రాశారో తెలియని ఉత్తరాలు కొన్ని దొరకటమే ‘ఉత్తరాలు’ కథానిక ఇతివృత్తం. అవి రాసినామెకీ, అందుకున్న వ్యక్తికీ మధ్యన ఉన్నది ప్రేమబంధమే గానీ పెండ్లిబంధం కాదు. అంతలో ఆమెకి వేరే వ్యక్తితో పెండ్లి కుదురుతుంది. తను రాసిన ఉత్తరాలు ‘వేరే వ్యక్తి’ దగ్గర ఉండటం భద్రం కాదని భావించి వాటిని తిప్పి పంపమంటుంది ఆమె. అలా, అతని ఉత్తరాలూ, ఆమె ప్రత్యుత్తరాలూ ఒకేచోట చేరతాయి. సదరు అతిథి మకాం చేసిన గదిలో ‘ఆంట్ రోజ్’ తైలవర్ణ చిత్రమున్నట్లు రాయ టం చమత్కారపూర్వకమైన ధ్వని! ‘ఏ స్త్రీకైనా తనను ఆరాధించే ప్రియులు రాసిన ప్రేమలేఖలు, తమ సౌందర్యానికీ, ఠీవికీ, చాకచక్యానికీ, ఆకర్షణకూ దక్కిన యోగ్యతా పత్రాలు. అందుకే ఆమె వాటిని భద్రపర్చుకుంటుం’దన్నది ముక్తాయింపు. ఆంట్ రోజ్ భావుకతకు జోహార్లు అర్పించాలి నిజమే కానీ, ‘ఈ రోజుల్లో అడుగడుగునా ఎదురయ్యే ప్రేమపిశాచుల గురించి ఆనాటి కథయిత్రి అసలు అంచనా కట్టగలిగారా?’ అనే ప్రశ్న తలెత్తకపోదు.
సీతాకుమారి రాసిన మరో కథ ‘వెన్నెల్లో.’ ‘వెన్నెల ముందు ఎలక్ట్రిక్ షాక్‌లా బాధ కలిగిస్తుంది. క్రమంగా సురాపానంలా మత్తెక్కిస్తుంది. చివరికి వీణాగానంలాగ మనసును మురిపిస్తుం’దని 1938లోనే ఓ కథయిత్రి రాయటం, ‘గృహలక్ష్మి’లాంటి పత్రిక దానిని ప్రచురించటం అక్షరాలా ఊహాతీతం! అలాగే, ‘హాస్పిటల్లో….’లాంటి కథానిక ఆ కాలానికే కాదు, ఈ కాలానికి సైతం అరుదైనదని అనిపిస్తుంది. ఆ కథానాయికకు పెండ్లయింది. అతనో పిచ్చివాడు. తండ్రి పచ్చి స్వార్థపరుడు- తన కూతుర్ని పిచ్చివాడికిచ్చి పెండ్లి చేసి, అతని చెల్లెల్ని తను కట్టుకుంటాడు. ఆమెతో పడక పంచుకోవటానికి సిద్ధపడిన పురుష పుంగవుడు, తాళికట్టటానికి జంకుతాడు.
ప్రకృతిధర్మం ప్రకారం ఆమె ఓ బిడ్డకు తల్లి అవుతుంది. తన జీవితం తిరిగిన మలుపులూ, మెలికలను తలపోసుకుంటూ ఉండగా, విజిటర్స్ టైం అయిపోయిందంటూ గంట మోగుతుంది. బిడ్డకు పాలిస్తూ అందులోనే ఆనందం వెతుక్కుంటుంది ఆ పిచ్చితల్లి! ప్రతి కథానికలోనూ దివ్య సందేశం ఉండనక్కరలేదు. వాస్తవ జీవితం-జీవిత వాస్తవాల ప్రతిఫలనం సక్రమంగా జరిగితే అదే పదివేలు!
1933-1963 మధ్య సీతాకుమారి రాసిన ఎనిమిది కథానికలను విశ్లేషిస్తూ, శీలా సుభద్రాదేవి ‘సంచిక’ వెబ్ సంచికకు రాసిన వ్యాసం అందరూ చదవతగినది. అందులో ఆమె ప్రస్తావించిన కథానికలన్నీ
‘కథానిలయం డాట్ కాం’లో దొరుకుతున్నాయి.
– మందలపర్తి కిషోర్ 8179691822
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

