Pearl Millets | ఆరోగ్యంగా ఉండేందుకు గాను పౌష్టికాహారాలను తీసుకోవడం తప్పనిసరి. మనం తినే ఆహారం మనకు పోషకాలను అందించడంతోపాటు శక్తిని కూడా ఇవ్వాలి. అలాగే వ్యాధులను తగ్గించుకునేందుకు కూడా ఉపయోగపడాలి. అప్పుడే మనం తినే పౌష్టికాహారం మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇక అలాంటి పౌష్టికాహారాల్లో సజ్జలు కూడా ఒకటి. ఇవి చిరు ధాన్యాల జాబితాకు చెందుతాయి. వీటినే సిరి ధాన్యాలు అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు ప్రజలు ఎక్కువగా వీటిని తినేవారు. సజ్జలతో పిండి తయారు చేసి రొట్టెలు, జావ వంటివి తయారు చేసి తీసుకునేవారు. కానీ ఆ తరువాత వీటిని తినడం తగ్గించేశారు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ ఆరోగ్యం పట్ల చాలా మందికి శ్రద్ధ పెరుగుతోంది. కనుక మళ్లీ సజ్జలను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక వీటిని తింటే అనేక పోషకాలతోపాటు శక్తి కూడా లభిస్తుంది. పలు వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు. సజ్జలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
సజ్జల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు. పైడా వీటిల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక సజ్జలను తింటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. షుగర్ ఉన్నవారు రోజూ సజ్జలను తింటుంటే షుగర్ వ్యాధిని పూర్తి స్థాయిలో నియంత్రణలో ఉంచుకోవచ్చు. సజ్జలలో మెగ్నిషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించేందుకు సహాయం చేస్తాయి. రక్త నాళాలను ప్రశాంతంగా మార్చి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దీని వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సజ్జల్లో అధికంగా ఉండే ఫైబర్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి.
సజ్జలలో అధికంగా ఉండే ఫైబర్ కారణంగా ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి ఉండదు. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. సజ్జల్లో ప్రోటీన్లు, ఫైబర్ ఉంటాయి కనుక వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు ఎంతో సహాయం చేస్తుంది. సజ్జలలో అధికంగా ఉండే ఐరన్ కారణంగా వీటిని తింటుంటే రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. వీటిల్లో ఉండే ఫాస్ఫరస్ ఎముకల నిర్మాణానికి, మరమ్మత్తులకు సహాయం చేస్తుంది. అలాగే జింక్ వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
సజ్జలలో అనేక రకాల బి విటమిన్లు సైతం అధికంగా ఉంటాయి. వీటిల్లో నియాసిన్, థయామిన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి శక్తి లభించేలా చేస్తాయి. దీంతో శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. నీరసం, అలసట తగ్గుతాయి. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారికి ఎంతో మేలు జరుగుతుంది. కండరాల నొప్పుల నుంచి బయట పడవచ్చు. సజ్జలలో అధికంగా ఉండే ప్రోటీన్ల కారణంగా కండరాలు నిర్మాణం అవుతాయి. కండరాలకు మరమ్మత్తులు జరుగుతాయి. దీంతో దేహం దృఢంగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా సజ్జలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.