అదేదో సినిమాలో ‘అప్పు-డే’ తెల్లారిందా అని సగర్వంగా పలుకుతాడు కథానాయకుడు. చచ్చినా అప్పు తీర్చొద్దనీ, వాయిదా వేయమనీ తప్పుదారి పట్టిస్తాడు. ‘అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా’ పాటను నీతిసూత్రంగా భావించిన వారికి ఈ ఉపదేశం వర్తిస్తుందేమో కానీ, సగటు మనిషికి కాదు! రుణపాశం యమపాశం కన్నా డేంజర్. అది అనుభవంలోకి వచ్చినప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది.
అవసరానికి అప్పు చేయడం తప్పు కాదనీ, తద్వారా తక్షణ ముప్పు తప్పించుకోవచ్చని కొందరి నమ్మకం. కానీ, పతారాకు మించి రుణాలు చేస్తే.. జీవితం అతాపతా లేకుండా పోతుంది. ఆ పీడ వీడాలంటే ఏండ్లు పట్టొచ్చు. ఒక్కోసారి జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి రావొచ్చు. రుణగ్రస్తుడిగా మిగిలిపోవద్దంటే.. చిన్న అప్పును కూడా ముప్పుగానే భావించాలి. ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే గోరంత అప్పు కూడా కొండంత కీడుకు దారితీస్తుంది. కన్నవారితో, కట్టుకున్నవారితో తప్ప మరెవరితో రుణానుబంధం లేకుండా జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వ్యక్తే ఉన్నతుడు అనిపించుకుంటాడు!
అరకొర వేతనాలతో బతుకీడ్చే సగటు మనిషికి అప్పు చేయకుండా జీవితం చెల్లుబాటు కాదన్నది సత్యం. బతకడానికి ‘అప్పిచ్చువాడు…’ ఉన్న ఊరినే ఎంచుకోవాలని సుమతీ శతకకారుడి తీర్మానం మనకు తెలిసిందే! పెద్దల మాటలు, మన అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే అప్పు చేయడం తప్పు కాదు. కానీ, తీర్చే మార్గం తెలియనప్పుడు చిన్న అప్పు కూడా పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది. ఉన్నదాంట్లో ఉన్నతంగా బతకడం అలవాటు చేసుకుంటే.. అప్పు చేయాల్సిన పరిస్థితే రాదు. నెలలో మొదటి వారం దర్జాగా బతికితే.. నెలాఖర్లో డీలాపడే దుస్థితీ దాపురించదు. సరైన ఆర్థిక విధానాలు పాటిస్తే.. ఉత్తి పుణ్యానికే చేబదుళ్లకు చుట్టూ చూడాల్సిన అవసరం రాదు.
సాధారణంగా సరైన ఆర్థిక విధానాలు పాటించని వ్యక్తులే అప్పుల పాలవుతుంటారు. ఏమిటా సరైన విధానాలు అంటే.. ఒక్కో వ్యక్తికీ ఒక్కో సూత్రం వర్తిస్తుంది. కుటుంబ బాధ్యతలు, వచ్చే ఆదాయం, అయ్యే ఖర్చులు, భవిష్యత్ అవసరాలు ఇవన్నీ… మనిషి ఆర్థిక శక్తిని ప్రభావితం చేస్తాయి. స్థిరాస్తులు ఉన్నవారికి ఒక సూత్రం వర్తిస్తుంది. జోడు ఆదాయాలు ఉన్నవారికి వేరే ఫార్ములా పనిచేస్తుంది. ఏ రకం మనుషులకైనా వర్తించే సూత్రం ఒకటుంది! ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే… అప్పులపాలు కావడం ఖాయం! వాటిని తీర్చే క్రమంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిందలు మోయాల్సి రావడం ఖాయం.
మొదట్లో మీ పరపతి, ఆస్తిపాస్తులు చూసి వెంటపడి మరీ అప్పులు ఇచ్చినవాళ్లు.. మీ పరిస్థితి కాస్త తేడాగా మారిందని తెలిసిన మరుక్షణం నుంచి జలగల్లా పట్టుకొని వేధిస్తారు. సూటిపోటి మాటలతో మనసును గాయపరుస్తారు. పెదవులతో నవ్వి నొసటితో వెక్కిరిస్తారు. అప్పుల కుప్పలో కూరుకుపోయాక.. అయినవాళ్లు కూడా పరాయివాళ్లలా వ్యవహరిస్తారు. ఇంటి నిర్మాణానికో, కూతురు పెండ్లికో, అనారోగ్య సమస్య తలెత్తినప్పుడో అప్పు చేయాల్సి రావొచ్చు. అప్పుడు మాత్రం ఎందుకు రుణం తీసుకోవాలి. కాస్త ప్రణాళికా బద్ధంగా వ్యవహిరిస్తే.. ఎవరి ముందూ చేయి జాపకుండానే, బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించవచ్చు.
కష్టాలు కొని తెచ్చుకోవద్దు
అప్పు చేయడం మినహా మరోమార్గం లేదన్నప్పుడు బ్యాంకులో రుణం తీసుకోవడం శ్రేయస్కరం. బ్యాంకులు రుణగ్రహీత ఆదాయ, వ్యయాలు పరిశీలించి, సిబిల్ స్కోర్‌ను అనుసరించి రుణ పరిమితిని నిర్ణయిస్తాయి. అంటే, ‘ఇంత మొత్తం అప్పు రుణగ్రహీత కట్టగలడు’ అని పరోక్షంగా ధ్రువీకరించటం అన్నమాట. బ్యాంకు నిర్దేశించిన మొత్తం రుణం పొందడం భారంగా పరిణమించదు. అయితే, రెండుమూడు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడం, ఇన్స్టంట్ లోన్ యాప్స్ ద్వారా అప్పులు తీసుకోవడం మొదలుపెడితే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే! బ్యాంక్ రుణంతోపాటు ప్రైవేట్ వ్యక్తుల దగ్గరా ఎక్కువ వడ్డీకి అప్పు చేసే స్థాయికి చేరుకోవడం అంటే సదరు వ్యక్తి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని అంచనాకు రావచ్చు.
బ్యాంకులోన్ అందరికీ రాకపోవచ్చు. అలాంటివారు ప్రైవేట్ వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తుంది. అయినవారి మధ్యే ఆర్థికాంశాలు చిచ్చుపెడుతున్న ఈ రోజుల్లో.. బయటివ్యక్తి దగ్గర రుణాలు తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదని గమనించాలి. ఇక ఫేక్ లోన్ యాప్స్ సంగతి సరేసరి! రోజువారీగా వడ్డీలు వసూలు చేస్తూ… ఎందరి బతుకులనో బుగ్గి పాలు చేస్తున్నాయి. ఇలాంటి యాప్స్ జోలికి వెళ్లడం అంటే.. జీవితాన్ని నరకం చేసుకోవడమే!!
పది సూత్రాలు
ఉగాది పంచాంగంలో ఆదాయం అధికంగా ఉండి, వ్యయం తక్కువగా ఉంటే మురిసిపోతుంటారు. వ్యయం అధికంగా ఉండి, ఆదాయం బెత్తెడు ఉంటే బెంబేలెత్తిపోతారు. ఆదాయం ఎంతన్నది కాదు.. అంతకు మించి వ్యయం లేకుండా చూసుకుంటే ఆర్థికంగా బుద్ధి జీవి అనిపించుకోవచ్చు. ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తే మధ్యతరగతి జీవి అప్పుల జోలికి వెళ్లాల్సిన అవసరమే రాదు! ఊహించని ఉపద్రవాలు వస్తే తప్ప… ఉన్నదాంట్లోనే ఖర్చులు పోను పొదుపు, మదుపు ఇవన్నీ సాధ్యమే! ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఈ సూత్రాలు పాటించి చూడండి..
1. ఇంటి బడ్జెట్
50/30/20 ఫార్ములా. మీ ఆదాయంలో 50 fశాతం గృహ అవసరాలకు (ఇల్లు, బిల్లులు, పిల్లల ఖర్చులు వగైరా), 30% కోరికలకు (వినోదం, షాపింగ్), 20% పొదుపు, రుణ చెల్లింపులు.
మీ ఆదాయాన్ని ఈ సూత్రానికి అన్వయించుకోండి. ఇప్పటికే అప్పులు ఉంటే.. 30 శాతం కోరికల ఖర్చులు రుణ విముక్తికి కేటాయించండి. నెలవారీగా సమీక్షించి, నాలుగు నెలల తర్వాత అవసరమైన సర్దుబాట్లు చేసుకోండి.
2. అత్యవసర నిధి
ఉన్నపళంగా ఉద్యోగం పోతే.. ఎలా? అన్ని రంగాల్లోనూ ఏఐ దూసుకొస్తున్న వేళ.. ఏ ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితి. ఆఫీస్‌లో అలాంటి వాతావరణం కనిపిస్తున్నా.. చాలామంది ‘మనవరకు వచ్చినప్పుడు చూసుకుందాం లే!’ అన్న ధోరణిలో ఉంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అత్యవసర నిధి అత్యావశ్యకం. కనీసం 3-6 నెలలపాటు మీకయ్యే ఖర్చులకు సరిపడా నిధిని సమకూర్చుకోవాలి. ఆ మొత్తాన్ని తెలిసిన వ్యక్తులకు అప్పుగా ఇవ్వకుండా.. నమ్మకమైన సంస్థల్లో ఇన్వెస్ట్ చేసినా మంచిదే! ఈ నిధిని సులభంగా యాక్సెస్ చేసేలా బ్యాంకులో సేవింగ్స్ ఖాతాలోనో, ఎఫ్డీ రూపంలో ఉంచితే మరి మంచిది.
3. రుణభారం తగ్గించుకోండి..
అధిక వడ్డీ ఉన్న రుణాలు, ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లులు ముందుగా చెల్లించాలి. ‘స్నోబాల్’ (చిన్న రుణాలను ముందుగా క్లియర్ చేయడం) లేదా ‘అవలాంచ్’ (అధిక వడ్డీ రుణాలను ముందు క్లియర్ చేయడం) పద్ధతులను ఉపయోగించాలి. అనవసరమైన రుణాలను నివారించాలి. ఇప్పటికే నాలుగైదు క్రెడిట్ కార్డులు ఉంటే.. వాటిని రెండిటికి తగ్గించుకోండి.
4. పొదుపు-మదుపు
చెల్లించాల్సిన రుణాలు ఉన్నప్పుడు.. ఈ సూత్రం వర్తించదు. అప్పులు తీర్చడమే పొదుపు, వడ్డీలు వదిలించుకోవడమే మదుపు! కాస్త స్థిమితపడిన తర్వాత ఆదాయంలో కనీసం 10-20 శాతం పొదుపు చేయాలి. అందులో యాభై శాతం మదుపు (ఇన్వెస్ట్) చేయాలి. మదుపు చేసే మొత్తాన్ని రిటైర్మెంట్ ఫండ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇలా రకరకాల రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ మరో విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ పెట్టుబడి అంతా ఒకే చోట ఉండకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు ఒక ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారని అనుకుందాం.. అందులో రెండు లక్షలు బంగారం మీద, మరో లక్ష మ్యూచువల్‌ఫండ్స్‌కు, ఇంకో రెండు లక్షలు రిటైర్మెంట్ ఫండ్‌కు కేటాయించాలి. దీనివల్ల ఒకచోట రిస్క్ తలెత్తినా.. మరోచోట లబ్ధి చేకూరితే… బ్యాలెన్స్ అవుతుంది.
5. లక్ష్యాలను నిర్దేశించుకోండి..
ఆర్థికంగా కుదేలు కావొద్దంటే.. స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. వాటిని స్వల్పకాలిక (1-3 సంవత్సరాలు), దీర్ఘకాలిక (5+ సంవత్సరాలు) లక్ష్యాలుగా సెట్ చేసుకోవాలి. వాటిని నెరవేర్చుకునే దిశగా శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి. ఇంకా చెప్పాలంటే స్మార్ట్‌గా ఆలోచించాలి. SMART (Specific, Measurable, Achievable, Relevant, Time-bound) లక్ష్యాలను రూపొందించుకోవాలన్నమాట.
6. చిట్టాపద్దు తప్పొద్దు
మీ ఆదాయంలో ప్రతి రూపాయి ఎక్కడికి వెళుతుందో నిశితంగా గమనించాలి. నోటి లెక్కలు కాకుండా.. నోటుబుక్కులో రాసుకోవాలి. రోజువారీ ఖర్చులు దేనికి ఎంత అయ్యిందో స్పష్టంగా రాయాలి. ఇందుకోసం బడ్జెటింగ్ యాప్‌లు (Money control, Walnut) గానీ, స్ప్రెడ్షీట్లను గానీ ఉపయోగించండి. ఈ ఖర్చులు రాసే క్రమంలో ఎక్కడ చిట్టా దారి తప్పుతున్నదో ఇట్టే తెలిసిపోతుంది. ఆ అనవసరమైన ఖర్చులను నియంత్రించగలిగితే బడ్జెట్ మీ కంట్రోల్లోకి వస్తుంది.
7. ఆర్థిక పాఠాలు తప్పనిసరి
ఖర్చుల కన్నా ఆదాయం అధికంగా ఉన్నా.. కొందరు ఆర్థికంగా విజయం సాధించలేరు. ఎన్నేండ్లు అయినా వారి జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. అందుకు కారణం.. ఆర్థిక అంశాలపై అవగాహన లేకుపోవడమే! ఆర్థిక నిర్వహణ, పెట్టుబడులు, ట్యాక్స్ ప్లానింగ్ తదితర అంశాలపై లోతుగా కాకపోయినా.. కనీస పరిజ్ఞానమైనా ఉండాలి. ఇందుకోసం పుస్తకాలు చదవడం మంచిది. ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకున్నా మంచిదే! ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవడమూ ముఖ్యమే!!
8. బీమాతో ధీమా
ఒక మధ్యతరగతి మానవుడు నిరుపేదగా మారడానికి ఒక్క దవాఖాన బిల్లు చాలు! ఆదాయం, అప్పులు ఈ సంగతులన్నీ పక్కనపెట్టి సగటు వేతన జీవి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. వాహన బీమా కూడా అనివార్యం. బీమాను పెట్టుబడిగా కాకుండా రక్షణగా భావించాలి. నలుగురు కుటుంబసభ్యులు ఉంటే ఆ గృహ యజమాని కనీసం రూ.50 లక్షల కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కనిష్ఠంగా రూ.కోటి వరకైనా టర్మ్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి.
9. రిటైర్మెంట్ ప్లానింగ్
ఒకప్పుడు రిటైర్మెంట్ వరకే.. ఇల్లు, పిల్లల పెండ్లిండ్లు ఈ బాధ్యతలన్నీ తీరిపోయేవి. చదువుల ఖర్చూ తక్కువగా ఉండేది. కొడుకులు, బిడ్డలు కూడా వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రుల గురించి ఆలోచించేవాళ్లు. ఇప్పుడు ఎవరి బతుకులు వాళ్లవి. ఎవరి భారాలు వాళ్లవి. కాబట్టి ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేయడం తప్పనిసరి. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్పీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీ ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయి. లిక్విడ్ అసెట్ ఉండేలా జాగ్రత్తపడటం చాలా అవసరం. మీరు ఉన్నంత కాలం ఆదాయం వచ్చే ప్లాన్స్ ఎంచుకోవాలి.
10. అనివార్యం ఆర్థిక క్రమశిక్షణ
ఎంత ఆదాయం ఉన్నా.. ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే అప్పులపాలు కావడానికి పెద్ద సమయం పట్టదు. ఆదాయానికి సరిపడా అప్పులే కదా అని నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తే… ఐదు లక్షల అప్పు రెండేండ్లలో పది లక్షలకు చేరిపోతుంది. అప్పు పది లక్షలు దాటిందో రొటేషన్లు చేయాల్సిన దుస్థితి దాపురిస్తుంది. చూస్తుండగానే పది.. ఇరవై, ఇరవై.. నలభై లక్షలై కూర్చుకుంటుంది. అందుకే, లక్ష ఆదాయం ఉన్న వ్యక్తి అయినా సరే… అప్పు పది లక్షల మార్కుకు చేరుకుంటుందని అనిపిస్తే… తక్షణం అప్రమత్తం కావాల్సిందే! వాటిని కట్టడి చేయాల్సిందే!!
ఈ సూత్రాలను అనుసరించడం ద్వారా, మీరు మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా, సమర్థంగా నిర్వహించుకోవచ్చు. ఈ క్రమంలో ఎవరో బయటి వ్యక్తుల సలహాల కన్నా… మీ ఆలోచనలు, అప్పులు, ఆదాయ వివరాల గురించి ఇంట్లోవాళ్లతో పంచుకోండి. మిమ్మల్ని వాళ్లు అర్థం చేసుకున్నంతగా మరే బయటి వ్యక్తీ అర్థం చేసుకోలేడు కదా! అందుకే, మీ పరిస్థితిని వారికి వివరించి.. సలహా కోరండి. అప్పు తప్పును ఆదిలోనే దిద్దుకోండి. ముప్పుగా పరిణమించిన తర్వాత చేపట్టే దిద్దుబాటు చర్యలు.. కంటితుడుపు మాత్రమే అవుతాయి తప్ప పూర్తిస్థాయి పరిష్కారం కావు!
మనసు బాగోకపోతే… దివాళా!
ఆర్థిక సమస్యలు మనిషిని మానసిక ఒత్తిడికి లోను చేస్తాయని తెలుసు. కానీ మానసిక ఒత్తిడి మరిన్ని ఆర్థిక సమస్యలకి దారితీస్తుందనీ… ఇదొక విషవలయం అనీ ఎప్పుడన్నా అనిపించిందా! ఈ విషయంలోని నిజానిజాలను తెలుసుకునేందుకు బ్రిటన్‌కు చెందిన ‘మనీ అండ్ మెంటల్ హెల్త్ పాలసీ ఇన్స్టిట్యూట్’ ఒక పరిశోధనను నిర్వహించింది. ఇందులో భాగంగా 5,500 మంది అభిప్రాయాలను సేకరించింది. మానసికమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారి ఆర్థిక జీవితం ఏమంత సజావుగా సాగడం లేదని ఈ పరిశోధన నిరూపించింది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయడం, అవసరం లేకున్నా అప్పులు తీసుకోవడం, ఆదాయాన్ని కాపాడుకోలేకపోవడం… ఇలా డబ్బు మీద నియంత్రణని కోల్పోతున్నారని తేలింది. చాలా తక్కువ ఆదాయం కలిగినవారు కూడా ఇలా ఆర్థిక నియంత్రణను కోల్పోవడం ఆశ్చర్యకరం! ఈ సంస్థ నివేదిక ప్రకారం, మానసిక ఒత్తిడిలో ఉన్నవారిలో…
ఇలా తీర్చేద్దాం..
అప్పు తీర్చడానికి అప్పు..
కొందరు తమ పలుకుబడితో రుణాలు రొటేషన్ చేస్తుంటారు. ‘హమ్మయ్య! ఈ పూటకు గండం గడిచింది’ అని సంబరపడుతుంటారు కూడా! కానీ, అప్పు తీర్చడానికి అప్పు చేయాల్సి వస్తుందంటే ఆ వ్యక్తి రెడ్ జోన్లో ఉన్నాడని గ్రహించాలి. చిన్నచిన్న అప్పులు తీర్చడానికి పెద్ద అప్పు చేస్తుంటారు. వడ్డీ సహా అది రెండింతలు అయ్యాక.. దాన్ని తీర్చడానికి మరో భారీ రుణం చేస్తారు. ఇలా ఎన్ని రోజులు? రుణచట్రంలో ఇరుక్కుంటే ఓ పట్టాన బయటపడలేం. ఆనందాల కోసం, లగ్జరీల కోసం అప్పు చేయడం అర్థశాస్త్ర రీత్యా పెద్ద నేరం.
అలాంటి నేరానికి పాల్పడితే.. జీవితాన్ని చేజేతులా అగాధంలోకి నెట్టుకున్నట్లే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు.. ఎదురింటి వాళ్లకు ఉంది కదా అని 72 అంగుళాల టీవీ కోసమో, ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనాలనో, అబ్బాయికి కొత్త బైక్ కొనివ్వాలనో, అమ్మాయికి డైమెండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇవ్వాలనో, నలుగురిలో దర్జాగా కనిపించాలనో రుణాలు తీసుకుంటే.. వాటిని తీర్చలేక రోడ్డున పడే రోజు రావచ్చు. రుణదాతల ఒత్తిడి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపొచ్చు. అంతవరకూ రావొద్దంటే ఉన్నదాంట్లో సర్దుకుపోవడం అలవాటుగా మార్చుకోవాలి. ‘అప్పు లేని వాడె అధిక సంపన్నుడు’ అని వేమన వాక్యాన్ని మించిన ఆర్థిక సూత్రం మరొకటి లేదు కదా!