పక్కింటివాడు కన్నుమూసినా… పలకరించడానికి ఆలోచిస్తున్న రోజుల్లో ఉన్నాం. అలాంటి చోట.. ఆ గ్రామంలో ఎవరు చనిపోయినా.. ఆ బాధను ఊరంతా మోస్తుంది. కన్నుమూసిన వ్యక్తికి తుది వీడ్కోలు పలకడానికి అందరూ తరలివస్తారు. కాటి దాకా సాగనంపి ఊరుకోరు. పోయినవారి కుటుంబసభ్యులను ఓదార్చిన చేతులతోనే రెండు కట్టెలు తెచ్చి చితిలో పేరుస్తారు. ఒకరు పంచుకోకపోయినా సంతోషం సగం బలాన్నిస్తుంది. కానీ, నలుగురూ చేయి వేస్తేనే దుఃఖం తేలిక అవుతుందన్న సూత్రాన్ని తరతరాలుగా పాటిస్తున్నారు నిర్మల్ జిల్లాలోని పోతారం గ్రామస్తులు. చివరి మజిలీ వరకు తోడుగా నిలుస్తూ… సామాజిక బాధ్యతను చాటి చెబుతున్నారు.
నిర్మల్ జిల్లా మామడ మండలంలో ఉంటుంది పోతారం గ్రామం. ఈ ఊళ్లో 400 గడపలు ఉండగా, జనాభా వెయ్యికి పైమాటే! ఒక్కో ఊరికి ఒక్కో ఆచారం ఉన్నట్టే.. పోతారం గ్రామానికీ ఓ ఆనవాయితీ ఉంది. తాతలనాటి నుంచి వస్తున్న సంప్రదాయాన్ని నేటి 5జీ యుగంలోనూ తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు ఈ గ్రామస్తులు. ఊళ్లో ఎవరు చనిపోయినా కలిసికట్టుగా వారి దహనక్రియలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. గ్రామంలో ఉన్న కుటుంబాలన్నీ 40 మంది చొప్పున పంతలు (బృందాలు)గా ఏర్పడి ఒక్కో బృందం ఒక్కో దహనక్రియలు నిర్వహిస్తారు. కులాలకు అతీతంగా అందరూ ఒకరి భారాన్ని పంచుకుంటారు.
ఆ ఊరిలో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు బృందంలోని 40 మంది ఆ రోజు తమ వ్యక్తిగత పనులను రద్దు చేసుకుంటారు. ఊరి నడిబొడ్డున వాహనం ఉంచి శవ దహనం కోసం తలా రెండు కట్టెలు తెచ్చి అందులో వేస్తారు. అంతటితో తమ పని ముగిసిందని ఊరుకోరు. పాడే కట్టి మృతదేహాన్ని సకల లాంఛనాలతో శ్మశాన వాటికకు తరలిస్తారు. అక్కడ చితి పేర్చి, అంత్యక్రియలు ముగిసే వరకూ అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. మూడు రోజుల కార్యానికి, దశదిన కర్మకు కూడా దగ్గరుండి పనులన్నీ చేస్తారు. మగవారితో పాటు వాళ్ల ఇండ్లలోని ఆడవాళ్లు కూడా ఈ క్రతువులో భాగస్వాములవుతారు. మృతుల కుటుంబసభ్యులను, బంధువులను ఓదార్చి.. వారి భోజన వ్యవహారాలూ అన్నీ చూసుకుంటారు. స్వార్థం పెరిగిపోయిన నేటి సమాజంలో పొరుగువారి కష్టాల్లో తోడుగా నిలిచి అబ్బురపరుస్తున్నారు పోతారం గ్రామస్తులు.
దశాబ్దాల కిందటే గ్రామంలో ఈ ఆచారం మొదలైందని స్థానికులు చెబుతారు. తమ పూర్వికులు చూపిన బాటలోనే తామూ నడుస్తున్నామని అంటున్నారు. ఒకప్పుడు ఒకరిద్దరు మాత్రమే ఈ బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారట. రానురాను ఊరంతా ఇందులో భాగమవ్వడం మొదలైందట. తమ కండ్లముందు పుట్టి, కండ్లముందే పోయిన వ్యక్తికి ఇంతకన్నా ఏం చేసి రుణం తీర్చుకోగలం అంటారు పోతారం వాసులు. మనిషి పోయినప్పుడు ఆ కుటుంబం దుఃఖంలో మునిగిపోతుంది. ఇలాంటి ఆపత్కాలంలో మేమున్నామంటూ ముందుకు రావడం కన్నా గొప్ప ఓదార్పు ఇంకేం ఉంటుందని తమ పూర్వికులు ఈ సంప్రదాయం ప్రారంభించి ఉంటారని చెబుతారు.
గ్రామంలోని వారంతా పంతలుగా ఏర్పడి చనిపోయిన వారికి దహనక్రియలు నిర్వహించేందుకు ప్రతినెలా చిట్టీలు నిర్వహిస్తుంటారు. అలా తామంతా పొదుపు చేసుకున్న డబ్బును కొంత దహనక్రియల సమయంలో ఉపయోగిస్తారు. మిగిలిన సొమ్మును అవసరమైన వారికి తక్కువ వడ్డీకి అప్పుగా ఇస్తుంటారు. ఆ వచ్చిన వడ్డీని దహన క్రియల కోసం జమ చేస్తుంటారు. ప్రస్తుతం ఒక్కో బృందంలో సుమారు రూ.4 లక్షలకు పైగా నగదు జమచేశారు. ఈ మొత్తాన్ని అవసరమైన కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉపయోగిస్తుంటారు. ‘మనిషి ఒంటరిగా పుట్టినా.. పోయేటప్పుడు మాత్రం అందరి ప్రేమానురాగాలను తోడు తీసుకెళ్లాలి మిత్రమా’ అంటున్న పోతారం నేటి సమాజానికి మేటి ఆదర్శం!
– రాజు పిల్లనగోయిన