ఆధునిక సాంకేతిక యుగంలో పిల్లల పెంపకం సులభమైన ప్రయాణం కాదని అంటున్నారు సద్గురు. ఓవైపు తీరికలేని షెడ్యూల్తో తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. మరోవైపు పెరుగుతున్న స్క్రీన్ టైమ్, అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో పిల్లలు హైపర్ యాక్టివ్గా తయారవుతున్నారు. ఇవన్నీ తల్లిదండ్రులపై లెక్కలేనంత బరువును పెంచుతున్నాయని సద్గురు చెబుతున్నారు. ఈక్రమంలో పిల్లల పెంపకంలో పాటించాల్సిన మూడు ముఖ్యమైన సూచనలను అందిస్తున్నారు.
పిల్లల్ని కాదు.. మిమ్మల్ని మీరే పెంచుకోండి. ఎందుకంటే.. మీరు చెప్పేది పిల్లలు వినరు. వారు మిమ్మల్ని గమనిస్తూనే నేర్చుకుంటారు. అందుకే.. మీ పిల్లలకు మీ సలహా అవసరం లేదు. వారికి మీ ఆదర్శం అవసరం. తల్లిదండ్రులు ఆందోళనలో ఉంటే, నిరాశలో మునిగిపోతే.. పిల్లలూ అలాగే ఉంటారు. ఎందుకంటే.. మీ భావోద్వేగాలు సహజంగానే పిల్లలపైకి వ్యాపిస్తాయి. అందుకే, పిల్లలను సరిదిద్దడానికి ప్రయత్నించే బదులు.. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి.
ప్రతి బిడ్డ తనదైన ప్రత్యేక స్వభావం, తెలివితేటలను కలిగి ఉంటారు. కాబట్టి, వారిని వారిలాగే ఉండనివ్వండి. మీకు నచ్చినట్టుగా మలిచే ప్రయత్నం చేయకండి. బదులుగా.. పిల్లలకు వారి ఆసక్తులను అన్వేషించడానికి, అందులో ఎదగడానికి కావాల్సిన స్వేచ్ఛను అందివ్వండి. వారి సహజ సామర్థ్యం వృద్ధి చెందే వాతావరణాన్ని సృష్టించండి. అప్పుడే, వారు ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది.
విజయం కన్నా.. ఆనందమే మిన్న అనే సత్యాన్ని గ్రహించండి. చదువుల్లో గ్రేడ్లు, ఆటల్లో ట్రోఫీలు కాదు ముఖ్యం. అంతర్గత ఆనందంలోనే అసలైన విజయం దాగి ఉంటుంది. ఎందుకంటే, ఒత్తిడితో కూడిన మనసు కన్నా.. ఆనందకరమైన మనసే చాలా సృజనాత్మకంగా ఉంటుంది. కాబట్టి, పిల్లలు ఎప్పుడూ సంతోషంగా, ఉత్సాహంగా ఉండేలా చూడండి. అలాంటి పిల్లలే జీవితంలో బాగా రాణిస్తారు. విజయాన్ని మార్కులతో కొలవడానికి బదులుగా, ఉత్సుకత, భావోద్వేగ మేధస్సును పెంపొందేలా చూసుకోండి.