ఆలుమగల మధ్య అలకలు అందమే! వాదోపవాదాలూ.. గిల్లికజ్జాలూ సర్వ సాధారణమే! ఇలా.. గొడవలకు దారితీయని అభిప్రాయబేధాలు మంచివేనట. అవి.. భార్యభర్తల నడుమ బంధాన్ని మరింత బలపరుస్తాయట. అయితే.. ఆ మనస్ఫర్థలను టీ కప్పులో తుఫానులా తేలిపోనివ్వాలి. నివురు గప్పిన నిప్పులా దాచేస్తే.. అసలుకే మోసం వస్తుంది.
ఎంత అన్యోన్యంగా జీవిస్తున్నా.. దంపతులన్నాక ఏదో ఒక విషయంలో మాట పట్టింపులు వస్తుంటాయి. వాదోపవాదాలు, చిన్నచిన్న గొడవలు పడుతుంటారు. అయితే, కొందరు ఇలాంటి గొడవలను మొగ్గలోనే తుంచేసి అనుబంధాలను బలపర్చుకుంటారు. కొందరు మాత్రం.. పెద్దవిగా చేసి బంధాన్ని తెంచేసుకుంటారు. ‘ది హెల్దీ మ్యారేజ్’ డేటా ప్రకారం.. సగటున ప్రతి జంటా నెలకు రెండుమూడు సార్లు గొడవలు పడుతుంటాయట. వీటిలో చాలావరకు.. ముదరకుండా చూసుకుంటూ, అన్యోన్యంగా ఉంటున్నారు. అందుకే, భార్యభర్తల నడుమ తలెత్తే వివాదాలు పరిమితిలోనే ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అప్పుడే.. అపార్థాలన్నీ తొలగిపోతాయని అంటున్నారు.
వాదనకూ, గొడవకూ మధ్య తేడాలను గుర్తించాలి. వాదనలో.. ఏదో ఒక నిర్దిష్ట సమస్యపైనే దృష్టిని కేంద్రీకరిస్తారు. దానిపైనే వాడీవేడీగా చర్చించుకుంటారు. ఒకరు చెప్పేది మరొకరు వింటారు. రాజీపడటం, క్షమాపణలు, వాదనలకు పరిష్కార ప్రయత్నాలూ కనిపిస్తాయి. అదే.. గొడవ పడేవారిలో ఒకరిపై ఒకరికి ప్రతికూల భావనలు ఏర్పడతాయి. అది ఇద్దరి మధ్యా దూరం పెంచుతుంది. మనసు విరిగిపోయేలా చేస్తుంది.
చిన్నచిన్న అభిప్రాయభేదాల వల్ల భాగస్వామి ఇష్టాయిష్టాలు తెలుస్తాయి. అందుకు తగ్గట్టుగా నడుచుకునేందుకు అవకాశం దొరుకుతుంది. అంతేకాకుండా.. వాదనలతోనే ముగిస్తే, రాబోయే రోజుల్లో పెద్ద గొడవలు జరగకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన వాదనలు బంధాన్ని, సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుతాయి.
చిన్న మాటే.. పెద్దపెద్ద గొడవలకు నాంది పలుకుతుంది. కాబట్టి, భాగస్వామితో వాదించేటప్పుడు భాషను అదుపులో పెట్టుకోవాలి. లేకుంటే.. వాదన వివాదానికి దారితీస్తుంది. పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందని గుర్తించుకోండి.
కొందరు పాత విషయాలను మనసులోనే పెట్టుకుంటారు. సందర్భం దొరికితే చాలు పాత సంగతులు తోడుతారు. వాటినే తమ అస్ర్తాలుగా మలుచుకొని.. భాగస్వామిపై ఎదురుదాడికి దిగుతారు. దాంతో గొడవలు తీవ్రరూపం దాలుస్తాయి. కాబట్టి, మీ తాజా వాదన దేనిగురించో.. దానిపైనే నిలబడండి. పాత విషయాలను ఎట్టి పరిస్థితిలోనూ చిన్నచిన్న వివాదాల్లోకి లాగకండి.