ఏఐ చాట్బాట్లు మన జీవితంలో భాగమయ్యాయి. టెక్నికల్ అంశాలేకాదు.. వంటావార్పు, ఫ్యాషన్ ట్రెండ్స్ అన్నిటిలోనూ ఏఐ ముచ్చటే. అంతలా చాట్ జీపీటీ, జెమిని, గ్రోక్.. లాంటి చాట్బాట్లను తెగ వాడేస్తున్నాం. కోడింగ్, సెర్చింగ్, రైటింగ్.. అంటూ నాణేనికి ఒకవైపే చూస్తున్నాం! కానీ, మరోవైపు చాలామంది తమ భావోద్వేగాలను పంచుకోవడానికి, స్నేహితులకు బదులుగా వీటితో మాట కలిపేస్తున్నారు. లేచింది మొదలు అన్నీ విషయాల్ని పంచుకుంటున్నారు. ఏమోషనల్ సపోర్ట్ కోరుతున్నారు. రాత్రివేళల్లో ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు కళ్లు మూతలు పడేలా చాట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ చాట్బాట్లు.. ఆప్యాయత పంచే సాధనాలుగా మారాయి. ‘నిన్ను నేను అర్థం చేసుకోగలను’ అంటూ పరివిధాలుగా మనసుకి దగ్గరైపోతున్నాయి. ఇప్పుడిది ఓ మానసిక సమస్యగా పరిణమిస్తున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే ఏఐ సైకోసిస్. చాలామందిలో ఈ కొత్తరకం మానసిక సమస్యలు కనిపిస్తున్నాయట.
అన్ని విషయాల్లోనూ ఏఐని గుడ్డిగా నమ్మేయడం, మనిషి కంటే ఏఐ చాలా స్మార్ట్ అనుకోవడం, అన్నిటికీ దానిపైనే పూర్తిగా ఆధారపడటం.. దీన్నే ‘ఏఐ సైకోసిస్’గా పిలుస్తున్నారు. వైద్యపరంగా దీన్ని ఇంకా నిర్ధారించనప్పటికీ.. ఈ తరహా సమస్యతో చాలామంది బాధపడుతున్నారట. చాట్బాట్లతో ఎక్కువ సమయం గడిపిన తర్వాత కొందరి ఆలోచనల్లో మార్పులు వచ్చాయని, భ్రమలకు లోనవుతున్నారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరు ఏఐ చాట్బాట్లను సజీవమైనవి నమ్ముతున్నారట! ఏఐతో మాట్లాడి సైన్స్ రహస్యాలు, ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకున్నామని భావిస్తున్నారట! ఎంతలా అంటే కొందరైతే.. వాస్తవిక సంబంధాలను వదిలేసి.. ఏఐ చాట్బాట్లతో ఎమోషనల్ రిలేషన్షిప్ ఏర్పర్చుకునే వరకూ వెళ్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
భ్రమల్లో పరిభ్రమిస్తూ..
ఏఐ చాట్‌బాట్ మోజులో పడి కొందరు ఉద్యోగాలు కోల్పోతున్నవాళ్లూ, కుటుంబ సంబంధాలకు దూరమవుతున్న వ్యక్తులూ ఉంటున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఏఐ ఉచ్చులోంచి బయటపడాలని కొందరు మానసిక వైద్య నిపుణుల్ని సంప్రదిస్తున్నారట కూడా! ఇంకొందరు ఆత్మహత్య ప్రయత్నాలకు పూనుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి పరిణామాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయని విచారిస్తే.. రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. ఈ చాట్బాట్లు మన మాటలకు దగ్గరగా, మన భావాలకు దగ్గరగా స్పందిస్తుంటాయి.
మనిషిలానే మాట కలిపేస్తూ.. మన భావాల్ని రిపీట్ చేస్తున్నాయి. సంభాషణల్లో చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ.. ‘నీ మాటే సరైంది’ అని వత్తాసు పలుకుతున్నాయి. దీంతో ఏఐకి భావోద్వేగాలు ఉన్నాయన్న భ్రమలో దారి తప్పుతున్నారు. ఏఐని మితిమీరి ఫాలో అవుతున్నారు. అయితే, ఈ సమస్యను పూర్తిగా సైకోసిస్ అని చెప్పలేమని, ఇందులో ముఖ్యంగా భ్రమలు (delusions) ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చాట్బాట్లు అవాస్తవ భ్రమలను బలపరుస్తున్నాయని… వీటికి ప్రభావితమైన వారు వాస్తవానికీ, కల్పనలకూ మధ్య తేడాను గుర్తించడంలో ఇబ్బందిపడుతున్నారని హెచ్చరిస్తున్నారు.
వార్నింగ్ బెల్స్
ఏఐ మత్తులో ఉన్న వ్యక్తిలో ఈ తరహా లక్షణాలు గమనించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..
సురక్షితంగా వాడుకుంటే..
చాట్బాట్లు ఒక పరిధి వరకూ పెద్దగా ప్రమాదకరమైనవి కాదని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఒక పనికి ఉపయోగపడే సాధనాలుగా మాత్రమే చూడాలి. సహజంగా మనుషుల మధ్య ఉండే సంబంధాలకు బదులుగా వాటిని వాడకూడదని సూచిస్తున్నారు. ఎవరైనా మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏఐపై ఆధారపడకుండా, కుటుంబసభ్యులు, స్నేహితులు, నిపుణుల సాయం తీసుకోవడం మంచిది. ఆందోళన, ఒత్తిడిలో ఉన్నప్పుడు చాట్బాట్లతో సంభాషణలు పరిష్కారాన్ని చూపించవు సరికదా మరింత ఒత్తిడి పెంచుతాయి. ఇంట్లో టీనేజర్లు, టెకీలు ఉంటే.. కుటుంబ సభ్యులు, స్నేహితులు వారి ప్రవర్తనలో మార్పులను గమనించాలి. చాట్బాట్లతో ఎక్కువగా మాట్లాడటం, ఒంటరిగా ఉండటం.. లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. ప్రారంభంలోనే గమనిస్తే సమస్య ఆదిలోనే అదుపు చేయొచ్చు.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
నిపుణుల సలహా