పురుషుడి అవసరాలు వేరు. శరీర వ్యవస్థ వేరు. పురుషాధిక్య సమాజంలో పురుషుల కోసం రూపొందించిన యాప్స్‌ను మహిళలు ఎందుకు భరించాలి? ఎంతకాలం ఉపయోగించాలి? ఈ ప్రశ్నకు సమాధానమే.. ఫెమ్టెక్ (ఫెమినైన్ టెక్నాలజీ). ఆసియా దేశాల్లో దూసుకుపోతున్న ఫెమ్టెక్ కంపెనీల్లో ఐదుశాతం కంపెనీలు మనదేశానికి చెందినవే కావడం విశేషం. పీరియడ్ ట్రాకింగ్ యాప్ ‘క్లూ’ను ఆవిష్కరించిన తయిదా అనే యువతి ఫెమ్టెక్ అనే మాటను వెలుగులోకి తెచ్చారు.
‘ఇప్పటికీ ఫెమ్టెక్ ఇండస్ట్రీ మొగ్గదశలోనే ఉంది. మాలాంటి కొన్ని స్టార్టప్స్ ఈ రంగంలో పని చేస్తున్నా, జరగాల్సింది ఎంతో ఉంది’ అంటారు ఐంద్రా సిస్టమ్స్ ఫౌండర్ ఆదర్శ్ నటరాజన్. బెంగళూరుకు చెందిన నటరాజన్ మహిళల్లో తొలిదశలోనే గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించేందుకు వీలుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ స్క్రీనింగ్ సిస్టమ్‌ను రూపొందించారు. ఇలాంటివే మరికొన్ని..
అప్రిసిటీ (Apricity)
రకరకాల కారణాలతో సంతానలేమితో ఇబ్బంది పడుతున్నవారికి గర్భధారణ మార్గాలను బోధిస్తుంది ఈ యాప్. ఆ తర్వాత కూడా.. పండంటి బిడ్డను
కనేదాకా.. ప్రతిదశలో కాబోయే తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలను నేర్పిస్తుంది.
మాయా (Maya)
ఇది మహిళలకు డిజిటల్ అసిస్టెంట్‌లా పనిచేస్తుంది. గైనకాలజిస్టుల అపాయింట్మెంట్స్ ఖరారు చేస్తుంది. మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ ఇప్పిస్తుంది.
హెల్త్ సాథీ(Health sathi)
మహిళ తన ఆరోగ్యం గురించే కాదు, కుటుంబసభ్యుల క్షేమం గురించీ ఆలోచించాలి. ఆ ప్రయత్నంలో సహకరించే అప్లికేషన్ ఇది.