ఈ ప్రపంచంలో ఓటమిని మించిన గురువు లేడంటారు. పరాజయాన్ని సోపానంగా మలుచుకుంటే ఎన్నటికైనా విజయం సాధించొచ్చు. వీళ్లంతా ‘ఫెయిల్యూర్ గురూ’ నుంచి స్ఫూర్తి పొందిన వారే. మన తెలుగు రాష్ర్టాలకు ఐపీఎస్‌లుగా సెలెక్ట్ అయినవారే! ఇటీవల శిక్షణ పూర్తి చేసుకొని.. పాసింగ్ అవుట్ పరేడ్‌కు సిద్ధమవుతున్నారు. ఒకరిది మొక్కవోని ‘దీక్ష’.. మరొకరిది వెన్నుచూపని ‘సంకల్పం’.. అమ్మకోసం ఇంకొకరు.. నాన్న ఆశయ సాధనకు మరొకరు.. సెల్యూట్ చేయించుకునే స్థాయికి చేరుకున్నారు. తొలి ప్రయత్నంలో విఫలమైనా.. పట్టుదలతో ప్రయత్నించి ఐపీఎస్ సాధించారు.
నాన్న కోరిక నేను నెరవేర్చా..
ఉత్తర్‌ప్రదేశ్ ఉరుము వసుంధరా యాదవ్. ఇంజినీరింగ్ చేసిన ఈ ఫిరంగి.. తెలంగాణ క్యాడర్ సివంగి. ఐదుసార్లు విఫలమైనా అలుపెరగకుండా ఆరోసారి తన సత్తా చాటిన వసుంధర కథ ఆమె మాటల్లోనే…
మాది ఉత్తర్‌ప్రదేశ్. నాన్న ఫరూబీ యాదవ్. మాకు సొంతంగా వ్యాపారం ఉంది. మేము మొత్తం నలుగురు సంతానం. అన్నయ్య వ్యాపారం చేస్తున్నాడు. అక్క డాక్టర్. తమ్ముడు ఎల్ఎల్బీ చదువుతున్నాడు. చిన్నప్పటినుంచి పోలీసు అవ్వాలన్నది మా నాన్న కోరిక. కానీ, కుటుంబ పరిస్థితుల కారణంగా ఆయన వ్యాపారిగా స్థిరపడాల్సి వచ్చింది.
అందుకే నాన్న నన్ను ఐపీఎస్‌గా చూడాలనుకున్నారు. నాన్న కోరిక నెరవేర్చాలని నేను ఫిక్సయ్యాను. నాన్న, అన్నయ్య ఎంతో ప్రోత్సహించారు. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ తర్వాత నా దృష్టంతా ఐపీఎస్ ప్రిపేర్ అవడంపైనే పెట్టాను. కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నాను. కొంత సొంతంగా ప్రిపేర్ అయ్యాను. ఐదుసార్లు విఫలమయ్యాను. అయినా పట్టు వదల్లేదు. చివరిగా ఆరో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. ఓడిన ప్రతీసారి.. కొత్తపాఠం నేర్చుకున్నాను. చేసిన తప్పు మళ్లీ చేయకుండా.. ప్రతి దశలోనూ మరింత కష్టపడ్డాను. ఐపీఎస్ అయ్యి నాన్న కల నెరవేర్చాను. ఓ కూతురిగా ఇంతకంటే గొప్ప అనుభూతి ఇంకేం ఉంటుంది. ఈ ప్రయాణంలో మా ఆయన కూడా అండగా నిలిచారు. ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగిగానే ప్రజలకు సేవ చేస్తున్నారు.
తెలంగాణ సంస్కృతి అంటే ఇష్టం..
నాకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల చాలా అవగాహన ఉంది. ఇక్కడ మరింత నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. హైదరాబాద్ బెస్ట్ మెట్రోపాలిటిన్ సిటీ. చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ విభిన్న సంస్కృతుల వారు జీవిస్తున్నారు. పెద్దపెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేశారు. దేశంలో తెలంగాణ అంటే మంచి పేరుంది. అట్లాంటి రాష్ర్టానికి నన్ను కేటాయించడం ఆనందంగా ఉంది. ఇక్కడి సంస్కృతులు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. తెలుగు కూడా నేర్చుకుంటున్నా. మా ట్రైనీలతో తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. త్వరలోనే పూర్తిస్థాయి తెలుగు అమ్మాయిలా కనిపిస్తా. పాత చట్టాలు, కొత్త క్రిమినల్ చట్టాలపై మాకు చక్కని శిక్షణ ఇచ్చారు. వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పడింది.
ప్రస్తుతం తెలంగాణలో సమర్థులైన మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. ముగ్గురు డీజీపీ ర్యాంకు సైతం పొందారు. ఆడపిల్లలు ఎవరైనా ఐపీఎస్ వైపు రావాలనుకుంటే తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పిల్లల కష్టాన్ని గౌరవించాలి. ఆ కష్టం ఎప్పుడూ వృథాపోదు.. తప్పకుండా ఫలితాన్ని పొందుతారు. ఇది నేను నేర్చుకున్న సత్యం. సైబర్ నేరాలు తెలంగాణలో ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిని నియంత్రించడంలో నావంతు పాత్ర పోషిస్తా. సైబర్ క్రైమ్స్ నివారణకు మాకందరికీ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. డ్రగ్స్ నియంత్రణకు కూడా నా ప్రణాళికలు అమలు చేస్తా.
కిరణ్‌బేడీ నాకు ఆదర్శం..
మాది హర్యాన. ఢిల్లీ జేఎన్‌యూలో మాస్టర్స్ చేశాను. గతంలో నేను ఐపీఎస్‌కు సెలెక్ట్ అయ్యాను. కానీ మంచి కేడర్ రాలేదు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్‌గా పనిచేశాను. అంతకుముందు ఢిల్లీ పోలీసు విభాగంలో ఏసీపీగా నాలుగేండ్లు పనిచేశాను. కొన్ని ప్రయత్నాల తర్వాత ఐపీఎస్‌కు ఎంపికై, మంచి కేడర్ సాధించాను. ఇక్కడ హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నా. ఐపీఎస్ రావడం కోసం దాదాపు నాలుగేండ్లుగా కష్టపడుతూనే ఉన్నాను. అన్ని ప్రయత్నాల్లో నా బెస్ట్ ఇచ్చాను. ఒక భార్యగా, తల్లిగా, కుటుంబాన్ని చూసుకునే గృహిణిగా.. అన్ని పాత్రలూ పోషించాను. ఐపీఎస్ శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది.
ఇండోర్, అవుట్డోర్లలో చెమటోడ్చితేనే ఈస్థాయికి రాగలిగాను. నాకు ఫిట్‌నెస్‌పై అవగాహన ఉండటం, అప్పటికే నేను పోలీసు ఉద్యోగం చేసి ఉండటంతో నాకు శిక్షణ సులభమైంది. గ్రేహౌండ్స్ ట్రైనింగ్‌లోనూ నా బెస్ట్ ఇచ్చాను. మా ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్. ఢిల్లీలోని ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నేను కుటుంబానికి పెద్దదాన్ని. నా తోబుట్టువులు ఇంకా చదువుతున్నారు. వాళ్లకు కూడా సివిల్ సర్వెంట్స్ అవ్వాలని కోరిక. మా అమ్మ ప్రొఫెసర్. నాన్న హర్యానాలో డీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. నేను సివిల్స్ వైపు రావడానికి కిరణ్‌బేడీ మేడమ్‌ను ఆదర్శంగా తీసుకున్నా. నా చిన్నప్పుడు మా స్కూల్‌కు ఒకసారి కిరణ్‌బేడీ మేడమ్ వచ్చి.. మాలో స్ఫూర్తి నింపారు. ఎలాగైనా ఐపీఎస్ సాధించాలని అప్పుడే అనుకున్నా. మొత్తానికి సాధించా. ప్రస్తుతం నాకు ఆంధ్రప్రదేశ్ కేడర్ కేటాయించారు. దక్షిణాది ప్రజలు చాలా ప్రేమ పూర్వకంగా ఉంటారు. వారికి సేవ చేయడం గొప్పగా భావిస్తున్నా.
– దీక్ష, ఆంధ్రప్రదేశ్ కేడర్
మనవాళ్లకుసేవ చేసే భాగ్యం..
మాది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మహానంది. ప్రాథమిక విద్య నంద్యాలలో జరిగింది. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తిచేశాను. 2019లో బీఏ హిస్టరీ పూర్తయింది. 2020లో ఐపీఎస్ కోసం మొదటి ప్రయత్నం చేశాను కానీ లక్ష్యం చేరుకోలేదు. 2021లో ఐపీఎస్ సాధించాను. నాన్న వంగల సర్వేశ్వర రెడ్డి వ్యవసాయదారుడు. అమ్మ మల్లీశ్వరి. మా గ్రామంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. కొన్ని అసమానతలను కండ్లారా చూశాను. వాటిని రూపుమాపాలని నాకు చిన్నప్పట్నుంచే ఉండేది. సామాజిక రుగ్మతలు రూపుమాపాలంటే.. అధికారం చేతిలో ఉండాలి.
అందుకే ఐపీఎస్ అవ్వాలనుకున్నా. శిక్షణలో చాలా కష్టపడ్డాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమించాను. శిక్షణలో చట్టాలపై పూర్తి అవగాహన వచ్చింది. వాటి ఫలాలను పేదలకు అందించాలన్నది నా సంకల్పం. ఐపీఎస్‌గా మా రాష్ర్టానికే వెళ్లడం ఆనందంగా ఉంది. నా ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం దక్కింది. ఎందుకంటే ఏపీలో పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. వాటిని ఎలా అధిగమించాలో కూడా నాకొక అవగాహన ఉంది. నేరాలను అరికట్టడంలో నావంతు పాత్ర, నా మార్క్ కచ్చితంగా కనిస్తుంది.
– మనీషా రెడ్డి వంగల, ఆంధ్రప్రదేశ్ కేడర్
చెల్లి ఐఏఎస్.. నేను ఐపీఎస్..
మాది తమిళనాడులోని కడలూరు. నాన్న వ్యవసాయం చేస్తారు. అమ్మ రాష్ట్ర విద్యాశాఖలో పని చేస్తున్నది. మా చెల్లెలు 2020 బ్యాచ్ ఐఏఎస్. ప్రస్తుతం తమిళనాడు కేడర్ ఐఏఎస్‌గా ఉంది. తనే నాకు స్ఫూర్తి. ఇద్దరం కలిసే ప్రిపరేషన్ మొదలుపెట్టాం. మొదటి ప్రయత్నంలో చెల్లికి రైల్వే జాబ్ వచ్చింది, కానీ వద్దనుకుంది. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించింది. ఆ స్ఫూర్తితోనే నేను సీరియస్‌గా చదివాను. ఆరో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. నేను బీఈ అగ్రికల్చర్, ఇరిగేషన్ ఇంజినీరింగ్ చదివాను. మా అమ్మకు సివిల్ సర్వెంట్ కావాలని చాలా కోరిక.
తాను సివిల్స్ చాలాసార్లు ప్రయత్నించింది. అయినా సాధించలేకపోయింది. ఆ కోరికను మా ద్వారా నెరవేర్చుకున్నది. మాకు చక్కగా గైడెన్స్ ఇచ్చేది. మా కాలేజ్ చదువులు పూర్తయిన వెంటనే సివిల్స్‌పై దృష్టిపెట్టాం. మేమిద్దరం సివిల్స్ సాధించడం పట్ల మా అమ్మానాన్నలు చాలా గర్వపడుతున్నారు. ఇక శిక్షణలో చాలా కష్టపడ్డాం. పురుషులతోపాటు 15 కేజీల బరువు వేసుకొని 40 కిలోమీటర్లు నడిచేవాళ్లం. 16 కిలోమీటర్లు పరుగులు తీసేవాళ్లం. 2023 నవంబర్‌లో మొదలైన మా శిక్షణ.. నేటికి విజయవంతంగా పూర్తయింది. గ్రేహౌండ్స్, సీఎస్‌డబ్ల్యూ, ఐటీబీపీ వంటి సంస్థల్లో శిక్షణ తీసుకున్నాం. ఈ ట్రైనింగ్‌తో మాకు విశ్వాసం పెరిగింది.
– సుష్మిత రామనాథ్, ఆంధ్రప్రదేశ్ కేడర్
…? రవికుమార్ తోటపల్లి
ఉప్పరి శివకుమార్