దీపావళి అంటేనే వెలుగుల పండుగ. జిలుగు రవ్వల్ని వాకిలి ముందు వరుసలుగా పేర్చి సంబురం చేసుకుంటాం. ఇంటా బయటా కాంతులు విరజిమ్మాలని కోరుకుంటాం. మట్టి ప్రమిదలతోనే కాదు విద్యుద్దీపాలతోనూ ఇంటిని అలంకరిస్తాం.
అలాంటి లైట్ల వరుసలు ఇప్పుడు కొంగొత్త రూపాల్లో ముస్తాబవుతున్నాయి. ఆకుపచ్చని ఆకులతో పాటు వెలుగుల లతలు వేలాడదీసినట్లుండేలా తయారవుతున్నాయి. చక్కని ఇంటికి చుక్కల తోరణం కట్టినట్టు కనిపించడం వీటి ప్రత్యేకత.
ముఖమైనా ఇల్లయినా… కాంతులీనితే బాగుంటుంది! దీపావళి వేడుకలో ఈ రెండిటికీ చోటు ఉంటుంది. పండుగ వేళ మనమెంత ముస్తాబు అవుతామో అంతే స్థాయిలో ఇంటినీ అలంకరించే ప్రత్యేక పర్వదినం దీపావళి. మూడు రోజుల ఈ పండుగ మొదలు కార్తిక మాసం అయ్యేదాకా ఇంటి ముందు నిత్యం దివ్వెలు వెలుగుతూనే ఉంటాయి. నెలంతా ఆ శోభ నెలకొంటుంది. అందుకే రంగురంగుల లైట్ల వరుసతో ఇంటి ముస్తాబు చేసుకుంటాం. సాధారణంగా మనకు ఈ తరహాలో ఎల్ఈడీ బల్బుల మాలలు వస్తుంటాయి. అయితే ఇప్పుడు అవే లైట్లు, చెట్ల తీగలను పోలిన పచ్చని ఆకుల వరుసలతోపాటు వస్తున్నాయి. ‘ఆర్టిఫీషియల్ లీఫ్ కర్టెన్ ఎల్ఈడీ లైట్స్’ పేరుతో ఎన్నో వెరైటీల్లో తయారవుతున్న ఇవి రాత్రే కాదు, పగటి పూటా ఇంటికి కొత్త అందాన్ని తెస్తున్నాయి.
వెరైటీలు…
అచ్చంగా నిజమైన చెట్ల లతల్లా కనిపించే ఈ లీఫ్ కర్టెన్ లైట్లలో రకరకాలు దొరుకుతున్నాయి. మనీప్లాంట్, ఐవి, మేపుల్ …ఇలా వివిధ చెట్ల ఆకులను పోలి ఇవి తయారవుతున్నాయి. కాబట్టి మన అభిరుచిని బట్టి ఇంటి సాధారణ అలంకరణకూ వీటిని వాడుకోవచ్చు. ఈ తీగలకు పూలు పూసినట్టు ఉన్నవీ దొరుకుతున్నాయి. పొద్దుతిరుగుడు, గులాబీల్లాంటి పుష్పాలు ఈ రకం లతలకు విచ్చుకుంటున్నాయి. కాబట్టి, దీపావళి ప్రత్యేకంగా ఇంటి బయట మాత్రమే కాదు హాలులోనో, లివింగ్ రూమ్‌లోనో కూడా ఈ విద్యుల్లతలను వేలాడదీయవచ్చు. దీంతో రాత్రిపూటే కాదు, పగటిపూటా ఇంటిని అందంగా కనిపించేలా చేయొచ్చు. ఇక, ఈ అందానికి వెలుగులు జోడించడం మన ఇష్టం. వీటితోపాటు వచ్చే రిమోట్ సాయంతో లైట్లను కాంతిమంతంగా లేదా డిమ్‌గా వెలిగేలా పెట్టుకోవచ్చు. చుక్కల్లా వెలిగి ఆరేలా, లేదా వరుసలో పరుగులు తీసేలా… రకరకాలుగా మోడ్లూ సెట్ చేసుకోవచ్చు. విద్యుత్తుతో పాటు బ్యాటరీ, సోలార్‌తో పనిచేసేవీ వీటిలో వస్తున్నాయి. ఇంకేం, నచ్చినవి తీసుకొని ఈ దీపావళికి అలంకరణకు రెండింతల అందాన్ని తెచ్చేయండి!