శాఖాహారులు ఇష్టంగా తినే వాటిలో ‘పనీర్’ ముందుంటుంది. ‘టోఫు’ కూడా అచ్చం పనీర్‌లాగే ఉంటుంది. కానీ, చాలామందికి ఈ రెండిటి మధ్య తేడాలు సరిగ్గా తెలియదు. మరి.. మీ ఆహార అవసరాలకు ఏదైతే సరిపోతుంది? బరువు తగ్గాలంటే, మధుమేహం అదుపులో ఉండాలంటే.. దేన్ని తీసుకోవాలి? ఆరోగ్యానికి వీటిలో ఏది మంచిది? తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి.
పనీర్.. అచ్చంగా బర్రె, ఆవు పాల నుంచి తయారవుతుంది. ఇందులో క్యాల్షియం, కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అదే.. టోఫును సోయా పాలతో తయారు చేస్తారు. దీనిలో తక్కువ కొవ్వు, ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. ఈ రెండూ దేనికవే ప్రత్యేకమైనవి. దేని ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలు దానికి ఉంటాయి. కాబట్టి, మీ ఆరోగ్య అవసరాలను బట్టి ఎంపిక చేసుకోవడం మంచిది.
ఐరన్: పనీర్‌తో పోలిస్తే టోఫులో ఎక్కువ ఐరన్ ఉంటుంది. 100 గ్రాముల టోఫులో 5.4 మిల్లీ గ్రాముల ఐరన్ లభిస్తుంది. పనీర్‌లో 0.1 మిల్లీ గ్రాములు మాత్రమే ఉంటుంది. కాబట్టి, రక్తహీనతతో బాధపడేవారికి టోఫు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రొటీన్లు: 100 గ్రాముల పనీర్‌లో 18.3 గ్రాముల ప్రొటీన్ ఉన్నట్లు తేలింది. అదే టోఫులో.. 6.9 గ్రాములు మాత్రమే ఉంటుంది. కాబట్టి, జిమ్‌కు వెళ్లేవారు, బరువు పెరగాలని అనుకునేవాళ్లు పనీర్‌ను ఎంపిక చేసుకోవాలి. పనీర్.. కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
కొవ్వు: పనీర్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పనీర్‌లో 20.8 గ్రాముల కొవ్వు లభిస్తుంది. మరోవైపు.. టోఫులో 2.7 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది. కాబట్టి, బరువు తగ్గాలంటే.. టోఫును ఆహారంలో భాగం చేసుకోవాలి. అధిక బరువుతో బాధపడేవాళ్లు.. పనీర్‌ను పక్కన పెట్టేయాలి.
క్యాల్షియం: పనీర్లోనే క్యాల్షియం ఎక్కువగా లభిస్తుంది. 100 గ్రాముల పనీర్ తీసుకుంటే.. శరీరానికి 208 మిల్లీ గ్రాముల క్యాల్షియం అందుతుంది. అదే టోఫులో 130 మిల్లీ గ్రాములు మాత్రమే ఉంటుంది! కాబట్టి, దంతాలు, ఎముకల ఆరోగ్యం కోసం పనీర్‌ను తీసుకోవడం బెటర్.
కార్బోహైడ్రేట్స్: పాలతో తయారైనప్పటికీ.. పనీర్‌లో కార్బోహైడ్రేట్ స్థాయులు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల పనీర్‌లో దాదాపు 1.2 గ్రాముల కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. అదే.. టోఫులో 2.4 గ్రాములు, అంటే పనీర్ కంటే రెట్టింపు కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు పనీర్ మంచి ఎంపిక.
కేలరీలు: 100 గ్రాముల పనీర్‌తో 265 కేలరీలు అందుతాయి. టోఫులో 62 కేలరీలు మాత్రమే లభిస్తాయి. బరువు తగ్గాలని అనుకుంటే.. టోఫును తీసుకోవాలి.
ఫైబర్: జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఫైబర్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇది టోఫులో అధికంగా లభిస్తుంది. అదే సమయంలో కొందరిలో పాల ఉత్పత్తులు పడవు. అలాంటివారికి పనీర్ త్వరగా జీర్ణమవ్వదు. దీన్ని తీసుకుంటే.. కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ లాంటి సమస్యలూ వస్తాయి. కాబట్టి, ఇలాంటి వాళ్లు టోఫును ఎంచుకోవడం మంచిది.